ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.3లక్షలు వసూలు
పరారీలో నిందితుడు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన సంఘటన నగరంలోని వనస్థలిపురం పోలీస్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం… స్థానికంగా ఉంటున్న సుబ్రహ్మణ్యం వనస్థలిపురంలో నిర్మించిన డబుల్ బెడ్ రూము ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి సుబ్రహ్మణ్యం రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు వసూలు చేశాడు. ఓ కుటుంబానికి చెందిన పదిమందికి తాను కలెక్టర్ పిఏ నంటూ చెప్పి డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. డబ్బులు ఇచ్చిన బాధితులు ఇళ్లు ఎప్పడు ఇప్పిస్తావని ఒత్తిడి చేయడంతో రాత్రికి రాత్రే బిచానా ఎత్తేశాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ వెళ్లి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్రహ్మణ్యంతో పాటు అతడి బావమర్దిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో అనేది విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు.