Thursday, January 23, 2025

అయోమయంలో విమాన ప్రయాణికులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ ఇండియా దివాలా అంచుల్లోకి వెళ్లడంతో విమాన ప్రయాణికుల్లో తీవ్ర నిరాశ, గందరగోళ పరిస్థితి నెలకొంది. గోఫస్ట్ విమానాలను రద్దు చేయడం వల్ల కెపాసిటీ తగ్గుతుందని, దీంతో విమాన చార్జీలు పెరిగే అవకాశముందని టిఎఎఐ పేర్కొంది. విమాన చార్జీల పెరుగుదల నేపథ్యంలో రీబుకింగ్ టికెట్ల పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోఫస్ట్‌లో బిలియనీర్ నుస్లి వాడియా గ్రూప్‌నకు మెజారిటీ వాటా ఉంది. అయితే ఈ సంస్థ విమానయాన పరిశ్రమలో వేగంగా అడుగులు వేసింది. కానీ ప్రాట్ అండ్ విట్నీ అసమర్థత వల్ల కంపెనీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీదారు ప్రాట్ అండ్ విట్నీ (పిడబ్లు) గో ఫస్ట్‌కి ఇంజిన్‌లను సరఫరా చేయాల్సి ఉంది.

కానీ వాటిని సమయానికి డెలివరీ చేయలేదు. దీంతో గో ఫస్ట్ తన విమానాలను సగానికి పైగా గ్రౌండింగ్ చేయవలసి వచ్చింది. విమానాలు నడపలేకపోవడంతో నగదు కొరత సమస్య ఏర్పడింది. ఈ ఇంజన్‌లను ఎయిర్‌లైన్స్ ఎ20 నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉపయోగిస్తారు. ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటర్ డేటా ప్రకారం, విమానాల గ్రౌండింగ్ కారణంగా గోఫస్ట్ మార్కెట్ వాటా జనవరిలో 8.4 శాతం నుండి మార్చిలో 6.9 శాతానికి పడిపోయింది. ఈ మేరకు అమెరికాలోని డెలావేర్ కోర్టులో ఎయిర్‌లైన్స్ పిటిషన్ కూడా దాఖలు వేసింది. ఇంజిన్‌లను త్వరగా సరఫరా చేయకపోతే దివాలా తప్పదని ఎయిర్‌లైన్స్ పేర్కొంది.

5000 మంది ఉద్యోగుల్లో గుబులు
నగదు కొరతతో దివాలా స్థితికి చేరుకున్న విమానయాన సంస్థ గోఫస్ట్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానయాన సంస్థ మే 3, 4, 5 తేదీల్లో విమానాలను నిలిపివేసింది. దీంతో కొంత మంది ప్రయాణికులు సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైట్ ఆపరేషన్ రద్దు చేస్తే, విమానయాన సంస్థ టిక్కెట్ల డబ్బును కూడా వాపసు చేస్తుంది. అయితే ప్రయాణికుల ఇబ్బందులపై 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రభుత్వం ఎయిర్‌లైన్‌కు అన్ని విధాలుగా సహాయం చేస్తోందని, వాటాదారులతో కూడా మాట్లాడిందని అన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)కి గో ఫస్ట్ స్వచ్చంధ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఎన్‌సిఎల్‌టి మే 4న విచారణ జరుపుతుంది. నిధుల కొరత కారణంగా దివాలా ప్రక్రియకు వెళ్లవలసి వచ్చిందని ఎయిర్‌లైన్ చీఫ్ కౌశిక్ ఖోనా తెలిపారు.

బకాయిలు రాబట్టాం: ఇండియన్ ఆయిల్
గో ఫస్ట్ నుంచి ఇంధన బకాయిలను చాలా వరకు రాబట్టామని ఇండియన్ ఆయిల్ కార్ప్ ప్రకటించింది. జెట్ ఇంధనం విక్రయించిన ఇండియన్ ఆయిల్ బ్యాంక్ గ్యారెంటీల ద్వారా 61.14 మిలియన్ డాలర్లు సమీకరిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే గత కొద్ది నెలలుగా జరిపిన అన్‌సెక్యూర్డ్ సేల్స్‌కు సంబంధించి మరో 6.11 మిలియన్ డాలర్లు కూడా రికవరీ చేస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News