Sunday, December 22, 2024

19 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన చార్లెస్

- Advertisement -
- Advertisement -

ఖాట్మాండు: యావత్ ఆసియాలో 1970 దశకంలో అనేక మంది విదేశీయులను చంపిన ‘సీరియల్ కిల్లర్’ చార్లెస్ శోభరాజ్(78) శుక్రవారం నేపాల్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతని జీవితం ‘ది సర్పెంట్’ అనే విజయవంతమైన సిరీస్‌లో వివరించారు. అతనిని ఫ్రాన్స్‌కు బహిష్కరించడానికి ముందుగా ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్‌కు బదిలీ చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.

బహిష్కరణ 15 రోజుల్లో జరగాలని నేపాల్ అత్యున్నత న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఇది ఆలస్యం కావచ్చని అతడి న్యాయవాది గురువారం తెలిపారు. “అతన్ని ఇమ్మిగ్రేషన్‌కి తీసుకెళ్లిన తర్వాత, తదుపరి ఏమి చేయాలన్నది నిర్ణయిస్తారు, అతడికి గుండె సమస్య ఉంది, కాబట్టి అతడు గంగాలాల్ ఆసుపత్రి నుండి చికిత్స పొందాలనుకుంటున్నాడు” అని గోపాల్ శివకోటి చింతన్ విలేకరులకు తెలిపారు.

2017లో హృదయ శస్త్ర చికిత్స చేయించుకున్న శోభరాజ్‌ను ఆరోగ్య కారణాలరీత్యా విడుదల చేయాలని, అతడు శిక్షాకాలంలో మూడు వంతులు పూర్తిచేసుకున్నాడని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 1970 దశకంలో అతడు ఇద్దరు ఉత్తర అమెరికన్లను నేపాల్‌లో హత్య చేశాడు. ఇదిలావుండగా పరిస్థితిని గమనిస్తున్నట్లు నేపాల్‌లోని ఫ్రెంచ్ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి వార్తా సంస్థకు తెలిపారు. “ఒకవేళ అతడిని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తే, ఫ్రాన్స్ అందుకు ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే శోభరాజ్ ఫ్రెంచ్ దేశస్థుడు. అతడి వియత్నమీస్ తల్లి మొదట  భారతీయుడిని వివాహమాడి అతడిని కన్నది. తర్వాత ఓ ఫ్రెంచ్ వ్యక్తిని వివాహమాడింది. శోభరాజ్ ఓ అంతర్జాతీయ నేరస్థుడిగా ఎదిగాడు. చివరికి 1975లో థాయ్‌లాండ్‌లో అతడి నేరాలకు బ్రేక్ పడింది. ఓ రత్నాల వర్తకుడిగా అతడు బాధితులతో స్నేహం ఏర్పరచుకునేవాడు. వారి నుంచి కావలసింది దొంగిలించాక వారికి మాదక ద్రవ్యాలు ఇచ్చి, ఆ తర్వాత వారిని హత్యచేయడం అతడి పద్ధతి. అతడికి ‘బికినీ కిల్లర్’ అన్న మారుపేరు ఉంది. అతడికి దాదాపు 20 హత్యలతో ప్రమేయం ఉంది.

అతడిని 1976లో భారత్‌లో అరెస్టు చేశారు. జైలులో 21 ఏళ్లు గడిపిన తర్వాత 1986లో కారాగార కాపలాదారులకు మత్తుమందు ఇచ్చి జైలు నుంచి తప్పించుకున్నాడు. తర్వాత మళ్లీ అతడిని గోవా తీరంలో పట్టుకున్నారు. 1997లో విడుదల చేశారు. ఆ తర్వాత జర్నలిస్టులకు పెయిడ్ ఇంటర్వూలు ఇస్తూ అతడు ప్యారిస్‌లో జీవించసాగాడు. కానీ 2003లో అతడు నేపాల్‌కు వెళ్లాడు. అయితే ఓ క్యాసినోలో బక్కారట్ ఆడుతున్నప్పుడు అతడిని జర్నలిస్ట్ జోసెఫ్ నాథన్ నాటకీయంగా గుర్తించాడు. ఆయన ‘హిమాలయన్ టైమ్స్’ వ్యవస్థాపకుడు. ఆ తర్వాత చార్లెస్ శోభరాజ్ అరెస్టయ్యాడు.

అమెరికన్ టూరిస్ట్ కొన్నీ జో బ్రోంజిచ్‌ను 1975లో హత్యచేసినందుకు, ఆ తర్వాత బ్రోంజిచ్ కెనాడియన్ కంపేనియన్‌ను చంపినందుకు నేపాల్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. కటకటాలపాలైన శోభరాజ్ తాను నిరపరాధినని వాదించాడు. అంతకు ముందు తానెప్పుడు నేపాల్ పర్యటించనే లేదన్నాడు. “నేను ఎవరినీ చంపలేదు, ఎప్పటికైనా నేను విడుదల అవుతాను” అని అతడు ఖాట్మాండు సెంట్రల్ జైలులో పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపాడు. 1976లో అతడిని పట్టుకున్న పోలీస్ అధికారి సోంపోల్ సుతిమై అతడి విడుదలపై ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. ఇప్పటికే అతడు చేసిన దానికి తగిన శిక్ష అనుభవించాడని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News