బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడియూరప్పపై నమోదైన లైంగిక దాడి ఆరోపణలను దర్యాప్తు చేస్తున్న కర్నాటక సిఐడి గురువారం పోక్సో కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. బిజెపి సీనియర్ నాయకుడు ఎడియూరప్పపై ఈ ఏడాది మార్చిలో ఇక్కడి సదాశివనగర్ పోలీసు స్టేషన్‌లో లైంగిక దాడి కేసు నమోదైన తర్వాత ఈ కేసును రాష్ట్ర డిజిపి అలోక్ మోహన్ సిఐడికి బదిలీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎడియూరప్ప డాలర్స్ కాలనీలోని ఆయన నివాసంలో తన 17 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడి జరిపినట్లు ఒక 54 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఆరోపణలను ఖండించిన ఎడియూరప్ప తనపై కుట్రలకు పాల్పడుతున్న వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఆయన చెప్పారు. ఎడియూరప్ప ఆరోపణలు చేసిన ఆ మహిళ గత నెల ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో లంగ్ క్యాన్సర్‌తో మరణించింది. ఈ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు జూన్ 17న ఎడియూరప్పను 3 గంటలపాటు ప్రశ్నించారు. ఈ కేసులో ఎడియూరప్ప అరెస్టును నిరోధిస్తూ కర్నాటక హైకోర్టు ఇదివరకే ఉత్తర్వులు జారీచేసింది.