భారత అంతరిక్ష పరిశోదన సంస్థ(ఇస్రో) సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 విజయవంతంగా అడుగుపెట్టింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రయాన్ బృందం, ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చంద్రయాన్-3 విజయంతో నా జీవితం ధన్యమైంది. భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా. ఈ అద్భుత విజయం కోసం 140 కోట్ల ప్రజలు ఎదురుచూశారు. చంద్రయాన్ విజయం నవభారత జయధ్వానం. ఈ విజయం దేశం గర్వించే మహత్తర క్షణాలు. ప్రపంచంలో తొలిసారిగా చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టాం.అమృత కాలంలో తొలి ఘన విజయం. బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నా నా మనసంతా చంద్రయాన్ పైనే ఉంది” అని పేర్కొన్నారు. కాగా, చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు.