Friday, October 18, 2024

ఐపిఎల్ ఫార్మాట్‌లో మార్పులు!

- Advertisement -
- Advertisement -

Changes in IPL 2022 format!

పది జట్లు, రెండు గ్రూపులు
ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు
గవర్నింగ్ కౌన్సిల్ భేటిలో కీలక నిర్ణయాలు

ముంబై: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 15వ సీజన్‌లో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈసారి ఐపిఎల్‌లో పది జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. ఇక కరోనా భయం పూర్తిగా తగ్గక పోవడంతో ఐపిఎల్ టోర్నీని కేవలం నాలుగు వేదికలకే పరిమితం చేశారు. అంతేగాక ఐపిఎల్‌లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. కరోనా నేపథ్యంలో విమాన ప్రయాణాల్ని నిలవరించేందుకు ఈసారి వేదికలను కుదించారు. ముంబైలోని మూడు వేదికలతో పాటు, పుణెలోని ఎంసిఎ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ముంబైలోని ఖాంఖడే, డివై పాటిల్, బ్రబోర్న్ స్టేడియాలతో పాటు పుణెలోని ఎంసిఎ క్రికెట్ గ్రౌండ్ ఐపిఎల్‌కు వేదికగా నిలువనున్నాయి. ఈ విషయాన్ని బిసిసిఐ ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. తాజాగా ఐపిఎల్ లీగ్ దశ మ్యాచ్‌ల నిర్వహణలో కూడా కీలక మార్పులు చేశారు. ఈసారి లీగ్ దశలో 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఐపిఎల్ టోర్నీ ఫార్మాట్‌లో కీలక మార్పులు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టోర్నీలో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

ఐపిఎల్‌లో ప్రదర్శన ఆధారంగా జట్లను రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఐపిఎల్‌లో ఎన్ని సార్లు ట్రోఫీలు గెలుచుకుంది. ఎన్ని సార్లు ఫైనల్‌కు చేరుకుందనే విషయాలను పరిగణలోకి తీసుకుని జట్ల ఎంపిక జరిగింది. గ్రూపుఎలో ఐదు సార్లు విజేత ముంబై ఇండియన్స్, రెండు సార్ల చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, ఓసారి విజేత రాజస్థాన్ రాయల్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఇక గ్రూప్‌బిలో నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన సిఎస్‌కెతో పాటు ఓసారి చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్, మూడు సార్లు రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఓసారి ఫైనలిస్ట్ పంజాబ్ కింగ్స్‌తో పాటు కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌లు చోటు చేసుకున్నాయి. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అంతేగాక రెండో గ్రూప్‌లోని ఓ జట్టుతో రెండు మ్యాచ్‌లు, మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ను ఆడాలి. లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్‌ల చొప్పున ఆడుతాయి. ఇక పాయింట్ల పట్టికలో ముందంజలో ఉండే జట్లు నాకౌట్ రేసుకు చేరుకుంటాయి. మరోవైపు ప్లేఆఫ్ దశలో ఎప్పటిలాగే నాలుగు మ్యాచ్‌లు ఉంటాయి.

ఇందులో క్వాలిఫయర్1, ఎలిమినేటర్, క్వాలిఫయర్2లతో పాటు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇక ప్రతి జట్టు సొంత మైదానంలో ఏడు, బయట ఏడు మ్యాచ్‌లు ఆడుతుంది. అంతేగాక ప్రతి జట్టు వాంఖడే, డివై పాటిల్ స్టేడియాల్లో నాలుగేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. దీంతోపాటు బ్రబోర్న్, పుణెలలో మూడేసి మ్యాచ్‌లు ఆడాలి. అయితే ఏ జట్టుకు ఏది సొంత మైదానం అనేది త్వరలోనే స్పష్టత రానుంది. కాగా వాంఖడే, డివై పాటిల్ స్టేడియాల్లో 20 మ్యాచ్‌ల చొప్పున నిర్వహిస్తారు. ఇక పుణె, బ్రబోర్న్ స్టేడియాల్లో చెరో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లేఆఫ్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ ఎక్కడ నిర్వహిస్తారనేది ఇంకా ప్రకటించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News