న్యూఢిల్లీ : భారతదేశపు అత్యంత కీర్తి ప్రతిష్టాత్మక, ఆసేతుహిమాచల జనస్పందన అయిన చంద్రయాన్ 3 శాటిలైట్ వెనుక నాలుగు సంవత్సరాల అవిశ్రాంత కృషి దాగి ఉంది. దేశంలో కరోనా క్లిష్టతల దశలోనూ చంద్రుడివద్దకు మన నౌకను పంపించే బృహత్తర కార్యక్రమం ఆగలేదు. ఈ ప్రక్రియలో పలువురు శాస్త్రజ్ఞుల బృందాలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. చంద్రయాన్ 3 మిషన్ ఎందరో మహానుభావులైన సైంటిస్టుల మేధో మథనం ఫలితంగా పురుడుపోసుకుంది. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ అంతరిక్ష విజయ యజ్ఞంలో దాదాపుగా వేయి మంది ఇంజనీర్లు పాలుపంచుకున్నారు . చంద్రయాన్ రూపకల్పనలో పాలుపంచుకుని, ఈ ప్రక్రియ ముందుకు సాగేందుకు పాటుపడ్డ పలువురిలో కొందరు వీరే ….
ఎస్ సోమనాథ్ (శ్రీధరన్ పాణికర్ సోమనాథ్ భారతి…ఇస్రో ఛైర్మన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్ చంద్రయాన్ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. చంద్రుడిపై మన వ్యోమనౌకను వాలేలా చేసేందుకు అవసరం అయిన అత్యంత కీలకమైన రాకెట్ లాంఛ్ వెహికల్ మార్క్ 3 లేదా బాహుబలిని రూపొందించడంలో సోమనాథ్ విశేష పాత్ర పోషించారు. ఆయన ఓ ఏరోస్పేస్ ఇంజినీరు. చంద్రయాన్ 3ను నిర్ణీత కక్షలోకి పంపించేందుకు ఈ రాకెట్ అత్యంత ప్రధాన భూమిక వహించింది. ఇస్రోను ఆయన చంద్రయాన్ 3 దిశలో సజావుగా నడిపించేందుకు నిర్మాణాత్మక నాయకత్వం ప్రదర్శించారు. ఇస్రోకు చెందిన ఇంజినీర్లు, సైంటిస్టులు, సాంకేతిక సిబ్బంది అంతా కూడా ఆయన సూచనలు సలహాలతో ముందుకు సాగారు. చంద్రయాన్ 3 శాటిలైట్ సమర్థధంతంగా ముందుకు సాగేందుకు అవసరమైన పరీక్షలు సవ్యంగా నిర్వహించేందుకు ఆయన గురుతర బాధ్యతను తీసుకున్నారు. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ సైన్సెస్ పూర్వ విద్యార్థి అయిన సోమనాథ్ ఇక్కడి ఇస్రో కేంద్రం ఛైర్మన్ కావడం కీలకం.
ఆయనో నటుడు కూడా
ఎస్ సోమనాథ్ నటుడు కూడా యానం అనే సంస్కృత సినిమాలో ఆయన నటించారు. సంస్కృతం కూడా అనర్గళంగా మాట్లాడే ప్రతిభావంతుడు అయిన సోమనాథ్ పేరులోనే మరో విశేషం ఉంది. సోమనాథ్ అంటేనే చంద్రనాథుడు లేదా చంద్ర భగవానుడు .
ఉన్నికృష్ణన్ నాయర్ ఎస్ డైరెక్టర్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం , తిరువనంతపురం
భారతదేశ రాకెట్ల తయారీ కేంద్రానికి ఆయన సారధ్యం వహిస్తున్నారు. అంతరిక్ష రాకెట్లతో ఇండియా ఇప్పుడు వినువిధులలో విలువైన రీతిలో రాకెట్లు, శాటిలైట్ల ప్రయోగానికి దిగుతూ వాణిజ్య పంథాను ఎంచుకుంది. ఈ క్రమంలో ఈ రాకెట్ కేంద్రానికి విశిష్టత ఏర్పడింది. ఆయన కూడా ఓ ఏరోస్పేస్ ఇంజినీరు. అంతరిక్షంలోకి భారతదేశం తరఫున వ్యోమగామిని పంపించే విశిష్ట కార్యక్రమంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన కూడా బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇనిస్టూట్ ఆఫ్ సైన్సెస్ పూర్వవిద్యార్థి. హ్యుమన్ స్పేస్ ఫ్లైయిట్ సెంటర్ తొలి డైరెక్టర్ . భారతదేశపు మరో అత్యంత కీలకమైన గగన్‌యాన్ ప్రాజెక్టుకు ఆయనే సారథి. లాంఛ్ వెహికల్ మార్క్ 3 ఆయన ఆధ్వర్యంలో నూటికి నూరుశాతం విజయాల రికార్డు సొంతం చేసుకుంది. ఆయన రచయిత కూడా చిన్న కథలు రాసే ఆయన ఇప్పుడు చంద్రుడి వద్దకు భారత్ సాగే కలవంటి కథను నిజం చేశారు.
వీరముత్తువెల్ పి , ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రయాన్, యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరు
చంద్రయాన్ 3 మిషన్‌కు వీరముత్తువెల్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించారు. గత నాలుగు సంవత్సరాలుగా వీర వేరే పనులకు దూరం అయ్యి , కేవలం ఈ చంద్రయాన్ 3 పరిధిలోనే తన జీవనచక్రాన్ని సాగించారు. ఇదే ఆయన లోకం అయింది. చంద్రయాన్ 2, మంగళయాన్ మిషన్‌లలో కూడా పాలుపంచుకున్నారు. ల్యాండర్ విక్రమ్ పట్ల ఆయనకున్న పరిజ్ఞానం ఇతరులకు ఎవరికి లేదు. 2019లో చంద్రయాన్ 2 దశలో విక్రమ్ మొరాయింపు ఇందుకు కారణాలను పూర్తిగా విశ్లేషించుకుని ఇప్పుడు అటువంటి పెడసరం ధోరణులు లేకుండా విక్రమ్‌ను రూపొందించారు. విక్రమ్ ల్యాండింగే చంద్రయాన్ 3 విజయానికి సోపానం అయింది.
కల్పన కె , డిప్యూటి డైరెక్టర్ చంద్రయాన్ 3 మిషన్ , ఆయు ఆర్ రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరు
కల్పన కె చంద్రయాన్ 3 ప్రాజెక్టు సారథ్యబాధ్యతలలోని ఒకరుగా తమ కీలక పాత్ర పోషించారు. కోవిడ్ మహమ్మారి దశలోనూ ఎదురైన పలు సమస్యలను అధిగమిస్తూ టీం ముందుకు సాగేందుకు ప్రధాన పాత్ర వహించారు. భారతీయ శాటిలైట్ల తయారీనే తన జీవితం అని ప్రకటించుకున్న కల్పన ఇంజినీరు. చంద్రయాన్ 2. మంగళయాన్‌లలో కూడా ఆమె తమ పాత్రపోషించారు.
ఎం వనిత , డిప్యూటీ డైరెక్టర్ యుఆర్ రావు శాటిటైల్ సెంటర్
చంద్రయాన్ 2 మిషన్‌కు వనిత ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇంజినీరు అయిన వనిత భారతదేశంలో చంద్ర మండల యాత్రకు సారధ్యం వహించిన తొలి మహిళగా ఘనత వహించారు. విఫలమైన చంద్రయాన్ 2 దశలోని క్లిష్టతలను సరిదిద్దడంలో వనిత కీలక పాత్ర వహించారు. దీనితో చంద్రయాన్ 3 కోసం ఆమె సేవలను విశేషంగా వినియోగించుకున్నారు. తోటపని అంటే ఎంతో ఇష్టపడే వనిత. చంద్రయాన్ 3లో తాను సైతంగా కదిలారు.
ఎం శంకరన్ డైరెక్టర్ యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరు
ఇస్రో పవర్‌హౌస్‌గా ఎం శంకర్‌కు పేరుంది. ప్రయోగించే శాటిలైట్లకు అవసరం అయిన ఇంధన వ్యవస్థల రూపకల్పనలో ఆయన దిట్టగా నిలిచారు. అత్యంత వినూత్నమైన పవర్ సిస్టమ్స్, సోలార్ పుంజాల నిర్మాణంలో ఆరితేరారు. వీటితోనే శాటిలైట్లు ఎంతటి ప్రతికూలతల నడుమ అయినా భేషుగా పనిచేసేందుకు వీలేర్పడుతుంది. శాటిలైట్ల తయారీలో మూడు దశాబ్దాల అనుభవం ఆయనది. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, మంగళయాన్ ప్రాజెక్టులకు ఆయన పనిచేశారు. ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన శంకరన్ ల్యాండర్ విక్రమ్ పనితీరును పలు రీతులలో పరిశీలించారు. ల్యాండర్ అత్యంత వేడి, శీతల పరిస్థితుల నడుమ కూడా సమర్థవంతంగా పనిచేసేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించారు. ముందుగా లూనార్ సర్ఫేస్ నమూనాను రూపొందించడంలో కీలక పాత్ర వహించారు.
వి నారాయణన్ , డైరెక్టర్ లిక్విడ్ ప్రాపుల్సన్ సిస్టమ్స్ సెంటర్ తిరువనంతపురం
లిక్విడ్ ప్రాపుల్సన్ ఇంజిన్లలో స్పెషలిస్టుగా వి నారాయణన్‌కు పేరుంది. విక్రమ్ ల్యాండర్ విజయవంతగా జాబిల్లిపై దిగేందుకు అవసరం అయిన లిక్విడ్ ప్రాపుల్సన్ సిస్టమ్స్, ప్రత్యేకించి థ్రస్టర్స్ రూపకల్పనలో ఆయన మేధోశక్తి ఎంతగానో ఉపయోగపడింది. అవసరం అయినప్పుడు, అవసరం అయిన తరహాలో ఇంధన జ్వలిత ప్రక్రియను చేపట్టడం చంద్రయాన్‌కు అత్యంత కీలక పరీక్షగా నిలిచింది. ఇందులో నెగ్గే దిశలో ఈ స్పెషలిస్టు ప్రత్యేక పాత్ర పోషించారు. ఐఐటి ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి అయిన నారాయణన్ క్రయోజెనిక్ ఇంజిన్ల తయారీలో దిట్ట. ఐస్రోకు చెందిన పలు రాకెట్ల తయారీలో ఆయన ముద్ర ఉంది. ఇప్పుడు చంద్రయాన్ 3కు వినియోగించిన లాంఛ్ వెహికల్ రాకెట్ కూడా ఆయన తయారీనే
బిఎన్ రామకృష్ణ డైరెక్టర్ ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ఇస్ట్రాక్ ) బెంగళూరు
చంద్రయాన్ 3 ఇప్పుడు చంద్రుడిపై చక్కర్లు సాగించేందుకు అవసరం అయిన అనుక్షణ సంకేతాలు, ఆదేశాలు వెలువరించడంలో ఇస్ట్రాక్ ప్రధాన పాత్ర పోషించింది. ఎప్పటికప్పుడు చంద్రయాన్ 3ను సవ్యంగా సాగేలా చేస్తూ, సరైన విధంగా చంద్రుడిపై వాలేందుకు అవసరమైన కమాండ్లను ఇక్కడి నుంచే వెలువరిస్తూ వచ్చారు. బెంగళూరు శివార్లలో దీనికి సంబంధించి భారతదేశపు అత్యంత భారీ డిష్ ఆంటెనా, 32 మీటర్ల అత్యంత విశాలమైన డిష్ ఇది. ఇక్కడి నుంచే విక్రమ్ ల్యాండర్‌కు ఆయువుపట్టు వంటి కమాండ్స్‌ను వెలువరించారు. ఇస్ట్రాక్‌కు చెందిన ఫ్లైయింగ్ సాసర్ వంటి భవనం నుంచే చంద్రయాన్ తుది దశ 20 నిమిషాల గగుర్పాటు స్థితిని తిలకిస్తూ , కాలంతో పోటీపడుతూ సందేశాలు వెలువరించడం ఇక్కడి నుంచే జరిగింది.
ఎ రాజరాజన్ , ఛైర్మన్ లాంఛ్ ఆథరైజేషన్ బోర్డు
ప్రఖ్యాత సైంటిస్టు అయిన ఎ రాజరాజన్ ఇప్పుడు శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం సంచాలకులు. ఏ అంతరిక్ష ప్రయోగం నిర్వహణకు సంబంధించి అయినా సరైన తుది అనుమతి ఇచ్చేది లాంఛ్ ఆథరైజేషన్ బోర్డు ద్వారానే. ఈ క్రమంలో అత్యంత కీలకమైన ఈ పాలక మండలికి సారధ్యం వహించిన రాజరాజన్ కంపోజిట్స్‌లో నిపుణులు. ఇటీవలి కాలంలో ఇస్రోకు చెందిన పలు ప్రయోగాలు జరగడం, ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్, ఎస్‌ఎస్‌ఎల్‌విలకు రాజరాజన్ మార్గదర్శకత్వం కీలకం అవుతోంది. ప్రయోగ ఘట్టాలకు అవసరం అయిన విధంగా ఏర్పాట్లు సాగించడం, ప్రయోగాలను విజయవంతం చేసేందుకు ప్రధాన సూచనలు వెలువరించడం అంతా కూడా ఈ బోర్డు ద్వారానే సాగుతుంది.