Thursday, January 23, 2025

లయ తప్పుతున్న తరగతి గది!

- Advertisement -
- Advertisement -

ఇప్పటికి రిటైర్ అవుతున్న ఉపాధ్యాయ మిత్రుడు ఒకాయన నిట్టూర్పుతో ఓ మాటన్నాడు! ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మన తరం అంతరించిపోతుంది. ఇక ఉన్న ఉపాధ్యాయులు ప్రైవేటు విద్యా వ్యవస్థలో చదువుకున్న వాళ్ళే! మనకు విద్య నేర్పిన గురువులు ఎంతో క్రమశిక్షణ మనకు ఇచ్చారు, వారిస్ఫూర్తితో మనం పని చేశాం! కానీ, ఇప్పుడు తరగతి గదిని, విద్యార్థులను చూస్తే ఆవేదన కలుగుతుంది. ‘నిజమే! ఆయన అన్నమాటలు అక్షర సత్యాలు. గతంలో ఒక్క నల్లబల్లనే విద్యార్థులు, ఉపాధ్యాయులు మధ్య అధ్యయనానికి అనుబంధంగా ఉండేది. ఈరోజు అధునాతన తరగతి గదికి నల్లబల్ల స్థానంలో రేడియో, టివి, కంప్యూటర్, కెవైసి, సెటిలైట్ ఛానల్స్ లాంటి ఎన్నో అధునాతన దృశ్యశ్రవణ పరికరాలు అందుబాటులో కొచ్చాయి.

తరగతి గది ఎంతో వేగంగా అభివృద్ధి చెందాలి. కానీ, రిటైర్ ఉపాధ్యాయుని ఆవేదనలో చెప్పిన క్రమశిక్షణ గానీ, అధ్యయన సామర్థ్యం గానీ నేడు మచ్చుకు కూడా నాటి విలువలు కానరావడం లేదు! అదిగో ఇక్కడే ఎక్కడో తరగతి గది లయ తప్పిన జాడలు కనిపిస్తున్నాయి. గడచిన కాలంలో విద్యార్థులుగా ఉంటూ పనిలో తల్లిదండ్రులకు సహకరించేవారు, పాఠశాలలో కూడా పని అనుభవం క్రింద బడి తోటలో మొక్కలు పెంపకంపై ఆసక్తి కల్పించేవారు. పాఠశాల ఆస్తిని అపురూపమైన ఉమ్మడి ఆస్తిగా భావించేవారు. సమాజం నుండి కొన్ని విలువలకు సైతం పెద్దపీట వేసేవారు. కుల, మత రహిత వివక్షకు తావు లేని వాతావరణం ఉండేది. నూటికి 90 శాతం పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను పొందేవారు. నేడు ఎన్నో అవకాశాలు అందివచ్చినా, ప్రైవేటు విద్యా వ్యవస్థనే సింహా భాగం ప్రభావం చూపుతుంది.

మెజారిటీ విద్యార్థులలో ‘షార్ట్ టెంపర్’ కనిపిస్తుంది. కాస్తా సమయం దొరికితే ప్రభుత్వం పాఠశాలలో అయితే పాఠశాల ఆస్తులు, ఫ్యాన్లు ధ్వంసం చేయడం, మరీ ప్రాథమిక విద్యాభ్యాసంలోనే ప్రేమలు పేరుతో, శారీరక ఆకర్షణలకు గురికావడం కనిపిస్తుంది. చిన్నచిన్న విషయాలకే పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడడం చూస్తున్నాము. ఇది ప్రైవేటు పాఠశాలల్లో ఒకింత ఎక్కువగా ఉండడం ఆశ్చర్యకరం! చాలా మంది అభిప్రాయం ఏమంటే నైతిక విద్యా లోపంగా చెబుతుంటారు? వాస్తవంగా పాఠశాలలో నైతిక విద్యను బోధించడం లేదా? 2009 విద్య హక్కు చట్టంలోనే దీనికి పెద్ద పీట వేశారు. నైతిక విద్య, పని విద్య, చిత్ర లేఖనం, ఒరిగామీ ఇలా కరిక్యులంలోనే నాలుగు అంశాలు చేర్చినప్పటికీ వాటికి కన్నీటితుడుపుగా సిలబస్ కేటాయించారు. మాడ్యూళ్ళు రూపొందించారు,

కానీ 14 ఏళ్ళు గడిచినా ఆయా సబ్జెక్టులకు ఉపాధ్యాయులు కేటాయింపు జరగలేదు! కాకపోతే శిక్షణ లేని విద్యా వాలెంటీర్లను తాత్కాలిక ప్రాతిపదికన కొన్ని పాఠశాలలో నియమించారు సరికదా! ఆయా అంశాల ప్రాధాన్యత రీత్యా తగిన సమయం కేటాయింపులేదు? వాటిని పాఠశాలలో ప్రాధాన్యత లేని అంశంగానే భావిస్తున్నారు. చట్టబద్ధ్దమైన నైతిక విద్య, విలువలు నేర్పడంలో విద్యాశాఖ వైఫల్యం కనిపిస్తుంది. అనాదిగా నైతిక విద్య లేకపోయినా విద్యార్థి కొన్ని విలువలకు, సాంప్రదాయాలు కుటుంబం నుండి, తన పరిసరాల నుండి, సమాజం నుండి అనుకరణ ద్వారా నేర్చుకునే వాడు!
నేడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో విద్యార్థి లేడు, వసతి గృహాలు, నిరంతరం ఉరుకుల పరుగుల తల్లిదండ్రులు, మరో వైపు మీడియా, సినిమా, టెలివిజన్,

టెలిఫోన్ ఇవ్వన్నీ విద్యార్థి జీవితాన్ని చుట్టుముట్టి కాంక్రీటు వ్యవస్థను విద్యార్థి చుట్టూ కట్టి నిస్తేజంగా తయారు చేస్తున్నాయి. ఒక రకమైన బానిస సంస్కృతి కి బందీగా మార్చి విద్యార్థిని మూస పద్ధ్దతిలోకి మార్చివేస్తుంది! ఫలితంగా చిన్న సవాలును కూడా తట్టుకోలేని స్థితికి విద్యార్థులు నెట్టివేయబడుతున్నారు. ఫలితం విద్యాలయాల్లో బయట విద్యార్థులు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. సమాజంలో క్షణికావేశ హత్యల పరంపర పెరిగిపోయింది. తల్లిదండ్రుల ఆలోచనలు కూడా వ్యక్తి గత స్వార్థంతో కూడుకున్నవిగానే ఉంటున్నాయి. సామాజిక జ్ఞానం ఉన్నా, లేకపోయినా పర్వాలేదు. తమ పిల్లలు ర్యాంకర్లు కావాలి. ఉన్నత స్థితికి ఎదగాలి. విదేశాలలో స్థిరపడాలి. ఒక రూపాయికి వంద రూపాయల విదేశీ కరెన్సీని సాధించాలి. ఇదే ఆలోచన తప్ప!
తమ పిల్లలు ఏపాటి సామాజిక అవగాహన కలిగి ఉన్నారు? జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించగలుగుతారా? లేదా మానవీయ కోణంలో ఆలోచించగలరా? అని ఆలోచించే తల్లిదండ్రులు సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. ఫలితంగా డబ్బే సర్వస్వం అన్నవైపు యువత నెట్టబడుతూ ఉంది? కనీసం మానవీయ విలువలు సమాజంలో మృగ్యమవుతున్నాయి. ఇటీవల కాలంలో గ్లోబలైజేషన్ మూలంగా ఈజీ మనీ క్రేజీ జీవితం వైపు కొందరు యువత దారిమళ్లుతున్నది. ఫలితంగా సమాజంలో మోసాలు చేస్తున్న వారి సంఖ్యా, అంతే మోతాదులో మోసానికి గురవుతున్న వారిసంఖ్యా ఉంటున్నది! ఇట్లాంటి స్థితికి బాధ్యులు ఎవరు? ఈ ప్రశ్నకు సరిగా అమలు గాని విద్యా వ్యవస్థ అని లాభం లేదు? ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో పాలక పక్షాలు విద్యను వ్యాపారమయం,

అమ్మకం సరుకుగా తయారు చేశారు. ఫలితంగానే మన దేశంలో విద్య నేర్చుకొని ఇతర దేశాలలో మేధో వలసలు వెళ్ళి ఆయా దేశాల సేవల్లో తరిస్తున్నారు. దేశభక్తి అనేది పాస్‌పోర్టు స్థాయికి కుదించబడిం ది. ఒకప్పుడు మన నలందా, తక్షశిల, ఉస్మానియా లాంటి విశ్వ విద్యాలయాల్లో విదేశీ విద్యార్థులు కనిపిస్తే, నేడు మనమే ఇతర దేశాల విద్యాలయాల్లో విద్య, ఉపాధి కోసం దేబిరించాల్సిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి గాడి తప్పిన వ్యవస్థలో లయ తప్పుతున్న విద్యార్థులను క్రమశిక్షణ, వలువలు ఉన్న విలువలు బాట పట్టించేది ఎట్లా? ఈ విషయంలో మారాల్సింది చట్టాలే కాదు! బాధ్యతాయుతమైన ప్రభావిత సమాజం కూడానూ!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News