కొవిడ్ నిబంధనల తనిఖీకి ఆలయాల వద్ద సిసి కెమెరాలు
డెహ్రాడూన్: శనివారం ఉదయం నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌లోని నాలుగు పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలకు భక్తులను అనుమతించారు. కొవిడ్ నిబంధనలతో భక్తులను అనుమతించినట్టు దేవస్థానాల బోర్డు ఇంచార్జ్ హరీశ్‌గౌడ్ తెలిపారు. కొవిడ్ నిబంధనల తనిఖీకి సిసిటివిలను ఆలయాల వద్ద ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం 4 గంటల వరకు బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను 419మంది భక్తులు సందర్శించారని ఓ అధికారి తెలిపారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను సందర్శించినవారిలో ఎక్కువగా స్థానికులున్నారని ఆయన తెలిపారు.
శనివారం సాయంత్రం వరకు చార్‌ధామ్ యాత్ర కోసం 19,491 ఇపాస్‌లు జారీ చేసినట్టు దేవస్థానాల బోర్డు తెలిపింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ యాత్ర జరపుకునేందుకు ఉత్తరాఖండ్ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో భక్తుల రాక ప్రారంభమైంది. అయితే, గర్భగుడిలోకి భక్తులను అనుమతించడంలేదని అధికారులు తెలిపారు. రోజువారీగా భక్తుల సందర్శనపైనా ఉత్తరాఖండ్ ప్రభుత్వం పరిమితి పెట్టింది. భద్రీనాథ్‌కు 1000, కేదార్‌నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మంది భక్తులకు మాత్రమే రోజువారీగా అనుమతిస్తారు. కొవిడ్ సెకండ్‌వేవ్ తర్వాత చార్‌ధామ్ యాత్ర వాయిదా పడ్తూ వచ్చింది. ఇటీవల కేసులు కాస్త తగ్గడంతో తిరిగి యాత్రకు అనుమతిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే,ఆలయాలను సందర్శించే భక్తులు కనీసం 15 రోజుల ముందు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రువీకరణ చూపాలి. లేదా 72 గంటలముందు ఆర్‌టిపిసిఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్‌ను చూపాలి.