వెంటనే యుడిఐడి కార్డులు పంపిణీ చేయాలి
కేంద్రానికి ఎన్‌పిఆర్‌డి డిమాండ్
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వికలాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 రకాల సంక్షేమ పథకాలకు యూనిక్ డిజేబులిటీ ఐడి కార్డు తప్పనిసరి చేయాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేయాలంటే 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి యుడిఐడి, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన వైకల్యం ధృవీకరణ పత్రం, కేంద్రం జారీ చేసిన ప్రత్యేకవికలాంగ గుర్తింపు సంఖ్య లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను తప్పనిసరి చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ చర్యను ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె. వెంకట్, ఎం. అడివయ్య తీవ్రంగా ఖండించారు.
సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ వికలాంగుల సాధికారత విభాగం (డిఇపిడబ్లుడి) దాని అనుబంధ సంస్థలు అందించే విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల వంటి పథకాల ప్రయోజనాలను పొందేందుకు యుడిఐడి కార్డు తప్పనిసరి చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. 17 రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను తీసుకువస్తున్నామనే పేరుతో యుడిఐడి కార్డులు తప్పనిసరి చేస్తున్నారని విమర్శించారు. నేషనల్ ట్రస్ట్, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా అందుతున్న సేవలకు యుడిఐడి అనివార్యమని ప్రకటించడం అంటే వికలాంగులకు పథకాలను అందకుండా చేయడమేనని వారన్నారు.
వైకల్యం రకం, వైకల్యం శాతం ఆధారంగా దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే విధంగా యుడిఐడి కార్డ్‌లు జారీ చేయాలని 2016 లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని. 17 పథకాల జాబితాలో వైకల్యాలున్న విద్యార్థుల కోసం ప్రీ-, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ వంటి వివిధ స్కాలర్‌షిప్, ఉపకరణాల కొనుగోలు, ఉపకరణాలు అమర్చడం కోసం వికలాంగులకు సహాయం,జాతీయ సంస్థలలో చికిత్స, నేషనల్ ట్రస్ట్ కింద డే కేర్, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ వంటివి పొందేందుకు యుడిఐడి కార్డు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. .దీన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పంపిణీ చేసిన యుడిఐడి కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంపిణీ చేసిన కార్డులు ఉపయోగంలోకి రాకుండానే ప్రభుత్వ పథకాలు పొందాలంటే యుడిఐడి కార్డు తప్పనిసరి అని చెప్పడం ప్రభుత్వాల అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు.
యుడిఐడి కార్డు వికలాంగులకు ఇవ్వాలని దశాబ్ద కాలంగా ఎన్‌పిఆర్‌డి ఉద్యమాలు చేసిందని, ఉద్యమాల ఫలితంగా యుడిఐడి కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దేశంలో వికలాంగులందరు యుడిఐడి కార్డు కల్గి ఉండడం మంచి నిర్ణయమే అయినా కార్డును వికలాంగులపై బలవంతంగా రుద్దాలని చూడడం సరైంది కాదని ఎన్‌పిఆర్‌డి భావిస్తోందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 2.68 కోట్ల మంది వికలాంగుల జనాభాలో జనవరి 2022 నాటికి దాదాపు 1.74 కోట్ల మందికి వైకల్య ధృవీకరణ పత్రాలను జారీ చేసినట్లు 2021-22 నాటి కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, వికలాంగుల సాధికారత మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికనులో పేర్కొదని గుర్తు చేశారు.
దేశంలో ఇప్పటివరకు సుమారు 90.70 లక్షల మంది వికలాంగులకు యుడిఐడి కార్డులు పంపిణీ చేశామని, రాష్ట్ర స్థాయిలో ఐదు లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. ఇప్పటికీ దేశ వ్యాప్తంగా వికలాంగులందరికీ వైకల్యం ధృవీకరణ పత్రాలు లేవని. వారందరికీ నిర్దిష్ట గడువులోపు వైకల్యం ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలన్నారు. వైకల్య ధృవీకరణ పత్రాలు లేకుండా యుడిఐడి కార్డులు మంజూరు చేయడం ఆచరణ సాధ్యం కాదనే విషయం ప్రభుత్వo గుర్తించాలన్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైకల్యం ధృవీకరణ పత్రాలతో పాటు యుడిఐడి కార్డులు పంపిణీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.