మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్ వర్క్ మరో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ తో రాబోతోంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మిస్తున్నారు. కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. ఈనెల 15న వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మాస్ మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. హీరో శ్రీవిష్ణు, దర్శకులు హరీష్ శంకర్, అనుదీప్, కృష్ణచైతన్య, సందీప్ రాజ్, వంశీ, వెంకటేష్ మహా, శరత్ మరార్, వివేక్ కూచిభొట్ల, ఎస్కేఎన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. హిలేరియస్, యంగేజింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ “ ముందుగా ‘ఛాంగురే బంగారురాజా’ టైటిల్ నాకు విపరీతంగా నచ్చేసింది. సతీష్ కథ చెబుతున్నపుడు దర్శకుడు పాత వంశీ గుర్తుకు వచ్చారు. ఆయనతో ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా చేశాను. అలాంటి హ్యుమర్, ఈస్ట్ గోదావరి వెటకారం, కథ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. ఈ సినిమా విజయం సాధించి టీమ్ సభ్యులందరికీ కూడా మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను”అని అన్నారు. డైరెక్టర్ సతీష్ వర్మ మాట్లాడుతూ “రెండు గంటల ఈ సినిమాలో గంటన్నర ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఫ్యామిలీతో పాటు చూసే క్లీన్ ఎంటర్‌టైనర్ చేశాం. కుటుంబంతో కలసి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు”అని తెలిపారు.