చాంద్రాయణగుట్ట : పాతబస్తీ చాంద్రాయణగుట్ట జగన్నాథస్వామి ఆలయంలో మంగళవారం జగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్రాదేవిల రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో స్వామి వార్లకు ఉదయం అభిషేకం, యజ్ఞం వంటి ప్రత్యేక పూజలు, అలంకరణ కార్యక్రమాలను నిర్వహించారు. కాశీపీఠాధీశ్వరులు జగద్గురు రామానుజాచార్య స్వామి శ్రీ రుగ్వేదాచార్యజీ ఆధ్వర్యంలో స్వామివార్ల విగ్రహాలను రథంపై ఏర్పాటు చేసి పుర వీధుల గుండా ఊరేగించారు.
చార్మినార్ ఎసిపి రుద్ర భాస్కర్, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ ఎం.ఎ.జావీద్‌లు ప్రత్యేక పూజలు చేశారు. వారిని రిగ్వేదాచార్య జీ మహారాజ్ పుష్పమాలలతో సన్మానించారు. ర థయాత్ర ఆలయ నుండి ప్రారంభమై పాత పోలీసుస్టేషన్, గాంధీ విగ్రహం, చాంద్రాయణగుట్ట చౌరస్తా మీదుగా ఆలయానికి చేరుకుంది. దారి పొడవున స్వామి రథాన్ని లాగేందుకు భక్తులు వయో, లింగ భేదం లేకుండా పోటీ పడ్డారు. స్థానిక మహిళలు స్వామివారికి హారతి పట్టి కొబ్బరి కాయలను సమర్పించారు.
అనంతరం భక్తులకు మహా ప్రసాద వితరణ చేపట్టారు. ఇన్‌స్పెక్టర్ జావీద్ ఆధ్వర్యంలో పోలీసులు తగిన బందోబస్తు కల్పించారు. ఈ కార్యక్రమంలో రథయాత్ర కమిటీ ప్రతినిధులు గులాబ్ రాయ్ కాంతీలాల్, దామోదర్‌దాస్ గోవింద్ కుమార్ లోహియా, రాందేవ్ అగర్వాల్, చంగమల్ ప్రమోద్‌కుమార్, ప్రమోద్ కుమార్ కార్వాంకర్, జ్యోతిధర్ సింగ్, ఎం.ప్రభాకర్‌రాజ్ ముదిరాజ్, ఆర్.రామకృష్ణ ముదిరాజ్, పి.నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.