Wednesday, January 22, 2025

‘చంద్రముఖి 2’లో నిజమైన చంద్రముఖి ఉంటుంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ నెల 28న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఈ సినిమా నుంచి సెకండ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో రాఘవలారెన్స్ మాట్లాడుతూ “దర్శకుడు వాసు చెప్పిన ‘చంద్రముఖి2’ మూవీ కథ నాకు బాగా నచ్చింది. రజనీకాంత్ చేసిన రోల్‌లో నేను నటించడం అంటే ఆ రాఘవేంద్ర స్వామి అదృష్టం అని అనుకోవాలి. సూపర్‌స్టార్ చేసిన ఆ పాత్రను నేను అంత గొప్పగా చేయగలనా? అని ఆలోచించలేదు.

నా పాత్రకు నేను న్యాయం చేస్తే చాలని అనుకొని చాలా భయపడుతూ నటించాను. కంగనా రనౌత్ వంటి పెద్ద స్టార్‌తో నటించడం లక్కీ. ఆమె చంద్రముఖి పాత్రలో భయపెట్టారు. దర్శకుడు వాసుతో ఇదివరకు శివలింగ అనే సినిమా చేశాను. ఆ సినిమాకు పూర్తి భిన్నంగా చంద్రముఖి 2 మూవీ చేశాం”అని అన్నారు. కంగనా రనౌత్ మాట్లాడుతూ “నేను ఇంతకు ముందు దక్షిణాదిలో సినిమాలు చేశాను. తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో నటించాను. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను ‘చంద్రముఖి 2’తో పలకరిస్తాను. ఈ మూవీలో చంద్రముఖి పాత్ర తెలుగులో మాట్లాడుతుంది. చంద్రముఖి మూవీలో కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఎలాగైతే మిక్స్ అయి ఉంటాయో చంద్రముఖి 2 సినిమాలోనూ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ‘చంద్రముఖి’లో జ్యోతికను చంద్రముఖి ఆవహిస్తుంది. చంద్రముఖి 2 సినిమాలో నిజమైన చంద్రముఖి పాత్ర ఉంటుంది.

దాని కోసం దర్శకుడు వాసు కొత్తగా నా పాత్రను తీర్చిదిద్దారు”అని తెలిపారు. దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ “చంద్రముఖి సినిమాతో చంద్రముఖి 2 మూవీని లింక్ చేసి ఈ కథను సిద్ధం చేశాను. ఖచ్చితంగా ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుంది. తెలుగులో నాగవల్లి సినిమా ఉంది. అందులో డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. కానీ ఇందులో 17 ఏళ్ల ముందు కోట నుంచి వెళ్లిపోయిన చంద్రముఖి మళ్లీ ఎందుకు వచ్చిందనే పాయింట్‌తో చేశాను. సూపర్ స్టార్ రజనీకాంత్ పాత్రలో రాఘవ లారెన్స్ నటించారు. ఆస్కార్ విన్నర్ కీరవాణితో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది”అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహిమా నంబియార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News