Wednesday, November 6, 2024

చార్‌ధామ్ యాత్ర రద్దు

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్ర రద్దు
ఏడాదికోసారి దర్శనం ఈసారి లేదు
కరోనా కేసుల ఉధృతితో జాగ్రత్త చర్య
అంతర్గత పూజలే అన్న సిఎం తీరథ్

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఏటా వేసవికాలంలో జరిగే చార్‌ధామ్ యాత్రా ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసింది. కొవిడ్ ఉధృతి, దేశవ్యాప్తంగా తలెత్తుతున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ యాత్రను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ గురువారం ప్రకటించారు. చార్‌దామ్ అంటేనే నాలుగు ఆలయాల సముదాయం. హిందు భక్తులకు ఈ క్షేత్రం అత్యంత విశ్వాస ప్రాంతం. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నాలుగు ఆలయాలలోకి భక్తులను అనుమతించేది లేదని, అర్చకులే పూజాదికాలు చేపట్డం జరుగుతుందని సిఎం వివరించారు. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‌ధామ్‌గా పిలుస్తారు. హిమాలయ శ్రేణువులలో ఉండే ప్రాంతం కావడంతో ఆరు నెలలు మంచులో ఈ ఆలయాలు కప్పిపోయి మూసుకుని ఉంటాయి. అయితే వేసవి నుంచి ఆరు నెలల పాటు భక్తులకు, పర్యాటకులకు ఆలయాల సందర్శనకు వీలుంటుంది. ఈ ఏడాది మే 14 నుంచి చార్‌ధామ్ యాత్ర ఆరంభం కావాల్సి ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో కొద్దిరోజులుగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవలే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళ జరిగింది. అత్యధిక సంఖ్యలో జనం పవిత్రస్నానాలకు తరలివచ్చారు. ఈ అంశంపై తీవ్రస్థాయిలో విమర్శలు తలెత్తాయి. కరోనా తీవ్రస్థాయి వ్యాప్తికి ఇక్కకి వచ్చిన భక్తులు సూపర్‌స్పైడర్స్‌గా మారారని, దేశ వ్యాప్తంగా కరోనా విస్తృతికి ఇదే కారణం అయిందనే వాదన విన్పించింది. ఈ తరుణంలోనే వచ్చే నెల జరిగే చార్‌ధామ్‌కు ముందుగానే నిలిపివేత ఆదేశాలు వెలువరించారు.

ఇప్పటికైతే యాత్ర రద్దు అయినట్లు, అయితే తరువాతి పరిస్థితిని లెక్కలోకి తీసుకుని ఆ తరువాత యాత్ర ఉంటుందా? అనేది చెప్పలేమని సిఎం తెలిపారు. ఆలయాలు తెరిచి ఉంటాయని, పూజారులకే లోపలికి అనుమతి ఉంటుందని సిఎం తెలిపారు. కేదార్‌నాథ్ ఆలయాన్ని భక్తుల కోసం సాధారణంగా మే 17న ఉదయం తెరుస్తారు.బద్రీనాథ్‌ను మరుసటిరోజు దర్శనానికి అనుమతిస్తారు. ఇక యమునోత్రి మే 14న, గంగోత్రి మే 15న తెరవాల్సి ఉంటుంది. ఇటీవలే ఉత్తరాఖండ్ హైకోర్టు కొవిడ్ వైరస్ సంబంధిత కేసుల విషయంలో దాఖలు అయిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడింది. కుంభమేళ అట్టహాసం అనుచితం అని, ఇకనైనా చార్‌ధామ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగు ప్రామాణిక కార్యనిర్వాహక పద్ధతిని ముందు వెల్లడించాల్సి ఉందని తెలిపింది. లేకపోతే చార్‌ధామ్ మరో కుంభ్ అవుతుందని వ్యాఖ్యానించింది. గంగ, యమున నదుల జన్మస్థలి, శివుడి ప్రఖ్యాత ఆరాధన క్షేత్రాలు వెలిసిన చోటుకు ప్రతి ఏటా సందర్శనానికి వెళ్లితే జీవన పరమార్థం, అంతకు మించి ఆత్మపునీతం అవుతుందని కోట్లాది మంది హిందూవులు విశ్వసిస్తారు. అత్యంత క్లిష్టతరం, కొండలు కోనల మధ్య రమణీయ ప్రదేశాల గుండా సాగే యాత్రతో అపారమైన ఆనందం అంతకు మించిన పరిపూర్ణత సిద్ధిస్తుందని ఆశించే భక్తులు వేసవి మాసంలో ఈ దర్శనానికి ఎదురుచూస్తుంటారు. అయితే కొవిడ్ కల్లోలం ఈ దర్శన తపనను హరించివేసింది.

Chardham Yatra in Uttarakhand Cancelled

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News