Tuesday, January 7, 2025

ప్రారంభోత్సవానికి ముస్తాబైన చర్లపల్లి రైల్వే టెర్మినల్

- Advertisement -
- Advertisement -

పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు
రూ.428 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్
నడున్తున్న ర్లెళ్లకు తోడు మరో 25 జతల రైళ్లు రాకపోకలు
తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా చర్లపల్లి

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరో కొత్త రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. సుమారు రూ.430 కోట్లతో ఎయిర్ పోర్టును తలదన్నేలా అత్యంత ఆధునిక సదుపాయాలతో నగర శివారులోని చర్లపల్లిలో కొత్త రైల్వే టెర్మినల్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లోని కొత్త శాటిలైట్ టెర్మినల్ త్వరలో ప్రారంభం కానుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ స్టేషన్ తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతోంది. అత్యాధునిక హంగులు, సకల వనతులు, రూ.428 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది.

ఈ రైల్వేస్టేషన్ మీదుగా ఇప్పటికే నడున్తున్న ర్లెళ్లకు తోడు మరో 25 జతల రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ప్రారంభిస్తారని మొదట్లో చెప్పారు. కానీ ప్రస్తుతం రైల్వే మంత్రి ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యతో హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్‌లపై తీవ్ర ఒత్తిడి పడుతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నగర శివారు ప్రాంతమైన చర్లపల్లి స్టేషన్‌ను ఆధునీకికరించి 56 వేల మంది రాకపోకలు చేసే విధంగా ఈ టెర్మినల్‌ను విస్తరించింది. ఈ అధునాతన చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభమైతే శివారు ప్రాంతాల్లోని వేలాది మంది ప్రయాణీకులకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు వెళ్లే అవసరం ఉండదు.

ఎయిర్‌పోర్టును తలదన్నేలా సౌకర్యాలు : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను రెండతస్తులతో అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించారు. ఈ నూతన రైల్వేస్టేషన్‌లో ఇప్పటికే ఉన్న 5 ప్లాట్‌‌ఫాంలకు అదనంగా 4 కొత్త ప్లాట్‌‌‌ఫాంలతో కలుపుకుని మొత్తం 9 ప్లాట్ ఫాంలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్‌పోర్టును మైమరిపించేలా అద్భుతంగా నిర్మించిన ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో వృద్దులు, దివ్యాంగులతో పాటు లగేజితో ఉండే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్లాట్‌ఫాంలు చేరుకునేందుకు ఆధునికమైన 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు నిర్మించారు. వీటికి తోడు రెండు ఫూట్‌‌‌ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. పురుషులు, మహిళా ప్రయాణీకులకు మౌలిక సదుపాయాలతో ఉండి వేర్వేరు వెయిటింగ్ హాళ్లు, హైక్లాస్ ఏసీ వెయిటింగ్ హాళ్లతో పాటు వీఐపీల కోసం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్, 6 బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి.

కొత్త డిజైన్‌లో ప్రయాణీకుల రాకపోకల కోసం విశాలమైన స్థలం.. ముందువైపు ప్రకాశవంతమైన లైటింగ్, ఉచిత వైఫై సదుపాయం కూడా కల్పించనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి సుమారు 30 జతల రైళ్లు రాకపోకలు కొనసాగించనున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకునేందుకు సమీపంలోని రహదార్లను విస్తరించాల్సి ఉంది. ఈ ప్రాంతానికి చేరుకునేందుకు వరంగల్ హైవేలో చెంగిచెర్ల రహదారి, కేబుల్ రహదారి, చర్లపల్లి కేంద్ర కారాగార రహదారి, ఎఫ్‌సీఐ రహదారి, రాంపల్లి రహదార్లు ప్రధాన మార్గాలుగా ఉన్నాయి. కాగా ఈ రహదార్లు చిన్నవిగా ఉండటం, వీధి దీపాలు సైతం పలు ప్రాంతాల్లో సక్రమంగా లేకపోవటం, రైల్వే టర్మినల్‌కు రాకపోకలు చేసే వారికి తీవ్ర ఇబ్బందులు కలిగించే అంశాలుగా మారనున్నాయి.

వారికి మాత్రం భారీ ఉపశమనం : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభమైన అనంతరం ఈ రహదార్లపై మరింత ఒత్తిడి పెరిగి వాహనాల రాకపోకలతో తీవ్రమైన ట్రాఫిక్ నమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ ఇబ్బందులను అధిగమించేందుకు గానూ రహదార్లను విస్తరించటం, ఎక్కడా ప్రమాదాలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ లాంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో పక్క రైల్వే విభాగం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకొనే విధంగా ఎంఎంటీఎస్ రైళ్లను కూడా అందుబాటులోకి తేవటం ద్వారా రహదార్లపై కొంత ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా నగర శివారుల్లోని ప్రయాణికులకు మాత్రం భారీ ఉపశమనం కలగనుంది.

నగరంలో ఉన్న స్టేషన్లకు వచ్చేందుకు ట్రాఫిక్‌లో ఇబ్బందులు తప్పించుకుని ఎంచక్కా చర్లపల్లిలో రైలెక్కి గమ్యస్థానాలు చేరిపోవచ్చు. ఈ కొత్త టెర్మినల్ ఓపెన్ అయ్యాక హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం రూ. 428 కోట్లతో ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. ఐదు లిఫ్టులు, ఐదు ఎస్క్‌లేటర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా భవనం, సౌందర్య వంతమైన ముఖ్య ద్వారం నిర్మించారు. ఈ స్టేషన్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆరు టికెట్ బుకింగ్ కౌంటర్లు, లేడీస్ వెయిటింగ్ హాల్, పురుషుల వెయిటింగ్ హాల్, ఎగువ తరగతి వెయిటింగ్ హాల్, ఎగ్జిక్యూటివ్ లాంజ్, మొదటి అంతస్తులో కేఫ్టేరియా, రెస్టారెంట్, స్త్రీలు, పురుషుల కోసం విశ్రాంతి గదులు ఉంటాయి.

స్టేషన్ ముఖద్వారానికి అత్యాధునిక లైటింగ్వ్యవస్థ ఏర్పాటు చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైన నేపథ్యంలో రైల్వే బోర్డు పలు అనుమతులు ఇచ్చింది. చర్లపల్లి స్టేషన్ నుంచి 6 ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపేందుకు అనుమతి వచ్చింది. మరో 12 రైళ్లు ఈ స్టేషన్‌లో ఆపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీన్ని ప్రారంభించిన తర్వాత ఇక్కడి నుంచి రైళ్లను నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు.

ఆ రైళ్లు ఇవే : షాలిమార్ – హైదరాబాద్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్ – సికింద్రాబాద్ – గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ – షాలిమార్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నాయి.

ఈ రైళ్లకు హాల్టింగ్ : విజయవాడ – సికింద్రాబాద్ – విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్, గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ సిర్పూర్ కాగజ్‌నగర్ హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ల్‌కు చర్లపల్లి హాల్టింగ్ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News