Monday, December 23, 2024

చంద్రయాన్ 3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రయాన్ 3 ద్వారా అసాధారణ విజయం నమోదు చేశామని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఈమేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్టు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని నేరుగా బెంగళూరు వచ్చారు. విమానాశ్రయం వద్దకు వచ్చిన అభిమానులకు మోడీ అభివాదం చేశారు. అక్కడి నుంచి నేరుగా పీణ్య లోని ఇస్రో కేంద్రానికి వెళ్లి, శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా చంద్రయాన్ 3 ప్రయోగం తీరును ప్రధానికి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వివరించారు. అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించారు. “జై విజ్ఞాన్… జై అనుసంధాన్ ” నినాదం ఇచ్చారు.

ఇది అసాధారణ విజయం
“ ఇస్రో సాధించిన విజయం చారా గర్వకారణం. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నా. నా మనసంతా చంద్రయాన్ 3 విజయంపైనే ఉంది. విజయం పట్ల శాస్త్రవేత్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది అసాధారణ విజయం. చంద్రుడిపై భారత్ అడుగు పెట్టింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాం. ఇప్పుడు భారత్ చంద్రుడిపై ఉంది. మనసత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని నిరూపించాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసింది. చంద్రయాన్ 3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు పెట్టుకుందాం. 2019లో చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశానికి గుర్తింపునిస్తూ దానిని ‘తిరంగా పాయింట్ ’ అని పిలుచుకుందాం.

ఇంటిపైనే కాదు… చంద్రుడి పైనా మన త్రివర్ణ పతాకం
చంద్రయాన్ 2 వైఫల్యంతో మనం వెనకడుగు వేయలేదు. మరింత పట్టుదలతో పనిచేసి చంద్రయాన్ 3 విజయం సాధించాం. ఇప్పుడు ప్రతి ఇంటిపైనే కాదు, చంద్రుడి పైనా త్రివర్ణ పతాకం ఎగురుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళ్తోంది. ప్రపంచానికే భారత్ దిక్సూచిగా మారుతోంది. చంద్రయాన్ 3 కృషిలో మహిళా శాస్త్రవేత్తలు ఉండటం గర్వకారణం. మన నారీ శక్తి ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటాం. ఇస్రో సాధించిన విజయం ఎన్నో దేశాలకు స్ఫూర్తినిస్తుంది.

ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం
‘ మేకిన్ ఇండియా ’ ఇప్పుడు చంద్రుడి వరకు సాగింది. మంగళ్‌యాన్, చంద్రయాన్ విజయం స్ఫూర్తిని కొనసాగిద్దాం. ఈ విజయాల స్ఫూర్తితో గగన్‌యాన్‌కు సిద్ధమవుదాం. ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకుందాం. అంతరిక్ష విజ్ఞానంతో ఎన్నో ఫలితాలు అందుకోవాలి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఈ విజ్ఞానం ఉపయోగపడాలి. తుపానులను అంచనా వేయడంలో మరిం త నైపుణ్యం సాధించాలి. వాతావరణ మార్పులను మరింత కచ్చితంగా తెలుసుకోవాలి ” అని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News