Thursday, January 23, 2025

విజయ విక్రమం

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఒక మహాద్భుతం సుసాధ్యమైంది. భారత దేశ చరిత్రలో సరికొత్త సువర్ణాధ్యాయం తెరుచుకొంది. ప్రపంచ ప్రజల జయజయధ్వానాల మధ్య మన చంద్రయాన్ 3 లక్షాన్ని నిర్దుష్టంగా చేరుకొన్నది. చివరి భయానక 19 నిమిషాలు పూర్తి చేసుకొని మన ప్రజ్ఞాన్ ఉపగ్రహం ల్యాండర్ విక్రమ్ నుంచి విడివడి చంద్ర గ్రహం దక్షిణ ధ్రువంపై సురక్షితంగా అడుగుపెట్టింది. చంద్రయాన్ 2 వైఫల్యం కలిగించిన భయానుమానాల మధ్య, రష్యా ఉపగ్రహం లూనా 25 ప్రయోగం ఇటీవలనే విఫలమైన నేపథ్యంలో చంద్రయాన్ 3 ఇంత ఖచ్చితంగా చంద్రుడిపై కాలూనడం భారత దేశం సాధించిన అనుపమానమైన విజయంగా చరిత్రకెక్కింది. చంద్రయాన్ 3 లోని ల్యాండర్, రోవర్ 14 రోజుల పాటు పని చేసి దక్షిణ ధ్రువంలో గల నిక్షేపాలు తదితర విశేషాల గురించి భూమికి సమాచారం అందిస్తాయి. అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రుడిపై అడుగు పెట్టిన నాలుగో దేశంగా భారత్ ఘనమైన కీర్తిని తన ఖాతాలో వేసుకొన్నది. అలాగే చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి దేశంగా ఇంత వరకు ఇతరులెవరూ సాధించుకోని కీర్తిని మూటగట్టుకొన్నది.

అయితే మొదటి, రెండవ యాత్రల వైఫల్యాల తర్వాతనే ఈ గొప్పతనం మనకు లభించింది. ఇది రాజకీయాలకు అతీతమైన ఘనత. అంతరిక్ష పరిశోధనలో చిరకాలంగా మనం చేస్తున్న కృషికి దక్కిన ఫలితం. అందుచేత ఏ ఒక్క పార్టీ దీనిని తన ముల్లెగా భావించడానికి వీల్లేదు. చంద్రయన్ 1ని 2008 అక్టోబర్ 22న ప్రయోగించగా అది 3400 సార్లు చంద్రుడి చుట్టూ పరిభ్రమించి 2009 ఆగస్టు 29న భూమితో సంబంధాలు కోల్పోయింది. నాలుగేళ్ళ క్రితం 2019 జులై 22న ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లతో బయలుదేరిన చంద్రయాన్ 2 దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టే క్రమంలో కుప్పకూలి విఫలమైంది. ఇలా వైఫల్యాల నుంచి పొందిన అమూల్యమైన అనుభవాలతో చంద్రయాన్ 3 గమ్యాన్ని ఘనంగా ముద్దాడింది. చంద్రయాన్ 2 వైఫల్యాన్ని దృష్టిలో వుంచుకొని చంద్రయాన్ 3 కాళ్ళను మరింత పటిష్టం చేశారు.

చంద్రుడి మీద దిగేటప్పుడు అది నిలదొక్కుకోగలిగేలా ఈ ఏర్పాటు జరిగింది. ఇంకా అనేక మెరుగైన మార్పులు చేయడం వల్లనే చంద్రయాన్ 3 ఎటువంటి ప్రతికూలతలు తలెత్తకుండా ఆశించిన చోటికి చేరుకొన్నది. భూమి నుంచి 3 లక్షల 84 వేల 400 కి.మీ దూరాన్ని దాటి చంద్రుణ్ణి కౌగిలించుకొన్నది. ఈ క్రమంలో అది అనేక దశల గుండా దూసుకు వెళ్ళింది. కొంత కాలం భూ కక్షలో తిరిగి ఆ తర్వాత చంద్రుడి కక్షలోకి ప్రవేశించి అగ్నిలో దూకినట్టు చివరి భయానక క్షణాలను చవిచూసింది. చంద్రుడిపై నీరు దండిగా వుందని చంద్రయాన్ 1 ఆర్బిటర్ అనేక సాధనాల సాయంతో నిర్ధారించింది. చంద్రయాన్ 3 దీనిపై మరింత శోధన జరుపుతుంది. నీరున్న చోట జీవకోటి బతకడానికి, మనిషి నివసించడానికి అవకాశాలు మెండుగా వుంటాయి. నదీ తీరాల్లోనే నాగరకత విలసిల్లింది. మామూలుగా వారం, పది రోజుల్లో ముగిసిపోయే యాత్రకు చంద్రయాన్ 3, 41 రోజులు తీసుకొన్నది. జులై 14న బయలుదేరి ఈ నెల 23న తన ప్రయాణాన్ని విజయవంతంగా ముగించుకొన్నది.

ఇందుకు రూ. 600 కోట్ల పైచిలుకు విత్తం ఖర్చయినట్టు సమాచారం. చంద్రయాన్ 3 కి మొదటి నుంచి అమెరికా జాతీయ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా, అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఎసా) ల నుంచి అవసరమైన తోడ్పాటు లభించిందని సమాచారం. చంద్రయాన్ 3 పరిభ్రమణాన్ని ఎసా కనిపెడుతూ వచ్చిందని, అలాగే ఉపగ్రహానికీ బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి మధ్య సమాచారాన్ని చేరవేస్తూ వచ్చిందని తెలిసింది. ఫ్రెంచి గయానాలోని కౌరోలో గల యాంటెన్నా, బ్రిటన్‌లోని మరో యాంటెన్నా సహకారంతో చంద్రయాన్ 3ని ఎసా గమనిస్తూ వచ్చిందని వెల్లడైంది. కీలకమైన అంతరిక్ష పరిశోధనల సమయంలో అంతర్జాతీయ సహకారానికి ఉదాహరణగా దీనిని చెప్పుకోవచ్చు.

చంద్రయాన్ 3 విజయం దేశంలో ప్రైవేటు రంగంలో అంతరిక్ష ప్రయోగాలకు దోహదకారి అవుతుంది. భారత దేశ అంతరిక్ష పరిశ్రమకు మరింత ఊపును, ఉత్సాహాన్ని ఇస్తుంది. చంద్రయాన్ 3లో భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ కంపెనీ (బిహెచ్‌ఇఎల్ భెల్) తయారు చేసిన అత్యున్నత ప్రమాణాలు గల బ్యాటరీలను ఉపయోగించారు. భెల్ తన వందవ బ్యాటరీని ఇస్రోకి ఇచ్చింది. అలాగే హిందూస్థాన్ ఏరోనాటిక్స్ కూడా చంద్రయాన్ 3 కి సహకారం అందించింది. అది తన నేషనల్ ఏరోసేస్ లేబొరేటరీలను ఇస్రోకు అండగా నిలిపింది. నాలుగు దేశాల మూన్ క్లబ్‌లో చేరడమే గాక చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని వశం చేసుకొన్న దేశంగా విశ్వప్రగతికి ఇండియా ఎంతగానో తోడ్పడగలుగుతుంది. అందుచేత ఈ క్షణం మనదే కాదు మానవాళి అంతటిదీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News