Wednesday, January 22, 2025

చంద్రయాన్- 3 తొలి విజయం

- Advertisement -
- Advertisement -

చంద్రయాన్- 3 భూ కక్ష్యలోకి చేరుకొని ఇస్రో శాస్త్రజ్ఞుల మీద పూల వాన కురిపించింది. శ్రీహరికోట సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి వెళ్ళిన చంద్రయాన్- 3 ఆగస్టు 23న చంద్రగ్రహం దక్షిణ ధ్రువం మీద విజయవంతంగా దిగుతుందని ఆశిస్తున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని, ఎంతో పటిష్టంగా నిర్మించిన ఎల్‌విఎం3 ఎం4 రాకెట్ చంద్రయాన్ -3ని భూకక్ష్యలో చేర్చి తన బాధ్యతను విజయవంతంగా నెరవేర్చింది. తనకు అమర్చిన ఇంజిన్ల సాయంతో భూకక్షలో 20 రోజులకు పైగా పరిభ్రమిస్తూ నెమ్మది నెమ్మదిగా ఊర్ధయానాన్ని పెంచుకొంటూ చంద్రయాన్ -3 తన గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవలసి వుంది. చిమ్మ చీకటిలో వుండే చంద్రగ్రహ దక్షిణ ధ్రువంలోని ప్రత్యేక లక్షణాలపై ఉద్దేశించిన పరిశోధనలను చేపట్టవలసి వుంది. అక్కడి నుంచి ఫోటోలను కూడా చంద్రయాన్ పంపిస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద చంద్రయాన్ 3 ఆశించిన శోధనలను పూర్తి చేసుకొంటే ఆ గొప్పతనాన్ని సాధించిన మొదటి దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోతుంది.

2008 అక్టోబర్ 22న ప్రయోగించిన చంద్రయాన్ 1 చంద్రుడి ఉపరితలానికి 100 కి.మీ దూరంలోని ఆ గ్రహ కక్షలో పరిభ్రమిస్తూ జరిపిన పరిశోధన ఆ గ్రహంలో నీరు వున్నట్టు వెల్లడించింది. అయితే రెండేళ్ళ పాటు చంద్రభ్రమణం చేయడానికి ఉద్దేశించిన ఆ యాత్ర ఆ వ్యోమ నౌకతో భూమికి సంబంధాలు తెగిపోడంతో ఏడాదికే ముగిసిపోయింది. అది చంద్రుడి చుట్టూ 3400 సార్లు పరిభ్రమించింది. 2019 జులై 22న దూసుకు వెళ్ళిన చంద్రయాన్ 2 పాక్షికంగా విఫలమైంది. ఆ ఏడాది సెప్టెంబర్ 7న చంద్రుడిపై దిగే క్రమంలో దాని ల్యాండర్ భూమితో సంబంధాలను కోల్పోయింది. ల్యాండర్, రోవర్లు చంద్రుడి ఉపరితలానికి ఢీ కొట్టడంతో అవి ధ్వంసమయ్యాయి. ల్యాండర్‌లోని ఐదు ఇంజిన్లు నిర్దేశించిన దానికి మించి అధిక ఒత్తిడికి లోనైనందున అలా జరిగిందని ఇస్రో అధినేత సోమనాథ్ చెప్పారు.

చంద్రయాన్- 3 అన్ని విధాలా సఫలమైతే దీనిని సాధించిన నాలుగవ దేశంగా భారత్ విశేష ఖ్యాతిని పొందుతుంది. ఇంతకు ముందు అమెరికా, రష్యా, చైనాలు చంద్రుడి మీదికి విజయవంతంగా వెళ్ళగలిగాయి. మొట్టమొదటిసారిగా అమెరికా నుంచి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ 1969లో చంద్రుడిపై కాలు మోపాడు. అక్కడ కొన్ని గంటల పాటు నడిచాడు. ఇంకా మరి కొంత మంది అమెరికన్ వ్యోమగాములు చంద్రుడి మీదికి వెళ్ళారు. వాస్తవానికి అమెరికా వ్యోమ నౌక అతి తక్కువ వ్యవధిలోనే చంద్రుడి మీదికి వెళ్ళగలిగింది. అలాగే చైనా, రష్యాల నౌకలు కూడా స్వల్ప వ్యవధిలోనే వెళ్ళగలిగాయి. అందుకు కారణం అవి ఉపయోగించిన భారీ రాకెట్లే. అంతటి వ్యయం చేయగలిగితే మనం కూడా అంత తక్కువ వ్యవధిలో చంద్రుడిని చేరగలుగుతాము.

ఎన్ని రోజుల్లో గమ్యాన్ని అందుకోగలిగాము అనే దాని కంటే ఎంత ఖచ్చితంగా అనుకొన్న పనిని పూర్తి చేసుకురాగలిగామనేదే ముఖ్యం. అందుచేత పరిమిత వ్యయంతోనే చంద్రయాన్‌ను ముగించుకోవాలని చంద్రయాన్ 3 ద్వారా భారత్ సంకల్పించింది. అంతరిక్ష పరిశోధనలో మన దేశం అనేక విజయాలు సాధించింది. ఒకేసారి అనేక ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టిన ఘనతను కూడా సాధించింది. మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట నిర్మాణం నుంచి ఎన్నో ఉపగ్రహాలను రూపొందించింది. 2014లో మంగళ్ యాన్ ద్వారా కుజ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించగలిగింది. 2016 సెప్టెంబర్‌లో ఒకే రాకెట్ ద్వారా అనేక ఉపగ్రహాలను రెండు వేర్వేరు కక్షల్లో ప్రవేశపెట్టింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి 8 ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌విసి 35 రాకెట్ ద్వారా సంధించగలిగింది. ఈ ఉపగ్రహాల్లో 3 భారత్‌కు చెందినవి. ఒకటి అల్జీరియాకు, ఒకటి కెనాడాకు, మరి ఒకటి అమెరికాకు చెందిన ఉపగ్రహాలు. పిఎస్‌ఎల్‌వి రాకెట్లను ప్రయోగించడంలో మన దేశం ఆరితేరింది. 2030 నాటికి మనుషులతో కూడిన అంతరిక్ష నౌకను చంద్రుడి మీదికి పంపిస్తానని చైనా ఇటీవలనే ప్రకటించింది. అంతరిక్ష యాత్రికులను, పరిశోధక ల్యాండర్లను కూడా తీసుకు వెళ్ళే భారీ రాకెట్ మీద అది దృష్టి పెట్టింది.

చంద్రుడి మీద గల అత్యంత విలువైన ఖనిజ వనరుల మీద అమెరికా, చైనాలు కన్ను వేశాయి. భారత్ దేశం కూడా కుందేలు, తాబేలు కథలో మాదిరిగా నెమ్మదిగానైనా విజయవంతంగా చంద్రుడిని జయించగలదనడానికి ఇస్రో ద్వారా మనం సాగించిన అనేక అంతరిక్ష యాత్రలే నిదర్శనం. 2017లో ఒకే యాత్రలో 104 ఉపగ్రహాలను భారత్ అంతరిక్షంలో ప్రవేశపెట్టగలిగింది. అలా చేసిన మొట్టమొదటి ఆసియా దేశంగా ఖ్యాతి సాధించింది. మూడు రోజుల పాటు మానవ సహిత వ్యోమ నౌకను భూకక్షలో వుంచడానికి సంబంధించిన యాత్రను వచ్చే ఏడాది చేపట్టడానికి భారత్ సంకల్పించింది. ప్రపంచంలో చంద్రుడిని అందుకొంటున్న అతి కొద్ది దేశాల్లో ఒకటిగా చంద్రయాన్ 3 భారత్‌ను నిలబెడుతుందని ఎదురు చూద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News