న్యూఢిల్లీ: గత వలస పాలకుల విధానాలకు స్వస్తి పలికేలా రాష్ట్రపతి భవన్ లోని అశోక్ హాల్, దర్బార్ హాల్ పేర్లు మారినట్టు ప్రెసిడెంట్ సెక్రటేరియట్ గురువారం వెల్లడించింది. వివిధ కార్యక్రమాల నిర్వహణకు వేదికగా ఉంటున్న దర్బార్ హాల్‌ను గణతంత్ర మండపంగా, అశోక్ హాల్‌ను అశోక్ మండపంగా పేరు మార్చారు. “ఈ పేర్ల మార్పు నిర్ణయం రాష్ట్రపతి తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి కార్యాలయమే కాక, రాష్ట్రపతి నివాసభవనం. జాతికి చిహ్నమైన ఈ భవనం ప్రజలతో నిత్యం అనుసంధానంగా ఉంటుంది” అని సెక్రటేరియట్ తన ప్రకటనలో వివరించింది. దర్బార్ హాల్ జాతీయ అవార్డుల ప్రదానం వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికగా ఉంటోంది.
భారత పాలకులు , బ్రిటిష్ వారు దర్బార్ హాల్‌లో సమావేశాలు నిర్వహించేవారు. భారత్ గణతంత్ర రాజ్యంగా మారిన తరువాత దర్బార్ హాల్ అన్న పేరు ప్రాముఖ్యతను కోల్పోయింది. అందుకే భారతీయుల్లో నెలకొన్న గణతంత్ర భావనకు తగ్గట్టు ఈ దర్బార్‌హాల్‌కు గణతంత్ర మండపం అన్న పేరు సరైనది” అని పేర్కొంది. ఇక అశోక్‌హాల్ వాస్తవానికి ఒక బాల్ రూమ్. అయితే అశోక అన్న పదానికి అర్థం అన్ని బాధల నుంచి విముక్తి పొందడం అని వెల్లడించింది. అలాగే భారత చరిత్రలో అశోక చక్రవర్తి. ఐక్యతకు, శాంతియుతమైన సమాజానికి ప్రతీక. ఈ కారణంగా అశోక్ మండపం అని మార్చడమైందని సెక్రటేరియట్ పేర్కొంది. ఈ పేర్ల మార్పుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. “దర్బార్ అనే కాన్సెప్ట్ లేదు. కానీ షెహన్‌షా (చక్రవర్తి) కాన్సెప్ట్ ఉండటం విశేషం” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.