ఆదివారం రోగులకు వైద్య సేవలు
ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు
నగర ప్రజలు చికిత్సలు చేయించుకోవాలని వైద్యాధికారుల సూచనలు
హైదరాబాద్: నగరంలో పేదలకు వైద్య సేవలందించే బస్తీ దవాఖానలో రోగులకు మెరుగైన చికిత్సలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.జె.వెంకటి తెలిపారు. ఆదివారం రోజు ప్రజలకు బస్తీదవాఖానలు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో నెలకొల్పబడిన బస్తీదవఖానలు ఈనెల 7వ తేది నుంచి ప్రతి ఆదివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు తెరచి ఉంచి, వైద్యులు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారని, శనివారం రోజు మాత్రం బస్తీదవాఖానలు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమార్పును గ్రేటర్ ప్రజలు గుర్తించుకుని ఆదివారం బస్తీదవాఖానల సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈనెల 11న రేడియోలజీ ల్యాబ్స్ ప్రారంభం: టీ డయగ్నోస్టిక్స్, బస్తీ దవాఖానాలకు అనుగుణంగా నగరంలో రేడియోలజీ ల్యాబ్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటిలో అల్ట్రాసౌండ్ పరీక్షలు, 2డీఎకో, ఎక్స్‌రే, మెమోగ్రఫీ లాంటి పరీక్షలను బస్తీవాసులకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. గ్రేటర్‌లో 12ల్యాబ్స్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకోగా వాటిలో ముందుగా 10 పూర్తికావడంతో వాటిని ప్రారంభించి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని, వీటిని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు.
12నుంచి ఆసుపత్రుల్లో ఉచిత భోజనం పంపిణీ: నగరంలోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు పుటలా నాణ్యమైన ఉచిత భోజనం పెట్టేందుకు చర్యలు చేపట్టనున్నారు. రోగులకు ఆసుపత్రి లోపల భోజనం పెడుతారు. వారి సహాయకులకు ఆసుపత్రి వెలుపలా భోజనం సౌకర్యం కల్పించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తియ్యాయి. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి రోగులను,వారి సహాయకులను దృష్టిలో ఉంచుకుని ఈకార్యక్రమం అమలు చేస్తున్నట్లు ఆసుపత్రుల అధికారులు వెల్లడిస్తున్నారు.