మన తెలంగాణ/సిటీబ్యూరో: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను భౌగోళికంగా పరిశీలిస్తే అతి చిన్న నియోజకవర్గం చార్మినార్ ఉంది. ఈ నియోజకవర్గం 5.31 చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. అతి పెద్ద నియోజకవర్గంగా ములుగు 3,979 చదరపు కిలోమీటర్లు ఉన్నట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అత్యల్పంగా భద్రాచలంలో 1.46 లక్షలు, అత్యధికంగా శేరిలింగంపల్లిలో 6.94 లక్షల మంది ఓటర్లున్నారు.
రవాణా, భౌగోళిక పరిస్థితులను భట్టి పాలనను అందరికీ చేరువ చేయాలని తెలంగాణ ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత అనేక శాసన సభ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. 36 శాసన సభ నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలో ఉండగా, 8 శాసనసభ నియోజకవర్గాలు మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. 75 శాసనసభ నియోజకవర్గాలు ఒకే జిల్లా పరిధిలో ఉన్నాయి.