Wednesday, January 22, 2025

‘అగ్నిపథ్’లో మార్పులు తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

దేశ రక్షణ కోసం సైన్యం అవసరం. దాని లెక్కకు సరిపడేలా ఏటా రిటైర్మెంట్లు, నియామకాలు జరుగుతూనే ఉండాలి. బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఈ రంగానికి తగిన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే సాంకేతికత పెరగడంతో ప్రపంచ దేశాల్లో ఆధునిక ఆయుధాల తయారీ, సేకరణ ఎక్కువవుతోంది. ఇప్పుడు మనుషుల కన్నా వైజ్ఞానిక రణ సామగ్రికే ప్రాధాన్యత ఎక్కువ. వాటి ఆధారంగానే ఒక దేశ రక్షణ వ్యవస్థను అంచనా వేస్తున్న కాలమిది. మన దేశంలో ప్రతి యేడు రక్షణ శాఖకు ఇచ్చే సొమ్ములో సైనికుల జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులకు సగానికి పైగా వెళ్ళిపోతోంది. ఈ భారాన్ని తగ్గించడం వల్ల దేశ అమ్ముల పొదిలో ఆధునిక ఆయుధాలు అధికంగా చేర్చవచ్చని ప్రభుత్వం ఆలోచన. దీని కోసం దాదాపు గత పదేళ్ల నుండి సైన్యంలో కొత్త నియామకాలు తగ్గించివేశారు. రిటైర్మెంట్‌లో 50% మాత్రమే రిక్రూట్ మెంట్ జరుగుతోంది. పై అధికారులు పోనూ అన్ని విధాల సైనిక సిబ్బందిని స్వల్పకాలిక ప్రాతిపదికన నియమించుకుంటే రక్షణ శాఖపై భారం మరింత తగ్గుతుందనే ఆలోచన నుంచి అగ్నిపథ్ అనే స్కీమ్ పుట్టింది.

సైన్యంలో పని చేయడం బతుకు తెరువుకు ఉద్యోగంగా కాకుండా పౌరుడిగా దేశ రక్షణ సేవగా యువత భావించాలనే సూత్రం ఈ ఆలోచన వెనుక ఉంది. అలా అగ్నిపథ్ మన దేశంలో జూన్ 2022లో ప్రవేశపెట్టబడింది. దాని విధివిధానాలు తెలియగానే సర్వత్రా వ్యతిరేకత, నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో యువత ఆందోళన చేపట్టింది. అదే నెలలో అగ్నిపథ్‌ని రద్దు చేయాలని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో వందలాది మంది యువకులు చేసిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రైలు పెట్టెలు తగలబడ్డాయి. ఎంతో మంది యువకులపై కేసులు కూడా నమోదు అయ్యాయి. సైన్యం లో చేరేందుకు శిక్షణ తీసుకుంటున్నామన్నవారు ఆందోళకారులుగా ముద్రపడి దానిలో చేరే అర్హత కోల్పోవడం విషాదకరం.
అగ్నిపథ్ నియమావళి ప్రకారం 17 – 21 మధ్య వయస్కులను మూడు విభాగాల సైన్యంలో అగ్నివీరులుగా ఎంపిక చేసుకుంటారు. వారి ఉద్యోగ కాలం నాలుగేండ్లు. సర్వీసు పూర్తయ్యాక వారిలోంచి 25% మంది మాత్రం సర్వీసులో కొనసాగుతారు. మిగితా వారికి రిటైర్‌మెంట్ బెనిఫిట్‌గా సుమారు రూ. 12 లక్షలు ఇస్తారు.

విధి నిర్వహణలో మరణించిన వారికి పరిస్థితుల ఆధారంగా రూ. 25 నుండి 45 లక్షల దాకా ఎక్స్‌గ్రేషియా ఉంటుంది. మిగిలిన సర్వీసు కాలం జీతాన్ని కూడా కుటుంబానికి అందజేస్తారు. ఈ విధానాన్ని కేంద్రం ఎంత సమర్థించుకున్నా సైన్యంలో చేరాలన్న ఉత్తరాది యువతకు తీవ్ర నిరాశే మిగిలింది. నాలుగేళ్ళ సర్వీసు తర్వాత బయటికి వచ్చి తిరిగి ఉద్యోగాన్ని వెదుక్కోవడం కష్టమని వారు వాపోతున్నారు. విపక్షాలు కూడా అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకించాయి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ ప్రభుత్వం వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఆయన మాటకు ప్రజలు మద్దతు పలికారని ఉత్తరాది ఓటర్ల సరళి తెలియజేస్తోంది. ఈ ఎన్నికల్లో బిజెపి ఆయా ప్రాంతాల్లో బలహీనపడింది. మహారాష్ట్ర, బీహార్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి సీట్లు తగ్గి వారి ప్రభుత్వం ఈసారి సంకీర్ణంలో పడక తప్పలేదు.కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే మోడీ ప్రభుత్వానికి భాగస్వామ్యపక్షాల నుండే అగ్నిపథ్ విషయంలో సవరణల డిమాండ్ ఎదురైంది.

నితీశ్ కుమార్ పార్టీ జెడి(యు), లోక్ జన శక్తి (రామ్ విలాస్) పార్టీలు ఈ పథకాన్ని సమీక్షించాలని కోరాయి. నితీశ్ లోక్‌సభ సీట్లు మోడీ పాలనకు ఊతకర్రలు. క్రితంలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొనే శక్తి ఎన్‌డిఎకు లేదిప్పుడు. కాంగ్రెస్ గెలిస్తే ఈ పథకం రద్దు అనే మాట నిజం కాలేకపోయినా ప్రజల కోరిక మేరకు సమీక్షను కోరిన నితీశ్ ఓ మంచి పని చేసినట్లే. మరో తీవ్రమైన విషయమేమిటంటే సైన్యంలో పని చేయాలని జీవితలక్ష్యంగా ఉన్నవారు విదేశాల్లో సైన్యంలో చేరిపోతున్నారని కూడా తెలుస్తోంది. గుర్ఖా బెటాలియన్‌లో చేరేందుకు వచ్చే నేపాల్ జాతి యువకులు ఈ పథకంపై అనాసక్తితో చైనాకి వెళ్లి అక్కడి సైన్యంలో రిక్రూట్ అవుతున్నారట. ఇవన్నీ అగ్నివీర్ వల్ల ఉద్భవించిన తీవ్రంగా పరిగణించవలసిన విపత్కర పరిణామాలు.
దీర్ఘకాలంలో మన సైన్యంలో చేరేవాళ్లు తగ్గిపోయి భారతీయ యువత విదేశీ సైన్యంలో పెరిగే ప్రమాదం ఉంది. ఇది దేశ సమగ్రతకే ముప్పు కలిగిస్తుంది. దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన ప్రతి సైనిక నియామకాన్ని సైనికాధికారుల సమీక్ష ఉంటుంది. అదే క్రమంలో అగ్నిపథ్ ఫలితాల విషయంలో మూడు రకాల అగ్నివీర్ దళాలపై ఈ జనవరిలో ఓ అధికారిక అధ్యయనం కూడా జరిగింది.

చేరిన వారికి చేస్తున్నపని పట్ల ఆసక్తి కన్నా నాలుగేళ్ళ తరవాత ఉండేదెవరో, పోయేదెవరో అనే బెంగ వారిని వదలడం లేదని అందులో తేలింది. బడుగు, బలహీనవర్గాలు మరోదారి లేక ఇందులో ఎక్కువగా చేరుతున్నారని, ఉద్యోగకాలంలో ఆయుధాల శిక్షణ పూర్తవుతుంది కాబట్టి ఉద్యోగానంతరం తగిన ఉద్యోగం దొరకనివారు అసాంఘిక శక్తులకు సహరించవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అందువల్ల ఈ స్కీమ్‌లో మార్పులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మాజీ సైనిక అధికారి అశోక్ మెహతా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నేపథ్యంలో అగ్నిపథ్‌పై వివిధ మార్పులకై సూచనలు చర్చలోకి వస్తున్నాయి. శిక్షణా కాలాన్ని ఆరు నెలల నుండి తొమ్మిది నెలలకు పెంచాలి. ఉద్యోగకాలం నాలుగు నుండి ఎనిమిది సంవత్సరాలు చేయాలి. ఆ తర్వాత 25% కు బదులు 60 – 70 శాతం మంది అగ్నివీర్‌లను ఉద్యోగాల్లో కొనసాగించాలి. వయో పరిమితిని కూడా 21నుండి 23కు పెంచాలి. ఈ సిఫారసులను ప్రభుత్వం తప్పక పరిశీలించవలసిన అవసరం ఉంది.

అగ్నివీర్ అనేది వాడుకొని పారెయ్ అనేంత దౌర్భాగ్య పథకమని రాహుల్ గాంధీ లోక్‌సభలో అన్నారు. సైన్యాన్ని రెండు రకాలుగా విడదీసి దేశ రక్షణకు పాటుపడేవారిని నిరుత్సాహపరచవద్దని కోరారు. ఈ రకంగా ఈ పథకంపై ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత నిండు సభలో నిలదీయడంతో పాటు, ‘ఇండియా’ భాగస్వామ్య పక్షాలు కూడా పట్టుబట్టడంతో అగ్నివీర్‌కు మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పుల కోసం గట్టిగా పట్టుబట్టి సాధించే బాధ్యత జెడి(యు), ఎల్‌జెపి పక్షాలపై ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News