Thursday, January 23, 2025

‘ఎఐ’లో మార్పులు

- Advertisement -
- Advertisement -

ఉన్నతాధికారుల స్థానంలో కొత్తవారి నియామకం, సిసిఒగా నిపుణ్, సిహెచ్‌ఆర్‌ఒగా త్రిపాఠి
సలహాదారులుగా మాలిక్, శరణ్  ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ ఆదేశాలు

Changes in Air India

న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ విమాన సంస్థలో పునర్‌వ్యవస్థీకరణ పనులు వేగవంతం చేశారు. ఉన్నతాధికారుల్లో కీలక మార్పులు చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ఎయిర్ ఇండియాకు చైర్మన్‌గా శేఖరన్ బాధ్యతలు చేపట్టారు. టాటా గ్రూప్ చైర్మన్ కూడా అయిన శేఖరన్, తాజాగా ఎయిర్ ఇండియా యాజమాన్యంలో అనేక మార్పులు చేయాలని నిర్ణయించారు. చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా నిపుణ్ అగర్వాల్, హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్‌గా దత్ త్రిపాఠి నియమితులయ్యారు.

ప్రస్తుతం అగర్వాల్ టాటా సన్స్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అయితే ఎయిర్ ఇండియాలో మీనాక్షి మాలిక్ స్థానంలో ఆయన వచ్చారు. అదే సమయంలో త్రిపాఠి 2012 నుంచి హ్యూమన్ రిసోర్స్ వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందిస్తుండగా, ఇప్పుడు ఎయిర్ ఇండియాలో అమ్రితా శరణ్ స్థానంలో రానున్నారు. ఈమేరకు చంద్రశేఖరన్ ఆర్డర్ జారీ చేశారు. మాలిక్, శరణ్‌లు శుక్రవారం నాడు ఎయిర్ ఇండియా సిఇఒకు సలహాదారులుగా నియమితులయ్యారు. ఈమేరకు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ ఇండియాకు ఇంకా సిఇఒను నియమించలేదు. అందువల్ల ప్రస్తుతం చంద్రశేఖరన్‌కు మాలిక్, శరణ్‌లు సలహాదారులుగా ఉంటారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తున్న సత్య రామస్వామి ఎయిర్ ఇండియాలో చీఫ్ డిజిటల్, టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఎయిర్ ఇండియా కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ హెడ్‌గా రాజేష్ దోగ్రా, అలాగే ఆపరేషన్స్ చీఫ్‌గా ఉన్న ఆర్.ఎస్.సంధును కొనసాగించారు.

కొత్తగా నియమితులైన వారు వారి వారి విభాగాల్లో బాధ్యతలు నిర్వహిస్తారని, కొత్త బాధ్యతలు చేపట్టిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చంద్రశేఖరన్ అన్నారు. గతేడాది అక్టోబర్ 8న రూ.18 వేల కోట్లకు ఎయిర్ ఇండియా బిడ్‌ను టాటా సన్స్ సొంతం చేసుకుంది. ఎయిర్ ఇండియాకు రూ.46,262 కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ అప్పులను ఎఐఎహెచ్‌ఎల్(ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్)కు బదిలీ చేస్తారు. ఎయిర్ ఇండియాకు చెందిన అప్పులను బదిలీ చేసేందుకు గాను ఈ స్పెషల్ పర్పస్ వెహికిల్(ఎస్‌పివి) ఎఐఎహెచ్‌ఎల్‌ను ఏర్పాటు చేశారు.

ఈ లావాదేవీల్లో రూ.14,718 కోట్ల విలువచేసే భూమి, నిర్మాణాలు ఉండవు, వీటిని ఎఐఎహెచ్‌ఎల్‌కు బదిలీ చేయనున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన మొత్తం అప్పులో టాటాకు రూ.23 వేల కోట్లు, మిగతా బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. గెలిచిన బిడ్డర్ ఎయిర్ ఇండియా ఉద్యోగులను ఒక సంవత్సరం పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు వెనక్కి వెళ్లాలనుకుంటే రెండో సంవత్సరం నుండి వారికి విఆర్‌ఎస్ ఇస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News