Wednesday, January 22, 2025

నకిలీ పేస్లిప్‌లతో రుణాలు తీసుకుని ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః రుణాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల కెవైసి వివరాలు తీసుకుని బ్యాంక్‌లో రుణం తీసుకుని మోసం చేస్తున్న పది మంది ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఆన్‌లైన్‌లో బాధితుల తరఫున రుణం కోసం దరఖాస్తు చేసి రూ.20కోట్లు కొట్టేశారు. ఇలా 61మంది డాటా తీసుకుని వారి పేరుపై రుణాలు తీసుకుని మోసం చేశారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని కడప జిల్లా, బుక్కపట్నం, ధాతపురానికి చందిన మేకల రాకేష్ కుమార్ రెడ్డి రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారి ఆధార్, పాన్‌కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నంబర్, ఈమేయిల్ సేకరిస్తున్నాడు. దేసాయి దినేష్‌రెడ్డి, గోడు సాయిరవీవర్మ, పాలూరి దీపక్‌కుమార్ రెడ్డి, ఎడవలపాటి రాజ్‌కుమార్, ఏనుగల సురేష్, దగ్గుపాటి సురేష్, డాపోల్ చిట్టిబాబు, హరీష్ చంద్ర గోపాల్ శెట్టి, బోయ ఆదినారాయణ, వడ్డే వెంకటేష్ అందరు కలిసి ముఠాగా ఏర్పడి వేరే వ్యక్తుల పేరుపై రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేస్తున్నారు.

ఇప్పటి వరకు నిందితులు 61మంది అమాయకుల పేరుతో రూ.20కోట్లు రుణం తీసుకుని తిరిగి కట్టకుండా బ్యాంక్‌ను మోసం చేశారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో వీరి భాగోతం మొత్తం బయటపడింది. నిందితులు రుణాలు తీసుకునే వారు హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నట్లు పేస్లిప్పులు క్రియేట్ చేశారు. వాటిని నిందితులు బ్యాంక్‌కు పంపించడంతో వారి పేరుపై రుణాలు మంజూరు చేశారు. రుణం తీసుకుని మోసం చేసేందుకు వారి పేరుపై పెద్ద మొత్తంలో వేతనాలు తీసుకుంటున్నట్లుగా ప్రత్యేకంగా పేస్లిప్‌లు తయారు చేశారు. వాటిని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేసి ప్రతి ఒక్క వ్యక్తిపై రూ.40 నుంచి రూ.50లక్షలు రుణం తీసుకున్నారు.

బ్యాంక్ అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు ప్రతి నెల కొంత మొత్తం చెల్లించారు. తర్వాత రుణం తీసుకున్న వారి అడ్రస్, మొబైల్ నంబర్, మెయిల్ అన్ని మార్చివేశారు. అప్పటి నుంచి బ్యాంక్ నుంచి తీసుకున్న రుణానికి ఈఎంఐలు చెల్లించడం మానివేశారు. దీంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన సైబర్ క్రైం పోలీసులు నిందితుల ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News