బెంగళూరు : ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా విజయవంతంగా దిగిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రగ్యాన్ లోని పేలోడ్‌లు చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు ప్రారంభిస్తాయి. ల్యాండర్ చేసే పరిశోధనలు నేరుగా భూమ్మీద ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్ చేసినప్పటికీ, రోవర్ మాత్రం ల్యాండర్‌కు మాత్రమే కమ్యూనికేట్ చేసే వీలుంది. ల్యాండర్ మాడ్యూల్ లేదా ల్యాండర్‌ను చంద్రుడి 100 కిమీ కక్ష లోకి ప్రవేశ పెట్టడమే ప్రొపల్షన్ మాడ్యూల్ ( పిఎం ) ప్రధాన విధి. ప్రొపల్షన్ మాడ్యూల్ లోనూ ఒక పేలోడ్ ఉంది.
దానిపేరు స్పెక్ట్రో పొలారిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (ఎస్‌హెచ్‌ఎపిఇ). చంద్రుడి చుట్టూ తిరుగుతూ స్పెక్ట్రోమీటర్ , ఉష్ణప్రసరణ పరిశీలక సాధనాల సహాయంతో చంద్రుడి మీద నుంచి భూమిపై పరిశీలన జరుపుతుంది. ఇది మూడు నుంచి ఆరు నెలలు పనిచేయనుంది.ఇక చంద్రయాన్‌లో వెళ్లిన ల్యాండర్ పేరు విక్రమ్.దీని బరువు 1749.8 కిలోలు (రోవర్‌తో కలిపి). దీని జీవితకాలం 14 రోజులు ( చంద్రుడిపై ఒక పగలుతో సమానం) . 2 మీటర్ల పొడవు, 2 మీ. వెడల్పుతో కూడిన ఈ ల్యాండర్‌లో నాలుగు పేలోడ్‌లను అమర్చారు.
ఆర్‌ఎఎమ్‌బిహెచ్‌ఎ: రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ ఇనోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ (రాంభా).చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా (అయాన్లు, ఎలక్ట్రాన్‌ల ) సాంద్రతపై అధ్యయనం చేస్తుంది.
చాస్టే : చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ ( చాస్టే). చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలుస్తుంది.
ఐఎల్‌ఎస్‌ఎ : ఇన్‌స్ట్రమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ : చంద్రయాన్ 3 దిగిన ప్రాంతంలో భూకంపాల తీవ్రతపై ఇది ప్రయోగాలు చేస్తుంది. జాబిల్లి పొరలు, మట్టి స్వభావాన్ని పరిశీలిస్తుంది. భవిష్యత్తులో ప్రయోగాలకు అనుగుణంగా ఇది ఉపయోగపడుతుంది.
ఎల్‌ఆర్‌ఎ: లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ అర్రే : ఇది అమెరికా అంతరక్ష పరిశోధక సంస్థ నాసాకు చెందిన పరికరం. చంద్రుడిపై గతి శాస్త్రాన్ని అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ల్యాండర్ హెజార్డ్ డిటెక్షన్ , అవాయిడెన్స్ కెమెరాతోసహా ఏడు సెన్సార్లు ఉన్నాయి. ఈ విధంగా ల్యాండర్‌లో మొత్తం ఆరు ప్రక్రియలున్నాయి. ల్యాండర్ లెగ్,రోవర్ ర్యాంప్( ప్రైమరీ, సెకండరీ) , రోవర్, ఐఎల్‌ఎస్‌ఎ , రాంభా, చాస్టే పేలోడ్‌లతోపాటు వీటిని అనుసంధానించే సురక్షిత వ్యవస్థ, ఎక్స్ బ్యాండ్ యాంటెన్నాలున్నాయి.రోవర్ఇక ల్యాండర్‌లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. దీని బరువు 26 కిలోలు. జాబిల్లి ఉపరితలంపై సురక్షితంగా దిగిన తర్వాత అందులో నుంచి బయటకు వస్తుంది. ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ 14 రోజులు పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్‌లున్నాయి.
ఎల్‌ఐబిఎస్ : లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ : గుణాత్మక , నిర్మాణాత్మక మూలకాలను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. ఈ పరికరంలో ఉన్న లేజర్ మట్టిపై పడుతుంది. అలా దాన్ని కరిగించడం ద్వారా అందులో ఉన్న రసాయన మూలకాలను, ఖనిజ సంపదను గుర్తించడంలో దోహదపడుతుంది.
ఎపిఎక్స్‌ఎస్ : ఆల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్టోమీటర్: ల్యాండింగ్ అయిన ప్రదేశం లోని మట్టి, రాళ్లలో ఉన్న రసాయనాలను గుర్తిస్తుంది. ముఖ్యంగా మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం వంటి మూలకాలను గుర్తించే పనిలో నిమగ్నమవుతుంది.
14 రోజులే అయినప్పటికీ…
సోలార్ ప్యానెల్‌ల ద్వారా శక్తిని పొందే విక్రమ్, ప్రగ్యాన్‌ల జీవితకాలం 14 రోజులే. అందుకే చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. సూర్యాస్తమయం అయ్యాక, మొత్తం అంధకారంగా మారుతుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ల్యాండర్, రోవర్ వ్యవస్థలు మనుగడ సాగించడం సాధ్యం కాదు. 14 రోజుల తరువాత అక్కడ మళ్లీ సూర్యోదయం కాగానే ల్యాండర్, రోవర్‌లపై సూర్యరశ్మిపడి , ఒకవేళ మళ్లీ అవి పనిచేస్తే మరింత ప్రయోజనమేనని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ల్యాండర్ క్రియాశీలం అయితేనే భూమికి సంకేతాలు చేరే అవకాశం ఉంటుంది.