మన రాష్ట్ర రాజధాని అమరావతి అని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్టణాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయే సభాపక్షనేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలు ఇచ్చారని.. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. రాష్ట్రంలో అరాచకానికి, అశాంతికి చోటులేదన్నారు. శిథిలమైన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలన్నారు. కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తి ఎప్పటికీ మరిచిపోలేనని చంద్రబాబు చెప్పారు. తాను జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారని.. అక్కడే టిడిపి, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలిపారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బిజెపి, టిడిపి, జనసేన పొత్తు పెట్టుకుందని అన్నారు. కేంద్రం సహకారంతో పోలవరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో నదులు అనుసంధానించి ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తాం. ప్రజస్వామ్యయుతంగా ప్రజాహితం కోసం పనిచేస్తామని చెప్పారు.