Saturday, November 9, 2024

డ్రగ్స్ కథా చిత్రమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నడిబొడ్డున మరోసారి రేవ్ పార్టీ కలకలం

నిఘాతో ‘భగ్నం’… ముగ్గురు నిందితుల పట్టివేత
నిందితుల్లో ఒకరు మాజీ నేవీ అధికారి, మరొకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి,
ఇంకొకరు సినీపరిశ్రమకు ఫైనాన్స్ చేస్తున్న వ్యక్తి
నైజీరియన్లతో సత్సంబంధాలు
2.8 గ్రాముల కొకైన్, 6 ఎల్‌ఎస్‌డి బోల్ట్, 25 ఎక్స్‌ట్రాపిల్స్,
40 గ్రాముల గంజాయి, రూ.72,500 నగదు, 2 కార్లు, 5 చరవాణులు స్వాధీనం
గుట్టు విప్పే పనిలో నార్కొటిక్ బ్యూరో…
కదులుతున్న డొంక..టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కేసు ప్రకంపనలు…

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ నడిబొడ్డున మరోసారి రేవ్‌పార్టీ కలకలం రేపింది. అక్కడ డ్రగ్స్ కథాచిత్రం సాక్షాత్కరించింది. మరో మారు డ్రగ్స్ లింకులు బయల్పడ్డాయి. నిందితుల్లో ఒకరు మాజీ నేవీ అధికారి, మరొకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఇంకొకరు సినీ పరిశ్రమకు ఫైనాన్స్ చేస్తున్న వారు ఉండటం గమనార్హం. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు బాలాజీ మాజీ నేవీ అధికారిగా పోలీసులు గుర్తించారు. కొన్నేళ్ల క్రితం కన్నుకు గాయం కావడం వల్ల నేవీ నుంచి బాలాజీ వైదొలిగినట్లు తెలిపారు. తరచూ స్నేహితులతో హైదరాబాద్‌లో పార్టీలు నిర్వహించే బాలాజీ మాదాపూర్‌లోని ఫ్రెష్‌లింగ్ అపార్ట్‌మెంట్‌లో మిత్రులతో పార్టీలు చేసుకుంటున్నాడు. అయితే ఇదే క్రమంలో అతనికి హైదరాబాద్, బెంగళూరులోని మాదకద్రవ్యాల సరఫరాదారులతో పరిచయమేర్పడింది. వారి ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించిన నిందితుడు నైజీరియన్లతో సైతం సంబంధాలు కొనసాగించాడు. వారి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసిన బాలాజీ తెలిసిన, పరిచయం ఉన్న వారికి డ్రగ్స్ విక్రయించాడు.

ఈ క్రమంలోనే సులభంగా డబ్బు సంపాదించేందుకు సినీ పరిశ్రమలో ఉన్న కొందరికి విక్రయించడం షురూ చేశాడు. తరచూ బెంగళూరులో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు, విశాఖపట్నానికి చెందిన మరో వ్యక్తి నుంచి బాలాజీ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో నిందితుడికి సినిమాలకు ఫైనాన్స్ చేసే వెంకటరత్నారెడ్డి పరిచయమయ్యాడు. ఢమరుకం, కిక్, బిజినెస్‌మెన్, లవ్‌లీ, ఆటోనగర్ సూర్య సినిమాలకు ఫైనాన్స్ చేసిన వెంకటరత్నారెడ్డి తరచూ విఐపిలకు నగర శివారు ప్రాంతాల్లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే తనకు భారీ మొత్తంలో డ్రగ్స్ కావాలని అతను బాలాజీకి భారీగా డబ్బు ముట్టజెప్పాడు. మరోవైపు వెంకటరత్నారెడ్డి తాను నిర్వహించే డ్రగ్స్ పార్టీలకు యువతులను సైతం సమకూరుస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఇతనికి డ్రగ్స్ పార్టీలు నిర్వహించే గుంటూరుకు చెందిన మురళితో పరిచయాలు ఉన్నాయి. మురళి ఆర్‌పిఎఫ్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఈ డ్రగ్స్ దందాపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో గుడి మల్కాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో బాలాజీని వలపన్ని పట్టుకున్నారు. గుడి మల్కాపూర్ పోలీసులతో కలిసి సోదాలు చేసిన తెలంగాణా యాంటీ నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, 15 ఎక్స్‌ట్రాపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బాలాజీ సమాచారంతో మాదాపూర్‌లోని విఠల్‌రావునగర్‌లోని ఫ్రెష్‌లివింగ్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 804లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ వెంకటరత్నారెడ్డి సహా గుంటూరుకు చెందిన మురళిని అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో నలుగురు సరఫరాదారులు, వీరిలో నైజీరియన్లు, మరో 18 మంది వినియోగదారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నారు.

అరెస్టయిన నిందితులు బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళిల నుంచి టిన్యాబ్ పోలీసులు 2.8 గ్రాముల కొకైన్, 6 ఎల్‌ఎస్‌డి బోల్ట్, 25 ఎక్స్‌ట్రాపిల్స్, 40 గ్రాముల గంజాయి, రూ.72,500 నగదు, 2 కార్లు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ రూ.32.89 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ అరెస్టులతో వీరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. నిందితుల చరవాణులు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలో కీలక సమాచారం ఉంటుందని భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పలువురు ప్రముఖుల పేర్లు సైతం బయటకు వచ్చే అవకాశం ఉంది.
సంచలనాలు వెలుగులోకి… సినీ అవకాశాల ఆశజూపి అమ్మాయిలతో వ్యభిచారం
ఈ రేవ్ పార్టీ, డ్రగ్స్ వ్యవహారంపై విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇది కేవలం రేవ్ పార్టీ మాత్రమే కాదు ఈ ముసుగులో వ్యభిచార దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సినిమా అవకాశాల పేరిట అమ్మాయిలను ఈ వ్యభిచార కూపంలోకి లాగుతున్నట్లు తెలుస్తోంది. నిందితుడు వెంకటరత్నారెడ్డి రేవ్ పార్టీ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. వెంకటరత్నారెడ్డి పాటు పట్టుబడిన బాలాజీ గతంలో వ్యభిచారం నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఈ ఇద్దరు వ్యభిచారం కేసులో రెండుసార్లు పట్టుబడ్డారని, అందుకు సంబంధించిన కేసులు వీరిపైన వున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కోణంలో విచారణ జరిపిన పోలీసులు తాజాగా ఇద్దరు అమ్మాయిలను కూడా వ్యభిచారం కోసమే తీసుకువచ్చినట్లు గుర్తించారు.

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి ఈ ఇద్దరు అమ్మాయిలను తీసుకువచ్చి గత రెండు రోజులుగా ఇదే అపార్ట్ మెంట్ లో వుంచినట్లు సమాచారం. ఈ అమ్మాయిలతో గడిపేందుకే మిగతావారు అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. గంజాయితో పాటు వివిధ రకాల డ్రగ్స్ తో సినీ రంగానికి చెందినవారితో పాటు ఇతర ప్రముఖులకు వెంకటరత్నారెడ్డి పార్టీలు ఏర్పాటు చేస్తున్నాడని బయటపడింది. గతంలో తెలుగు సినిమా ప్రముఖులు చాలామంది డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని విచారణకు కూడా హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సినీ పరిశ్రమకు చెందినవారు డ్రగ్స్, వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తులో ఒక్కోటిగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. వెంకటరత్నారెడ్డి డ్రగ్స్ సప్లై చేసే కస్టమర్లలో సినీ ప్రముఖులు చాలామంది వుండవచ్చనే అనుమానాలున్నాయి.
వెంకటరత్నారెడ్డి కదలికలపై మూడు నెలలుగా నిఘా….
వెంకటరత్నారెడ్డి కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టారు. వెంకట్ వాట్సాప్ చాట్ పరిశీలించారు. వెంకట్‌కు డ్రగ్స్ మాఫియాపై సంబంధాలు పై ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ దందాలతో పాటు వెంకటరత్నారెడ్డి, బాలాజీ వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌కు తాను బానిస అయిన వెంకటరత్నారెడ్డి అదే వ్యాపారం కూడా చేస్తున్నారు. సర్వీస్ అపార్ట్మెంట్లలో డ్రగ్ పార్టీలు నిర్వహిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వారానికి చొప్పున సర్వీస్ అపార్ట్మెంట్ ని రెంటుకు తీసుకొని డ్రగ్ పార్టీలు పెడుతున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
గుట్టు విప్పే పనిలో నార్కోటిక్ బ్యూరో…
ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది. వారికి ఎవరు డ్రగ్స్ సరఫరా చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గతంలో టాలీవుడ్‌లో నిర్మాత కెపి చౌదరి డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో కెపి చౌదరిని అరెస్ట్ చేసిన విచారించడగా టాలీవుడ్ కు చెందిన పలువురు ఆర్టిస్టుల పేర్లను ప్రస్తావిం చారు. కెపి చౌదరితో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వారు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ సోషల్ మీడియా వేదికల ద్వారా వివరణ ఇచ్చారు. తాజాగా మరోసారి నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో మరోసారి చర్చనీయాంశమవుతోంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News