హైదరాబాద్: సిఎం కెసిఆర్ జిల్లాల పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 19 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల పర్యటన వాయిదా పడింది. ఈ నెల 23 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటిస్తారు. 23న వనపర్తి జిల్లాలో సిఎం పర్యటించనున్నారు. గతంలో నాలుగు జిల్లాల్లో సిఎం పర్యటించారు. గురువారం వనపర్తిలో పర్యటించనున్న సిఎం కెసిఆర్ నూతన కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. కొత్త మార్కెట్ యార్డును, రెండు పడకల గదుల ఇళ్లను కూడా ప్రారంభిస్తారు. వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, కర్నెతండా ఎత్తిపోతల, వేరుశనగ పరిశోధనా కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్ రిజిస్ట్రార్, నీటిపారుదల శాఖ సీఇ కార్యాలయాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. టిఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్న కెసిఆర్.. పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వనపర్తి జిల్లా పర్యటన అనంతరం సిఎం కెసిఆర్ జనగామ పర్యటనకు వెళ్తారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు టిఆర్‌ఎస్ జిల్లా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బహిరంగసభలోనూ పాల్గొంటారు. ఇతర జిల్లాల్లోనూ ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఆ తేదీలు త్వరలోనే ఖరారు కానున్నాయి. నాగర్ కర్నూల్‌జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న సిఎం ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం, జలాశయానికి శంకుస్థాపన చేయడంతో పాటు వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లోనూ పర్యటించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్.. కొత్త కలెక్టరేట్లను ప్రారంభించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయా జిల్లాల్లో పూర్తయిన టిఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు.