Wednesday, January 22, 2025

చాట్ జీపీటీతో కోడింగ్ ఉద్యోగాలు పోతాయా?

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచ టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ ఓ సంచలనం. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రీసెర్చ్ పేపర్లు రాయగలదు, వ్యాసాలు, పద్యాలు, కవితలు రాయగలదు. కోడింగ్ కూడా చేయగలదు. అందుకే అదిప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. దిగ్గజ టెక్ కంపెనీలకు దడ పుట్టిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చాట్ జీపీటీపై స్పందించారు. నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరమ్ 2023లో ఆయన మాట్లాడారు. చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్స్ మనుషుల ఉద్యోగాలపై ఏమాత్రం ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. 1977-78ల్లో ప్రోగ్రామ్ జనరేటర్ వచ్చిన సమయంలోనూ ఇలాంటి ఆందోళనలు వ్యక్తమయ్యాయని చెప్పారు. కోడర్‌పై కూడా చాట్‌జీపీటీ ఏ మాత్రం ఎఫెక్ట్ పడేలా చేయదని వ్యాఖ్యానించారు.

‘కోడర్‌పై చాట్‌జీపీటీ ప్రభావం చూపే అవకాశాలు లేవు. మానవుని మనసు, మెదడు చాలా అనువుగా ఉంటాయి. ఇవి దేన్నయినా ఇట్టే అర్థం చేసుకోగలవు’ అని ఆయన చెప్పారు. చాట్ జీపీటీని ఇతర ప్రయోజనాల కోసం మరింత మెరుగ్గా వినియోగించే ఆలోచనా సామర్థ్యం మానవులకు ఉందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కూడా భారత ఐటీ కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు లేవని నారాయణమూర్తి అన్నారు. గతంలో ఎన్నో సందర్భాల్లో ఇలాంటి పరిస్థితుల నుంచి మన దేశం బయటపడిందని గుర్తుచేసుకున్నారు.

ఇక ఇటీవల టిసిఎస్ కూడా చాట్‌జీపీటీపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది ఒక కోవర్కర్‌గా మాత్రమే పనిచేయగలదని, ఉద్యోగాలపై ఏమాత్రం ప్రభావం చూపదని చెప్పింది. చాట్‌జీపీటీని శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న ఓపెన్ ఏఐ కంపెనీ రూపొందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News