Monday, December 23, 2024

చార్లెస్ డికెన్స్ పరితాప పత్రం

- Advertisement -
- Advertisement -

చార్లెస్ డికెన్స్ ప్రసిద్ధిగాంచిన చార్లెస్ జాన్ ఉరఫ్ డికెన్స్ ప్రఖ్యాత ఆంగ్ల రచయిత. ఇంగ్లండ్ రాణి విక్టోరియా కాలం నాటి గొప్ప నవలాకారుడు. ఆయన సృష్టించిన ఆలివర్ ట్విస్ట్, డేవిడ్ కాపర్ ఫీల్ వంటి పాత్రలు ఆంగ్ల సాహిత్య పాఠకులకు నేటికీ సజీవాలే. చార్లెస్ డికెన్స్ ఇంగ్లండ్ లోని హాంప్‌షైర్ రాష్ట్రం పోరట్స్ మౌత్ రేవు నగరంలో 07ఫిబ్రవరి 1812న జన్మించారు. చార్లెస్, క్యాథెరిన్ దంపతులకు 10 మంది పిల్లలు. పేరు సంపాదన లేని రోజుల్లో తన ఆదాయంతో 12 మందిని పోషించటం సవాళ్ళతో కూడిన కష్టమయిన పని. డికెన్స్కు తన అధిక సంతానంపై కోపం.

నలుగురితో ఆపుదామనుకున్నా, కాని కుదరలేదని ఏకాంతం లో అనేవారు. తమ అధిక సంతాన ఇబ్బందికర పరిస్థితికి భార్యను నిందించేవారు. అంతటి సాహిత్య సామాజిక మేధావి సంతానోత్పత్తికి సతిని నిందించటం ఆశ్చర్యం. ఆధిపత్య పురుష అహంకారానికి సంకేతం. నిజానికి క్యాథెరిన్ పెద్ద కుటుంబం నుంచి వచ్చారు. స్త్రీగా అధిక సంతాన సమస్యలు ఆమెకు బాగా తెలుసు. తన పిల్లలకెవరికీ తన తెలివితేటలు అబ్బలేదని డికెన్స్ అసంతృప్తి చెందేవారు. వారికి ఎలాంటి లోపం రాకుం డా పెంచినా పిల్లలు దద్దమ్మలుగా తయారయారని బాధపడేవారు. కాని పిల్లలను ప్రేమతో పెంచారు. తన తండ్రి చిన్న పిల్లలను, ప్రత్యేకించి డోరాను ఇంట్లో తోట లో తిప్పుతూ ఆడించే వారని డికెన్స్ పెద్ద కూతురు మేరీ రాశారు. డోరా అనీ డికెన్స్ ఎనిమిది నెలల పిల్ల. డికెన్స్ డేవిడ్ కాపర్ ఫీల్ పుస్తకం రాస్తున్న కాలంలో పుట్టింది. అందు కే ఆ నవలలోని ప్రధాన పాత్ర, బాల్య పెళ్లి కూతురు డోరా పేరును ఆ అమ్మాయికి పెట్టారు.

డోరా పుట్టిన కొంత కాలానికి తల్లి క్యాథెరిన్ తీవ్ర మానసిక రుగ్మతకు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోడానికి ఆమెను వర్సెస్టర్ షైర్ రాష్ట్రంలోని మాల్వెర్న్ గ్రామానికి పంపా రు డికెన్స్. ఆమె దగ్గరకు రోజూ వెళ్ళి వస్తూ ఉండేవారు. దుస్సంఘటన జరిగిన రోజు 14 మార్చి, 1851 న కూడా అక్కడికి వెళ్లారు. జనరల్ థియేట్రిక్ ఫండ్ మధ్యాహ్న సమావేశంలో ఉపన్యసించవలసి ఉన్నందున లండన్‌కు తిరిగి వచ్చారు. డికెన్స్‌తో పాటు ఆయన ప్రియమిత్రుడు, జీవిత చరిత్రల రచయిత, విమర్శకుడు జాన్ ఫాస్టర్ కూడా ఉన్నారు.

డికెన్స్ మాట్లాడటానికి లేవగానే డికెన్స్ ఇంటి నుంచి డోరా చనిపోయిందని ఫాస్టర్‌కు సమాచారం అందింది. డికెన్స్ ఉపన్యాసం చాలా సేపు కొనసాగింది. ఉపన్యాసం ముగిసిన తర్వాత డికెన్స్‌కు ఆయన ముద్దుల కూతురు డోరా మరణ వార్తను ఫాస్టర్ తెలిపారు. భరించరాని దుఃఖంతో డికెన్స్ ముఖం పాలిపోయింది. రోగం నుంచి కోలుకుంటున్న భార్య క్యాథెరిన్‌కు ఆ భయంకర వార్తను ఎలా అందజేయాలన్నది డికెన్స్‌కు అంతుచిక్కని బాధాకర కర్తవ్యం. ఆమె ఆరోగ్యంపై ఆ దుర్వార్త ఎలాంటి దుష్ప్రభావం చూపుతుందోనన్న భయంతో డోరా చనిపోయినట్లు తెలపకుండా ఆమె ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని మాత్రమే డికెన్స్ తెలపాలనుకున్నాడు. డికెన్స్ క్యాథెరిన్‌కు ఈ విధంగా పరితాప ఉత్తరం రాశారు. ప్రియమైన కాటే, ఈ ఉత్తరాన్ని నెమ్మదిగా, జాగ్రత్తగా చదువుకో (ఇందులో ఏ దుర్వార్త ఉందోనని) తొందరపడితే అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మరల చదవమని నేను నిన్ను అడగవలసివస్తుంది.

ఉన్నట్లుండి చిన్నారి డోరా ఆరోగ్యం క్షీణించింది. నొప్పి తెలియని స్థితికి చేరింది. నిద్ర నుండి లేవగానే పిల్ల ఆరోగ్యం చాలా దెబ్బతింది. నేను నిన్ను మోసగించను. పిల్ల చాలా అనారోగ్యం పాలయిందనుకుంటున్నాను. పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఉంది. (నీవు చూసి) నిశ్శబ్దంగా నిద్రపోతున్నదనుకుంటావు. ఆమె తీవ్రమైన అనారోగ్యంతో ఉందని నా నమ్మకం. కోలుకుంటుందని నమ్మే ధైర్యం చేయలేకపోతున్నాను. ప్రియతమా, నీకు మరోలా చెప్పలేను. ఆమె రోగం అసలు నయం కాకపోవచ్చు. నీవు దూరంగా ఉండడానికి ఇష్టపడవు. నిన్ను దూరంగా ఉంచడానికి రాజీపడలేను.మామూలు ప్రేమాభిమానాలతోనే ఫాస్టర్ ఈ ఉత్తరాన్ని నీవద్దకు తెస్తాడు.

నిన్ను ఇంటికి తీసుకు వస్తాడు. సర్వ సన్నద్ధతతో రమ్మని నీకు మనవి చేయకుండా, ఆదేశించకుండా, నేను ఎప్పుడూ అంటున్నట్లుగానే అందరి తల్లిదండ్రులకు, పిల్లలకు ఉన్నట్లే మనకు కూడా బాధలు ఉంటాయని చెప్పకుండా ఈ ఉత్తరాన్ని ముగించలేను. నీవు వచ్చేటప్పటికి మన చిన్నారి చనిపోయిందని చెప్పవలసి వస్తుందేమో! మిగతా పిల్లల పట్ల నీ బాధ్యతలను నెరవేర్చాలి. వారి పట్ల నీ అచంచల విశ్వాసానికి అర్హురాలివని నిరూపించుకోవాలి. ఈ ఉత్తరాన్ని ధ్యాసతో చదివి, సరయిన విధంగా ప్రవర్తిస్తావన్న నమ్మకం నాకుంది. నీ నిత్యాభిమాని, చార్లెస్ డికెన్స్. 60 ఏళ్ల క్రితం మాధ్యమిక ఉన్నత పాఠశాల హిందీ పాఠ్యాంశంలో చట్టాన్ (బండ) శీర్షికతో కవిత ఉండేది.

అందులో ఒక యువతి భర్త అకాల ప్రమాదంలోమరణిస్తాడు. వార్తను ముందుగా అందజేయాలన్న ఆతురతతో ఎవరో ఆ దుర్ఘటనను ఉన్నదున్నట్లుగా ఆమెకు వివరించారు. ఆ యువతి సంభ్రమాశ్చర్యాలతో షాక్ కు గురవుతుంది. రాతి బండలా మారుతుంది. సుఖసంతోషాలకు, నొప్పులకు స్పందించదు. కన్నీరు, ఏడుపు నవ్వులు మాయమయ్యాయి. ఈ కవిత రచయిత పేరు గుర్తులేదు. కాని ఆ వ్యక్తి చార్లెస్ డికెన్స్ పరితాప పత్రాన్ని తప్పక చదివి ఉంటారు. అందుకే ఒక వ్యక్తికి ప్రియమైనవారు చనిపోయినపుడు ఆ వ్యక్తిని ఆ వార్త వాస్తవికతకు మానసికంగా సిద్ధం చేయాలి. వార్తను సున్నితంగా అంచెలంచెలుగా తెలపాలి. ఆ పనే చార్లెస్ డికెన్స్ చేశారు.

డోరాను లండన్ హై గేట్ శ్మశాన వాటికలో పూడ్చారు. 28 ఏళ్ల తర్వాత ఆమె సమాధి పక్కనే చార్లెస్ డికెన్స్ ప్రియమయిన సతీమణి క్యాథెరిన్ డికెన్స్ సమాధి లేచింది. చార్లెస్ డికెన్స్ 58 ఏళ్ల వయసులో 09 జూన్ 1870న గుండెపోటుతో మరణించారు. నేటి సమాజ సభ్యులందరూ తరతమ భేదాలతో మానసిక రోగాలతో బాధపడుతున్నారు. ప్రజలందరికీ మానసిక శాస్త్ర అవగాహన కల్పించాలి. సమస్య తలెత్తినపుడు సిగ్గుపడకుండా మానసిక వైద్యులను సంప్రదించాలి. సుచికిత్స తీసుకోవాలి. సుఖదుఃఖాలను పరిమితులతో సమన్వయ పరుచుకోవాలి. అపుడు స్వీయ హత్యలు తగ్గగలవు. సమాజం సరయిన దిశలో పయనించగలదు.

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News