బెంగళూరు : చంద్రుడి వైపు మన అడుగులు క్రమేపీ పరుగులు అవుతున్నాయి. చంద్రుడికి భూమికి మధ్య దూరంలో చంద్రయాన్ 3 వ్యోమనౌక ఇప్పుడు మూడింట రెండొంతుల దూరం ప్రయాణం ముగించింది. జులై 14వ తేదీన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా జరిగింది. ఇప్పుడు పలు రకాల గురుత్వాకర్షక శక్తుల వలయాలను తట్టుకుని ముందుకు సాగడమే చంద్రయాన్ 3 సామర్థతను తేలుస్తుంది. ఈ మేరకు ఈ ప్రక్రియ శక్తివంతానికి పలు చర్యలు తీసుకుంటున్నారు. కదలికలను ఇస్రో శాస్త్రజ్ఞుల బృందం తమ ప్రధాన కార్యాలయం ద్వారా ఎప్పటికిప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. శనివారం అత్యంత క్లిష్టమైన లూనార్ ఆర్బిట్ ఇంజెక్షన్ ప్రక్రియ (ఎల్‌ఒఐ) సాగుతుంది. చంద్రుడి కక్షలోకి నావను తీసుకువెళ్లేందుకు ఈ ఉద్దీపన చర్య జరుగుతుంది. ఈ విషయాన్ని ఇస్రో ప్రధాన కార్యాలయం వర్గాలు శుక్రవారం తెలిపాయి. ప్రయోగం నాటి నుంచి ఇప్పటివరకూ మూడువారాలలో అంచెలంచెలుగా చంద్రయాన్ 3 ఎత్తును పెంచుతూ ,
కక్షల్లో నిర్ణీత స్థానంలోకి చేరుస్తూ ఉన్నారు. ఇప్పటివరకూ అయిదు సార్లు ఈ కక్షల ఎత్తు పెంపుదల ప్రక్రియలు జరిగాయి. ఆగస్టు 1వ తేదీనే చంద్రయాన్ నౌకను విజయవంతంగా భూమి నుంచి చంద్రుడి వైపు మార్గంలోకి తీసుకువెళ్లారు. శనివారం ఇందులో వేగం పెంచే ప్రక్రియ నిర్వహిస్తారు. 5వ తేదీన సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో ఎల్‌ఒఐ ప్రక్రియ నిర్వహిస్తారని ఇస్రో తెలిపింది. నిజానికి భూ కక్ష నుంచి చంద్రయాన్ నౌక ముందుకు దూసుకువెళ్లింది. దీనిని ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ (టిఎఐ) ద్వారా విజయవంతంగా నిర్వర్తించారు. ఇప్పుడు చంద్రుడి కక్షలో ముందుకు సాగే ప్రక్రియను ఎల్‌ఒఐ ద్వారా పూర్తి చేస్తే ఇక ఈ నెలాఖరు నాటికి నిర్ధేశిత లక్షం ప్రకారం చంద్రయాన్ 3 చంద్రుడిపై వాలే కీలక ఘట్టం నిజరూపం దాలుస్తుంది. చంద్రమండలపై ఈ భారతీయ ఇస్రో నావ సజావుగా వాలే ప్రక్రియ ఈ నెల 23న జరుగుతుందని విశ్లేషించారు. సాఫ్ట్‌ల్యాండింగ్ జరిగితే చంద్రుడిపై భారత మువ్వన్నెల జెండా రెపరెపలు ఉంటాయి.