Friday, December 20, 2024

చందమామ పై తిరంగా

- Advertisement -
- Advertisement -

చందమామ అందిన రోజు ..భారతావని మురిసిన రోజు , కన్నతల్లి ఆశలన్ని నిండు సన్నజాజులై విరిసన రోజు …
2023 ఆగస్టు 23 వ తేదీ , చంద్రుడిపై భారతీయ వ్యోమనౌక వాలింది. చందమామ పెరట్లోని పలు విశేష కథలను పోగుచేసి పంపించేందుకు సమాయత్తం అయింది. ఇదో నూతన అంతరిక్ష అధ్యాయం. జాబిల్లిపై భారతీయత సంతకం వెల్లివిరిసిన క్షణం. యుగానికోసారి సాగే అపురూప ఉజ్వల ప్రయోగాల దొంతరలో మరో మువన్నెల ముచ్చట చోటుచేసుకుంది. దివిపై భువి మువన్నెల జెండా రెపరెపలకు ఆవిష్కరణం. శాస్త్ర సాంకేతికత, మరో గ్రహంలోని నిక్షిప్త రహస్యాలను వెలికితీసే కీలక భూమికను ఇప్పుడు భారతదేశం నిర్వర్తిస్తోంది. 140 కోట్ల మంది భారతీయులకు ప్రత్యేకించి యువతకు ఇది అత్యద్భుతమైన సన్నివేశం. దేశమంతటా నెలకొన్న భావోద్వేగాలకు చిట్టచివరికి విజయం సిద్ధించడం వినూత్నతను ఆవిష్కరించుకోవడం చరిత్రను తిరగరాయడమే అయింది. నాలుగు దేశాల విశిష్ట దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ ప్రత్యేకతను సంతరించుకుంది. చంద్రుడి దక్షిణం వైపున దిగి, తొలిసారిగా ఈ ప్రాంతంలో వాలిన కీలక ఉజ్వల అంకం కూడా భారతదేశం లిఖించిందే కావడం ఇప్పటి చంద్రయాన్‌లో విశిష్టతకు దారితీసింది.

బెంగళూరు : చంద్రుడిపై భారతదేశం చరిత్ర సృష్టించింది. ఇంతవరకూ ఎప్పుడూ జరగని విధంగా చంద్రమండల దక్షిణ ధృవం వైపు ఏ దేశం వెళ్లని విధంగా భారత అంతరిక్ష సంస్థ ప్రయోగం విజయవంతం అయింది. భారతీయ కాలమానం ప్రకారం 2023 ఆగస్టు 23వ తేదీ సాయంత్రం చంద్రుడు పూర్తిగా పగటిపూట పక్షం రోజుల కాలం దశ కు చేరిన సమయంలో సరిగ్గా 6.04 గంటలకు చంద్రయాన్ శాటిలైట్ చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగింది. ఈ సాఫ్ట్‌ల్యాండింగ్ ప్రక్రియనే చంద్రయాన్ 3కు ఆయువుపట్టు అయింది. చిట్టచివరి20 నిమిషాలలో అత్యంత వేగాన్ని, దిగాల్సిన నిర్ణీత మజిలిని, సమాంతరం నుంచి ఎటవాలుకు తరువాతి దశలో తిరిగి సజావైన దశకు వ్యోమనౌకను సెకండ్ల కన్నా తక్కువ సమయంలో విశ్లేషించుకుని బెంగళూరులోని అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నుంచి అందిన సంకేతాలకు అనుగుణంగా సవ్యంగా పనిచేయడంతో చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ అయింది.

41రోజుల సుదీర్ఘ ప్రయాణం ఎటువంటి లోటుపాట్లు లేకుండా సాగడం భారత సాంకేతికత నిర్థిష్టతను చాటింది.ఓ వైపు అత్యంత వేగంగా చంద్రుడివైపు సాగి తుది దశకు ముందే రష్యాకు చెందిన లూనా 25 ఘోరంగా విఫలం అయిన తరువాత నెమ్మదిగా అయినా చంద్రయాన్ 3 చంద్రుడివైపు దాదాపు 4,00,000 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది.ఈ క్రమంలో సంక్లిష్టమైన నరాలు తెగే ఉత్కంఠతల నడుమ సాగిన ఇంధన జ్వలిత, కంట్రోలు సెంటర్ కమాండ్‌ల అదుపాజ్ఞల మధ్య చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై ఎటువంటి విఘాతం లేకుండా చుట్టు దుమ్మురేపుతూ ఉండగా వాలింది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతం అయిన దేశాలైన అమెరికా, చైనా, ఇంతకు ముందటి సోవియట్ యూనియన్ (ఇప్పటి రష్యా) తరువాతి దేశంగా ఇండియా ఇప్పుడు ఈ ఎలైట్ టీంలో చేరింది. చంద్రయాన్ 3కు సంబంధించి అత్యంత కీలకమైన 20 నిమషాల టెర్రర్ ఘట్టం సాయంత్రం 5.44 గంటలకు ఆరంభం అయింది.

చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్‌కు సంబంధించిన ఘట్టం విజయవంతం కావడానికి ఇస్రో శాస్త్రజ్ఞుల బృందం నిర్టిష్ట కమాండ్‌లను ఎప్పటికప్పుడు వెలువరిస్తూ శాటిలైట్‌కు పంపించి, దీనిని సరైన రీతిలో ముందుకు సాగేలా చేసిన సాంకేతిక సిబ్బంది అపారమేధస్సు, సమన్వయం కారణం అయింది. ఈ 20 నిమిషాలను టి 20 కిక్‌గా వ్యవహరిస్తారు. విక్రమ్ ల్యాండర్ ఎప్పటికప్పుడు చంద్రుడిపై కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దశలో బెంగళూరు సెంటర్ నుంచి అందిన సంకేతాలను అందుకుని వేగాన్ని ప్రదేశాన్ని కాలాన్ని సమన్వయపర్చుకుంటూ నిర్థిష్టతను సంతరించుకుని సాఫ్ట్‌ల్యాండింగ్ అయింది.

చిట్టచివరి టి 20 మ్యాచ్‌లో సక్సెస్
చివరి 20 నిమిషాలలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంవైపు సెకండుకు 1.68 కిలోమీటర్ల వేగం, అంటే గంటలలెక్కన చూస్తే దాదాపు 6048 కిలోమీటర్ల వేగం, ఇక విమాన వేగంతో పోలిస్తే పదింతలు ఎక్కువ స్థాయిలో సాగుతూ వెళ్లింది. అయితే చేరుకోవల్సిన దిగాల్సిన లక్షం కేవలం పాతిక కిలోమీటర్లే. ఇదే దశలో విక్రమ్ ల్యాండర్ వివిధ దశలలో ఇంజిన్ల జ్వలితంతో వేగాన్ని తగ్గించుకుంటూ వెళ్లింది. ముందుగా చంద్రుడికి పూర్తిగా సమాంతరంగా ఉంటూ చంద్రుడి గురుత్వాకర్షక శక్తిని తట్టుకుంటూ వెళ్లింది ఈ దశలో స్పీడ్‌ను తగు విధంగా నియంత్రించుకుంది. ఈ తరువాత ఇక చివరి 11 నిమిషాల వ్యవధిలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి ఏటవాలుగా మారి , చివరికి చంద్రుడికి కేవలం 800 మీటర్ల ఎత్తున ఉండే దశలో తనకు తాను అంతకు ముందున్న వేగంతోనే సరైన రీతిలో సాప్ట్‌ల్యాండింగ్ దశకు అంటే సజావుగా చంద్రుడిపైకి చేరుకుంది. దీనితో అత్యంత చంద్రపరీక్ష పూర్తి అయ్యి, ఇంతకు ముందటి అపజయం నాటి పాఠాల నుంచి నేర్చుకున్న అనుభవాలతో విజయం దక్కించుకుంది.

పగటిరోజులే పరీక్షలకు కీలకం
ఇక చంద్రుడి పగటిరోజులు పూర్తి అయ్యే వరకూ చంద్రుడిపై పరిశోధనలకు ఈ శాటిలైట్ సంసిద్ధం అవుతుంది. ఇక చంద్రుడికి కేవలం 150 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు కూడా పతనం సమస్య ఏదైనా ఉందా? అనే విషయాన్ని ఇంతటి అత్యంత వేగం తగ్గింపు దశలోనూ విశ్లేషించుకుంటూ ఇమేజ్‌లు తీసుకుని భూ కేంద్ర కమాండ్‌ను పాటిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేవని నిర్థారించుకుని సాఫ్ట్‌ల్యాండింగ్ అయింది. దీనితో నిశ్చలచిత్రంగా నిలిచిన చంద్రయాన్ 3 నౌక భారతీయ విజయపతాక రూపాన్ని సంతరించుకుంది. చంద్రుడిప దిగే దశలో రెండు ఇంజిన్లే జ్వలితం అవుతూ ఉండగా ఉపరితలంపైకి సెకండుకు గరిష్టంగా కేవలం 3 మీటర్ల వేగంతో అంటే గంట చొప్పున చూస్తే 10.8 కిలోమీటర్ల వేగాన్ని సంతరించుకుని దిగింది. విక్రమ్ చక్రాలు చంద్రుడి ఉపరితలాన్ని ముందుగా తాకితాకనట్లుగా తాకి తరువాత నెమ్మదిగా దీనిపై తిష్టవేసుకుని చంద్రుడిపై ప్రయోగాలకు తన రంగం పదిలం చేసుకుంది.

ఈ దశలో చంద్రుడిపై వాలిన విషయం గ్రహించి ఇంజిన్లు నిలిచిపొయ్యాయి. దీనితో 20 నిమిషాల ఉద్వేగభరిత ఘట్టం ముగిసి చంద్రుడిపై మనం అడుగుపెట్టిన వైనం నిర్టిష్టం అయింది. ఇక చంద్రుడిపై ఉండే దుమ్ము అంటే రెగోలిథ్ భారీ స్థాయిలో ల్యాండింగ్ దశలో చెలరేగింది. ఈ భారీ పరిణామపు దుమ్ము పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తరువాతనే చంద్రయాన్ శాటిలైట్‌లోని ప్రయోగ కీలకమైన ప్రజ్ఞాన్ రోవర్ నెమ్మదిగా ముందుకు కదులుతుంది. పనిలోపనిగా ఈ రోవర్ భారతీయ జెండా గుర్తును కూడా సంతరించుకుని ఉంది. ఈ జెండా ప్రతీకతోనే రోవర్ ఇక చంద్రుడి ఉపరితలంపై స్వేచ్ఛగా తిరుగుతుంది. దీనికి అమర్చిన బ్యాటరీలు చంద్రుడి పగటికాంతిని గ్రహిస్తూ పరిశోధనలు సాగిస్తాయి. భూగోళ కేంద్రానికి ఫోటోలను, తగు శాస్త్రీయ సమాచారాన్ని పంపిస్తాయి. చంద్రుడిపై పక్షం రోజుల పగటికాంతి ఉంటుంది.ఈ క్రమంలో ఈ 15 రోజులు రోవర్ ప్రయోగాలు సజావుగా సాగేందుకు వీలేర్పడుతుందని సైంటిస్టులు తెలిపారు.

బిలియన్ డాలర్ల కలలు. 140 కోట్ల జనం జేజేలు
చంద్రుడిపై పరీక్షలు భారతదేశ బిలియన్ డాలర్ల కలలకు సాకారం అని చంద్రయాన్ 3 సాఫ్ట్‌ల్యాండింగ్ తరువాత ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. చివరి 20 నిమిషాలు కాకుండా తొట్టతొలి ప్రయోగం దశనే తమకు సంబంధించి అత్యంత కీలకమని బెంగళూరులో ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సులో ఉన్న ప్రధాని మోడీ ఆద్యంతం ఇస్రో విజయయాత్రను వీడియో అనుసంధానంతో వీక్షించారు. ఇది తన జన్మసార్థకత ఘట్టం అని పేర్కొంటూ ఇస్రో సైంటిస్టులను జొహన్సెస్‌బర్ నుంచి అభినందించారు. రూ600 కోట్ల చంద్రయాన్ 3 ప్రాజెక్టు ఖరీదు ఓ భారీ తెలుగు సినిమా ఖర్చు కన్నా తక్కువే. అయితే ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు కోటానుకోట్ల డాలర్లను మించిన విలువను తెచ్చిపెట్టింది. జులై 14వ తేదీన ఆరంభమైన ఈ యాత్ర ఖగోళ చరిత్రలో మైలురాయి అని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.

ల్యాండర్ , ఆరు చక్రాలతో కూడిన రోవర్ కలిపి మొత్తం 1752 కిలోల బరువు ఉంటాయి. ఇవి దాదాపు 14 భూమి రోజులు చంద్రుడి కాలమానం ప్రకారం ఒక్క చంద్రమండల పగటిరోజు తమ పనినిర్వహిస్తాయి. ల్యాండర్‌కు ఉన్నబహుళ స్థాయి సెన్సార్‌లతో సాఫ్ట్‌ల్యాండింగ్ తేలిక అయింది. ఇందులో పలు కెమెరాలు , ముప్పు తెలుసుకునే సాధనాలు, పలు ఇతర పరికరాలు ఉన్నాయి. ల్యాండర్‌కు అతుక్కుని రోవర్ ఉంది. తరువాత దీనిని ఉపరితలంపైకి నెమ్మదిగా ర్యాంప్ తరహాలో చంద్రుడి ఉపరితలంపైకి పంపించారు. దీనితో ల్యాండర్‌కు కీలకమైన రీతిలో అమర్చి ఉన్న రోవర్ చంద్రుడి ఉపరితలాన్ని సరిగ్గా విశ్లేషించుకుని దుమ్ము తుపాన్లు లేని విషయాన్ని గుర్తించిన తరువాత విశేష పరిశోధనలకు వెళ్లుతుందని ఇస్రో సైంటిస్టు ఒక్కరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News