Thursday, February 27, 2025

భరతమాత ముద్దుబిడ్డ ఆజాద్

- Advertisement -
- Advertisement -

ఆ పేరు చెప్తే బ్రిటీష్ పాలకుల గుండెల్లో గుబులు రేగుతుంది. ఆ పేరు వింటే తెల్లదొరల వెన్నులోవణుకు పుడుతుంది. బ్రిటీషర్ల దాస్యశృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి కలిగించడంకోసం ఎందరో మహాత్ములు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. వారిలో ఒకరు చంద్రశేఖర్ అజాద్. చంద్రశేఖర్ ఆజాద్ పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారావ్‌ు ప్రసాద్ తివారి. 1906 జులై 23న మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలోని భవ్రా పట్టణం, నగర పంచాయతీలో పండిట్ సీతారాం తివారీ, జగ్రాణి దేవి దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్యను ఝబువా జిల్లాలోని భవ్రా గ్రామంలో, ఉన్నత విద్యను వారణాసిలోని కాశీ విద్యాపీఠంలో అభ్యసించాడు. చదువులో రాణించలేక 13వ ఏట ముంబయికి పారిపోయి ఓ మురికివాడలో కూలీగా పనిచేసి దేశ స్వాతంత్య్ర కాంక్షతో తిరిగి పోరాటంలోకి వచ్చి అమరవీరుడయ్యాడు.

నేడు ఆ మహావీరుడి 94వ వర్ధంతి. బ్రిటీష్ వలసవాదం నుండి స్వాతంత్య్రం కోసం భారత విప్లవాత్మక ఉద్యమంలో అత్యంత ఆకర్షణీయమైన హీరోలలో చంద్రశేఖర్ ఆజాద్ వారిలో మణిహారంలో కలిగితురాయి లాంటివారు. వాస్తవానికి ఆజాద్ హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీకి నాయకుడు. దానికి భగత్ సింగ్ రాజకీయ సిద్ధాంతకర్త అయితే, ఆజాద్ దాని సాయుధ విభాగానికి కమాండర్- ఇన్ -చీఫ్. 1931లో ఇద్దరూ ఒకరికొకరు ఒక నెల వ్యవధిలో అమరవీరులయ్యారు. ఇద్దరూ రాబోయే కాలాలకు భారతీయ యువతకు చిహ్నాలుగా మారారు. వారు తమ విప్లవాత్మక జీవితం, వలసవాద బారినుండి భారత స్వేచ్ఛకోసం బలిదానం చేసిన సమయంలో చేసినట్లుగానే నేటికీ స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం పోరాడే యువతకు ఆదర్శం. బ్రిటీష్ పాలకుల నుంచి దేశ దాస్యశృంఖలాల విముక్తికోసం పోరాడిన వీరులు ఎందరో ఉన్నారు. నీ పేరేంటి అంటే ఆజాద్ అని, తండ్రి పేరు స్వాతంత్య్రం అని, అడ్రస్ జైలు అని 15 ఏళ్ల కుర్రాడు ధైర్యంగా ఈ సమాధానాలు చెబుతుంటే న్యాయమూర్తికి ఎక్కడలేని కోపం వచ్చింది. 23 వారాల జైలు రోజూ 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు.

ఆ క్షణమే మళ్లీ జీవితంలో ఆంగ్లేయులకు దొరక బోనని ప్రతినబూనిన ఆ కుర్రవాడు చంద్రశేఖర్ ఆజాద్‌గా పేరొందాడు. తల్లి కోరిక మేరకు ఉన్నత చదువుకోసం వారణాసి సంస్కృత పాఠశాలలో చేరాడు. అక్కడ ఉండగానే జలియన్‌వాలాబాగ్ ఊచకోత చోటుచేసుకుంది. ఆగ్రహంతో కదిలిపోయిన ఆజాద్ జాతీయోద్యమంలో దూకాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అరెస్టయినప్పుడే న్యాయమూర్తికి ధైర్యంగా సమాధానాలిచ్చి జైలుపాలయ్యాడు. అప్పుడే మళ్లీ జైలుకు రానని స్వేచ్ఛగా మరణిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇంతలో చౌరీచౌరా సంఘటనానంతరం భారతీయులపై జరిగిన హత్యాకాండను చూసి చలించపోయి ఆయన విప్లవకారుడుగా మారాడు. ఎలాగైనా భారత్‌కు బ్రిటీష్ వారి నుంచి విముక్తి కలిగించాలని విప్లవమార్గం వైపు మళ్లాడు. రావ్‌ు ప్రసాద్ బిస్మిల్, అషఫ్రుల్లాఖాన్‌ల ప్రభావంతో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌ఎ)లో చేరాడు. కకోరి రైలు దోపిడీ తర్వాత బిస్మిల్ తదితరులను ఆంగ్లేయ ప్రభుత్వం అరెస్టు చేసి ఉరితీసింది. ఈ కేసులో పట్టుబడకుండా తప్పించుకున్న ఆజాద్, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ తదితరులతో కలసి హెచ్‌ఆర్‌ఎను హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఆర్‌ఎ) గా పునర్వవస్థీకరించాడు.

ఝాన్సీ సమీపంలోని అడవుల్లో సహచరులకు తుపాకీ కాల్చటంలో శిక్షణ ఇచ్చాడు. మూడేళ్ల పాటు ఈ బృందం ఆంగ్లేయులకు చుక్కలు చూపించింది. 1926లో ఏకంగా వైస్రాయ్ ప్రయాణిస్తున్న రైలునే పేల్చేయటానికి ప్రయత్నించింది. లాహోర్‌లో భగత్‌సింగ్‌తో కలసి డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ను కాల్చిచంపింది. ఆ ఘటనలో కూడా ఆజాద్ తుపాకీకి పనిచెప్పాడు. కుటుంబ నేపథ్యాలు భిన్నమైనా ఆజాద్, భగత్‌లకు మంచి స్నేహం కుదిరింది. ఇద్దరూ సమాజంలో సమానత్వం, ఆంగ్లేయుల నుంచి విముక్తిని బలంగా కోరుకున్నారు. లాహోర్ దాడికి ముందు ఎవర్ని పెళ్లాడతావ్ అని భగత్‌సింగ్ సరదాగా అడిగితే.. ‘బవ్‌ుతుల్ బుఖారాగా పిలుచుకొనే తన పిస్తోల్‌తో పెళ్లి ఎప్పుడో అయిపోయింది’ అని బదులిచ్చాడు ఆజాద్. ఎంత ప్రయత్నించినా దొరక్కుండా తప్పించుకుంటూ ఆజాద్ ఆంగ్లేయులకు కంట్లో నలుసుగా మారాడు. 1931 ఫిబ్రవరి 27న సుఖ్‌దేవ్‌తో మాట్లాడటానికి అలహాబాద్‌లోని ఆల్‌ఫ్రెడ్ పార్క్‌కు చేరుకున్నాడు.

ఆజాద్ పాత సహచరులిద్దరు దీనిపై ఆంగ్లేయ సిఐడి అధికారి నాట్‌బోవర్‌కు సమాచారం అందించారు. వెంటనే బ్రిటీష్ పోలీసులు పార్క్‌ను నాలుగు వైపుల నుంచీ చుట్టుముట్టారు. కాల్పులు మొదలయ్యాయి. సుఖ్‌దేవ్ తప్పించుకొని పారిపోగా ఆజాద్ దొరికిపోయాడు. చెట్టుచాటు నుంచి కాలుస్తూ తప్పించుకోవాలని చూసినా కుదరలేదు. చివరకు పోలీసులు దగ్గరికి వస్తుండటంతో ఆంగ్లేయులకు పట్టుబడననే ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ చివరి బుల్లెట్‌ను తన తలకే గురిపెట్టుకొని ప్రాణాలు విడిచాడు ఆజాద్. అప్పుడు ఆయన మృతదేహాన్ని ప్రజలకు చెప్పకుండా శ్మశానానికి తరలించింది ఆంగ్లేయ ప్రభుత్వం. కానీ ఎలాగోలా విషయం తెలియగానే ప్రజలు అక్కడికి భారీస్థాయిలో చేరుకున్నారు. ఆయన చితాభస్మాన్ని తీసుకొని ఊరంతా ఊరేగించారు. ఆజాద్ మరణించిన ఆ పార్క్‌కు ఇప్పుడు ఆయన పేరే పెట్టారు. నేడు సమాజంలో సామాజిక స్పృహ కొరవడుతోంది. చదువు, ఉద్యోగం, కుటుంబం తప్ప సమాజం, దేశం కోసం పని చేయాలనే తపన తగ్గిపోతోంది.

నాకేంటి? అనే స్వార్థం ఆవరిస్తోంది. చుట్టూ అన్యాయం జరుగుతున్నా, నిర్బంధం కొనసాగుతున్నా స్పందించలేకపోతున్నాం. నిర్బంధాన్ని, అణచివేతను తన జీవితంలో ఏ కోశానా ఒప్పుకోని అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తి. నేటి పరిస్థితుల్లో చంద్రశేఖర్ ఆజాద్‌ను స్మరించుకోవడం అంటే రోజురోజుకు దేశంలో పెరుగుతున్న నియంతత్వ పరిస్థితులు,స్వేచ్ఛ మీద, స్వేచ్ఛ కోసం పోరాడేవారి మీద దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. దబోల్కర్, గోవింద్ పన్సారే, గౌరీ లంకేష్ తదితరులను హత్య చేసిన ఘటనలు మన కళ్ళ ముందే జరిగాయి. మూఢనమ్మకాలు, అశాస్త్రీయమైన పద్ధతులు, హేతువాదంపై దాడి, సామాజిక అణిచివేత వంటి దౌర్భాగ్య పరిస్థితులను ఎదురించి పోరాడటమే నేడు చంద్రశేఖర్ ఆజాద్‌కు మనమిచ్చే నిజమైన నివాళి.

(నేడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి)

నాదెండ్ల శ్రీనివాస్, 9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News