Wednesday, January 22, 2025

పట్టాలు తప్పిన ‘చార్మినార్’

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం 8 గంటల 40 నిమిషాలకు చెన్నె నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ మీదుగా నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. సికింద్రాబాద్‌లోనే చాలా వరకు ప్రయాణికులు దిగిపోగా, మిగిలిన వారితో చివరి స్టేషన్ అయిన నాంపల్లికి వచ్చింది. స్టేషన్‌లో ఐదో ప్లాట్‌ఫాంపైకి వచ్చిన రైలు ఆగే సమయంలో అక్కడి డెడ్ ఎండ్ వాల్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా రైలు కుదుపునకు గురికాగా, మూడు బోగీలు ఎస్ 2, ఎస్ 3, ఎస్ 6 పట్టాలు తప్పి పాక్షికంగా దెబ్బతిన్నాయి. సికింద్రాబాద్‌లోనే ప్రయాణికులు చాలా వరకు దిగిపోగా మిగిలిన వారు నాంపల్లిలో దిగేందుకు డోర్‌ల వద్దకు చేరుకుంటుండగానే ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.

అందులో ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని లాలాగుడాలోని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే అధికారులు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. ఓవర్ స్పీడ్‌తో డెడ్ ఎండ్‌ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని రైల్వే సీపీఆర్వో రాకేశ్ వెల్లడించారు. అలాగే ఈ ప్రమాదంపై ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. తీవ్రగాయాలైన వారి కి రూ.2.50 లక్షలు, గాయాలైన వారికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు. అయితే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ది ప్రమాదమా? నిర్లక్ష్యమా? ట్రైన్ డెడ్ ఎండ్ వాల్‌ను ఢీకొట్టడంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు లోకో పైలట్ తప్పిదమే దీనికి కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు.

ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు
నాంపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్ (నాంపల్లి) నుంచి మేడ్చెల్ (47244), మేడ్చల్ నుంచి హైదరాబాద్ (47251) ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రాష్ట్ర రైల్వే పోలీసు అదనపు డిజిపి మహేష్ భగవత్, ఎస్‌పి షేక్ సలీమా, రైల్వే పోలీసు డిఎస్పీ నర్సయ్య తమ సిబ్బందితో సహాయక చర్యలను చేపట్టారు. ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా రైల్వేశాఖ కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాల్సి ఉందని, నిర్లక్షం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని పలువురు ప్రయాణీకులు వాపోయారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌లోనే చాలా మంది ప్రయాణీకులు దిగారు. తర్వాత ఖైరతాబాద్‌లో కొందరు దిగేశారు. కొద్దిమంది మాత్రమే నాంపల్లి స్టేషన్‌లో దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదంపై మంత్రి పొన్నం ఆరా.. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం…
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంపై రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. రైలు సైడ్ వాల్‌ను తాకి పట్టాలు చిన్నగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా మంత్రిగా ఘటనకు గల కారణా లపై అధికారులతో ఆరా తీశారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్చలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రయాణీకులంతా క్షేమం: దక్షిణ మధ్య రైల్వే
చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని ద.మ.రైల్వే అధికారులు ప్రకటించారు. రైలు ప్రమాదానికి గురయ్యే సమయానికి ప్రయాణీకులు దాదాపుగా రైలును దిగినట్టుగా రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో కొందరు ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారని రైల్వే అధికారులు ప్రకటించారు. చెన్నై నుండి వచ్చే చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో ఆరుగురు ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారని ద.మ. రైల్వే ప్రకటించింది. ఈ ప్రమాదంలో గాయపడిన ప్రయాణీకులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ప్రమాదానికి కారణాలు విచారణలో తేలుతాయన్నారు.
రైలు ప్రమాదంపై కేసు నమోదు
నాంపల్లి రైలు ప్రమాదంపై కేసు నమోదు అయింది. నాంపల్లి స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు అయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్1 ఎస్2 ఎస్3 బోగీలు పట్టాలు తప్పినట్టు రైల్వే అధికారులు వివరించారు. మరోవైపు ఈ రైలు ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వేశాఖ కూడా విచారణకు ఆదేశించింది.

చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం ప్రమాదానికి గురైన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు పునరుద్ధరించారు. పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఎంఎంటిఎస్ రైళ్లకు మినహాయించి, ఇతర ఏ సర్వీసులకు ఇబ్బంది కలగలేదని ద.మ.రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద రైలు కోచ్‌లని టెస్టింగ్ కోసం షెడ్డుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News