ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ను వరుసగా రెండవరోజు సోమవారం భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో చార్‌ధామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యమునోత్రికి బయల్దేరిన యాత్రికులను బడ్‌కోట్ జన్కిచట్టి వద్ద నిలిపివేయగా గంగోత్రి యాత్రలో ఉన్న యాత్రికులను హర్సిల్, భట్వారి, మనేరిలో ఉండిపోవాలని ఆదేశించినట్లు ఉత్తరకాశి జిల్లా మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ తెలిపారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలకు వెళ్లే యాత్రికులను వాతావరణం మెరుగుపడేవరకు ముందుకు సాగవద్దని అధికారులు ఆదేశించారు. బద్రీనాథ్ వెళుతున్న యాత్రికులలో చాలామంది జోషిమఠ్, చమోలిలో నిలిచిపోయినట్లు చమోలి జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ఎన్‌కె జోషి తెలిపారు. కేదార్‌నాథ్‌కు బయల్దేరిన దాదాపు 4,000 మంది యాత్రికులను ముందు జాగ్రత్తగా లించోలి, భింబాలి వద్ద నిలిపివేసినట్లు రుద్రప్రయాగ్ విపత్తు నిర్వహణ అధికారి ఎన్‌కె సింగ్ తెలిపారు. ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ జారీచేసిన భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్టా యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చార్‌ధామ్ దేవస్థానం బోర్డు సోమవారం తెలిపింది.