Friday, December 20, 2024

ఇస్రో కీలక ప్రయోగం.. భారత్ మరో విజయం

- Advertisement -
- Advertisement -

చంద్రుని కక్ష నుంచి భూ కక్ష లోకి మళ్లిన ప్రొపల్షన్ మాడ్యూల్

బెంగళూరు : చంద్రయాన్ 3 ప్రాజెక్టులో మరో కీలకమైన ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి కక్ష లోకి పంపిన పరికరాలను తిరిగి వెనక్కి తీసుకురావడమే ఈ ప్రయోగ లక్షం. ఇటీవల చంద్రయాన్ 3 లో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్ మాడ్యూల్‌ను చంద్రుని కక్ష నుంచి తిరిగి భూకక్ష వైపు మళ్లించింది. ఈ విధంగా చేయడంతో దాదాపు 100 కిలోల ఇంధనం దీనిలో మిగిలింది. ప్రొపల్షన్ మాడ్యూల్ కక్షను విజయవంతంగా మార్చినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది.

“ అరుదైన ప్రయోగంలో ప్రొపల్షన్ మాడ్యూల్‌ను చంద్రుడి కక్ష నుంచి భూ కక్ష లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టాం. ఒక కక్ష పెంపు విన్యాసం, ట్రాన్స్ ఎర్త్ ఇంజెక్షన్ ప్రక్రియల ద్వారా ప్రొపల్షన్ మాడ్యూల్‌ను భూ కక్షలో ప్రవేశ పెట్టాం ” అని వివరించింది. ఈమేరకు ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రయోగాల కోసం చంద్రయాన్ 3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ను తిరిగి భూ కక్ష లోకి తీసుకొచ్చామని వివరించింది. చంద్రుడి నుంచి భూమికి తీసుకొచ్చే ప్రణాళికలు, వాటి అమలుపై పనిచేస్తున్నామని , ఇలాంటి విన్యాసాల కోసం సాఫ్ట్‌వేర్ మాడ్యూల్‌ను అభివృద్ధి చేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది. చంద్రుడి ఉపరితలంపై ప్రొపల్షన్ మాడ్యూల్ నియంత్రణ కోల్పోకుండా ప్రయత్నిస్తున్నామని, తద్వారా అంతరిక్షంలో శిథిలాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఇస్రో వివరించింది. చంద్రయాన్ 3 లోని మూడు ప్రధాన భాగాల్లో ప్రొపల్షన్ మాడ్యూల్ ఒకటి.

దీంతోపాటు ల్యాండర్ మాడ్యూల్, రోవర్ ఉన్నాయి. ప్రొపల్షన్ మాడ్యూల్‌తో ల్యాండర్ మాడ్యూల్ అనుసంధానమై ఉంటుంది. ఇది వాహక నౌక నుంచి విడిపోయి , ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడికి 100 కిమీ సమీపం వరకు తీసుకెళ్లిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయింది. ప్రొపల్షన్ మాడ్యూల్ కొన్ని నెలల పాటు కక్ష లోనే ఉంది. దీని లోని పరికరం సాయంతో సమాచారాన్ని సేకరించి శాస్త్రవేత్తలకు పంపింది. ప్రొపల్షన్ మాడ్యూల్‌పై ఉన్న ఎస్‌హెచ్ ఎపిఇ పేలోడ్ భూమిపై పరిశోధనలు నిర్వహించనుంది. ఇది 36,000 కిమీ ఎత్తులో భూమి జియో బెల్ట్ లోకి ప్రవేశించేటప్పుడు , దిగువ కక్ష లోకి వచ్చే సమయంలో ఉపగ్రహాలను ఢీకొట్టకుండా అక్టోబర్ లోనే పక్కాగా ప్లాన్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News