అమరావతి: వరదలు ఎక్కువగా రావడానికి వాతావరణంలో వచ్చిన మార్పులేనని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఏలూరు జిల్లాలోని కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. గతంలో బుడమేరకు గండ్లు పడితే జగన్ ప్రభుత్వం పూడ్చలేదని, వరద ప్రభావం ఎక్కువగా వచ్చిందని దుయ్యబట్టారు. బుడమేరు ఆధునీకరణ పనులు రద్దు చేశారని, బుడమేరు మొత్తం వీళ్ళ మనుషులు ఆక్రమించుకుని అమ్మేశారని, నీళ్ళు పోవాల్సిన బుడమేరుని ఆక్రమించుకుని, నేడు విజయవాడని ముంచేశారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడే ప్రజలు ఎక్కువగా నష్టపోతారని తెలియజేశారు.
మంత్రి నిమ్మల రామానాయుడు ఐదు రోజుల బుడమేరులో ఉండి గండ్లను పూడ్చివేశారని చంద్రబాబు కొనియాడారు. బుడమేరు పూడ్చడంతోనే విజయవాడకు వరద ప్రభావం తగ్గిందని తెలియజేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలను వదిలింది వైసిపికి చెందిన వారేనని ఆరోపణలు చేశారు. పడవలు వదిలిపెట్టి ఇప్పుడు తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆ పడవలతోనే అక్రమ ఇసుక వ్యాపారం చేశారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులను ఆదుకోడానికి మంచి మనసుతో ముందుకొచ్చి తమ విరాళాలను అందించిన గోపాలపురం నియోజకవర్గ నాయకులు, ప్రజలకు చంద్రబాబు మనసారా కృతజ్ఞతలు తెలిపారు. దాతల మానవతా దృక్పథం తమ సంకల్పానికి మరింత బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు.