మన తెలంగాణ / హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 30వ తేదీ సాయంత్రం తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ఒకటో తేదీన ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలు దేరి అమరావతికి చంద్రబాబు రానున్నారు. మరుసటి రోజు బెజవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న , సింహాచలం అప్పన్న దర్శనానికి చంద్రబాబు వెళ్ళనున్నారు. కంటి ఆపరేషన్ తర్వాత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్నారు.
ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల అనంతరం డిసెంబర్ మొదటి వారంలో చంద్రబాబు మళ్లీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారని టిడిపి నేతలు తెలిపారు. కాగా చంద్రబాబుకు అటు కోర్టులోనూ తనకు అనుకూల వాతావరణం నెలకొనడంతొనే ఆయన తిరుమల దర్శనానికి శ్రీకారం చుడుతున్నట్లు చెబుతున్నారు. తాజాగా మద్యం కేసులో టిడిపి అధినేత చంద్రబాబునాయుడికి ఊరట లభించిందన్నది తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.