బెంగళూరు : చంద్రయాన్ 3 ల్యాండర్‌లోని ఒక పరికరం చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో ఒక ప్రదేశం మార్కర్‌గా పని చేయడం ప్రారంభించినట్లు భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం వెల్లడించింది. చంద్రయాన్ 3 ల్యాండర్‌లోని లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ అర్రే (ఎల్‌ఆర్‌ఎ) చంద్రునిపై నిర్దిష్ట ప్రదేశం గుర్తింపు సాధనంగా పని చేయసాగినట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలియజేసింది.
అమెరికన్ అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన లూనార్ రికనాయజెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌ఒ) నిరుడు డిసెంబర్ 12న ఎల్‌ఆర్‌ఎ ప్రతిఫలిస్తున్న సంకేతాలను విజయవంతంగా కనుగొనడం ద్వారా ఎల్‌ఆర్‌ఎను ఉపయోగిస్తూ లేజర్ శ్రేణి కొలత సాధించినట్లు ఇస్రో తెలిపింది. నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఎ అంతర్జాతీయ సహకారం కింద చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్‌పై పొందుపరిచింది. చంద్రుని దక్షిణ ధ్రువం సమీపాన నిరుడు ఆగస్టు 23న దిగిన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ అప్పటి నుంచి లూనార్ ఆర్బిటర్ లేజర్ ఆల్టీమీటర్ (ఎల్‌ఒఎల్‌ఎ) కోసం అందుబాటులోకి వచ్చినట్లు ఇస్రో తెలియజేసింది.