మహారాష్ట్రలో వినూత్న కార్యక్రమం
చంద్రాపూర్: కరోనా వైరస్ను పారద్రోలేందుకు మహారాష్ట్రలోని చంద్రాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించేందుకు వ్యాక్సినేషన్ బంపర్ లక్కీ బహుమతిని మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకునే ప్రజలు ఎల్ఇడి టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు తదితర గృహోపయోగ వస్తువులను లక్కీ డ్రాలో గెలుచుకోవచ్చని మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 24వ తేదీ వరకు ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా వ్యాక్సిన్ వేసుకునే ప్రజలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అర్హులని బుధవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. నగర మేయయర్ రాఖీ సంజయ్ కంచర్లవర్ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ అధికారుల సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్, రెండవ బహుమతిగా వాషింగ్ మెషిన్, మూడవ బహుమతిగా ఎల్ఇడి టివి లభిస్తాయని, ఇవి గాక కన్సొలేషన్ బహుమతిగా 10 మందికి మిక్సర్-గ్రైండర్లు అందచేస్తామని మున్సిపల్ కమిషనర్ రాజేష్ మోహితే తెలిపారు.