మేడ్చల్ : ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాలలో మార్పులు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాల ఏర్పాటు, నూతన ఓటరు నమోదుపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికలతో నియోజకవర్గాలలోని పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 1350కు మించి ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలలో అదనపు ఓటర్ల కోసం కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్ల సౌలభ్యం కోసం కొన్ని ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాలను లిఫ్ట్ చేశామని కలెక్టర్ తెలిపారు. అన్ని సౌకర్యాలు ఉన్న భవనాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నందున పోలింగ్ కేంద్రం, ప్రాంతం మారే అవకాశాలు ఉంటాయని ఇందుకు రాజకీయ పార్టీలు సహరించాలని కోరారు. మారనున్న పోలింగ్ కేంద్రాల వివరాలను కలెక్టర్ అమోయ్ కుమార్ సమావేశంలో తెలియజేశారు. రాజకీయ పార్టీల నాయకుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాలను తప్పకుండా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. 2023 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదుకు, నూతన ఓటరు కార్డు, మార్పు చేర్పులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫారం 6, 7, 8 లకు సంబంధించి బిఎల్‌వోల వద్ద నుంచి స్వీకరించిన వాటిని జాగ్రత్తగా అప్‌లోడ్ చేయాలని ఈఆర్‌వోలను ఆదేశించారు.
పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాజకీయ పార్టీలు, బూత్ ఏజెంట్లు తమ సహకారాన్ని అందించి రాబోయే సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, అభిషేక్ అగస్తా, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఆర్డీవోలు శ్యామ్ ప్రకాష్, రాజేష్‌కుమార్, బిఆర్‌ఎస్, బిజేపి, కాంగ్రెస్, బిఎస్‌పి, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు పాల్గొన్నారు.