Monday, December 23, 2024

చంద్రయాన్‌కు పగలే వెన్నెల..ఏ ప్రయోగానికి ఐనా 14రోజులే గడువు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రయాన్ 3 విజయవంతం అయింది. అయితే చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్‌లు కేవలం 14 రోజులు పనిచేస్తాయి. భూగోళంపై 14 రోజులు అంటే చంద్రుడిపై ఒక్క పగటిరోజుతో సమానం. ఈ పగటిపూట కాంతితోనే విక్రమ్ విక్రమించాల్సి ఉంటుంది. ప్రజ్ఞాన్ పరిశోధనలు సాగించాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ అంతా సజావుగా సాగిన చంద్రయాన్ 3పై ఇక మిగిలిన ఆశలు పలు పరికరాలతో కూడిన ల్యాండర్, రోవర్‌లపైనే కేంద్రీకృతం అయ్యి ఉన్నాయి. పేలోడ్స్, కెమెరాలు, స్పెక్టోమీటర్లు, మరెన్నో ఇందులో దాగి ఉన్నాయి. వీటిసాయంతో ఈ శాటిలైట్ నమ్మినబంట్లు కేవలం 14 రోజులు అంటే పగటికాంతి అంతరించే వరకూ పనిచేయగల్గుతాయి. నిజానికి ఈ పగటి కాంతి ఆగమనం దశను చూసుకునే చంద్రయాన్ నౌకను ఉపరితలంపై ప్రవేశపెట్టారు. 23వ తేదీన చంద్రయాన్ చంద్రుడిపై వాలింది కాబట్టి దీని పనిచేసే గడువు 14 రోజులు అంటే సెప్టెంబర్ 6వ తేదీవరకూ ఉంటుంది. చంద్రయాన్ నిజమైన విజయం అనేది ఈ పగటిపూట అన్వేషణల ఫలితాలపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికైతే ఈ రెండూ జంటకవులుగా ఉపరితలంపై సాఫీగా సాగుతున్నాయి.

గురువారం తెల్లవారుజామున విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ వెలుపలికి వచ్చింది. దీని అన్వేషణలు సాగుతున్నాయి. ప్రతి క్షణం ఈ దశలో విలువైనదే. చంద్రుడిపై రాళ్లు, గుంతలు ఇతరత్రాలపై తిరుగాడుతూ విశేషాలను తగు విధంగా బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి తన డ్యూటీగా పంపించాల్సి ఉంటుంది. రోవర్‌కు పలు రకాల సాధనాలు అమర్చారు. అధునాతన ఆటోమోటిక్ కెమెరాలు, స్పెక్ట్రోమీటర్స్, సైంటిఫిక్ పరిశోధనలకు వాడే డ్రిల్లింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. 14 రోజుల్లో తమ మిషన్‌లో భాగంగా ఆదరాబాదరగానే రోవర్ చంద్రుడి నైసర్గిక స్వరూపాన్ని విశ్లేషించుకోవాలి. ఇక్కడి జలరాశుల గురించి ఆరాతీయాలి. ఇకపై మనిషి ఉండేందుకు అనువైన వాతావరణం ఉందా? అనేది కూడా తేల్చుకోవల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 14 రోజులు రోవర్, ల్యాండర్‌లకు ఏకబిగి పరీక్షనే అవుతుంది. ఓ వైపు కొత్త విషయాలు రాబట్టుకుంటూ మరో వైపు ఈ విషయాలను పద్ధతి ప్రకారం కమాండ్ సెంటర్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ దశలో లయతప్పరాదు .

14 రోజుల తరువాత ఏమవుతుంది?
చంద్రుడి చీకటిలో సుషుప్తావస్థకు రోవర్, ల్యాండర్
పగటి సమయం తరువాత చంద్రమండలంపై విపరీత వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రుడు పూర్తిగా చీకట్లో కూరుకుపోతాడు. ఈ చీకటి దశలో ఇక్కడ వాతావరణం మైనస్ 180 డిగ్రీల సెల్సియస్ అవుతుంది. ఈ దశలో ఈ దెబ్బకు విక్రమ్ ల్యాండర్, రోవర్ ప్రజ్ఞాన్‌లు అచేతన స్థితికి చేరుతాయి. ఈ వాతావరణంలో ఎటువంటి పని చేయలేకుండా చచ్చుబడుతాయి. దీనితో ఇక చంద్రయాన్ 3 దశకు కాలం చెల్లినట్లేనా అనే ప్రశ్న వస్తోంది. అయితే 14 రోజుల పగటికాంతి దశ తరువాత స్తబ్ధతకు గురైన ఈ రెండూ ఆ తరువాత తిరిగి సహజపరిణామంగా తలెత్తే పగటిపూటలతో పునరుద్ధరణకు కూడా వీలుంటుందని ఇస్రో సైంటిస్టులు ఆశిస్తున్నారు. వీటిలోని పనిచేసే జీవలక్షణాలకు పగటికాంతి తిరిగి ప్రేరేపిత శక్తిని అందిస్తుంది. తిరిగి రాబోయే చంద్రుడి పగటిసమయం వరకూ ఈ రెండూ మనగల్గి ఉండగల్గితే రోవర్ తిరగి పనిచేయగల్గుతుందని,ఈ నమ్మకం తమకు ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.

అయితే ఇవి తిరిగి పనిచేస్తాయా? చేయగలిగే స్థితిలో ఉన్నాయా? లేవా ? అనేది చంద్రుడి రాత్రి కాలం దశ దాటిన తరువాతనే చెప్పగలమని, వీటిని అప్పుడు పరీక్షించి ఏ విషయం నిర్థారించుకునేందుకు వీలుంటుందని ఇస్రో నిపుణులు తెలిపారు. చంద్రయాన్ ప్రక్రియ కేవలం చంద్రుడి వద్దకు వెళ్లే ప్రయాణంగానే ఖరారు అయింది. దీనితో రోవర్, ల్యాండర్‌లు తిరిగి భూమిపైకి వచ్చేందుకు వీల్లేదు. ఇవి చంద్రుడిపైనే ఆనవాళ్లుగా నిలిచిపోవల్సిందే.విక్రమ్‌కు చెందిన శక్తివంతమైన టిఎంసి కెమెరాతో నౌక వాలిన ప్రాంతపు 3 డి మ్యాప్‌ను చిత్రీకరిస్తారు. ఇక ఎల్‌ఆర్‌ఆర్‌ఆర్‌తో భూమి నుంచి చంద్రుడికి మధ్య కాంతిపుంజాల ద్వారా వీటి మధ్య దూరాన్ని విశ్లేషిస్తారు. రోవర్ నుంచి చంద్రుడి ఉపరితలంపై శాస్త్రీయ పరిశోధనలు సాగుతాయి. ఇతరత్రా కెమెరాలతో చంద్రుడి ఫోటోలు మనకు అందుతాయి. ఇక ఇక్కడ కొన్ని పరికరాలతో గుంతలను నెలకొనేలా చేసి, చంద్రుడి అంతర్భాగంలో ఏముందనే అంశంపై అన్వేషణ సాగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News