హైదరాబాద్: బోథ్ ఎంఎల్‌ఎ రాథోడ్ బాపూరావుపై చీటింగ్ కేసు నమోదైంది. ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించారనే ఆరోపణలపై కోర్టు ఆదేశాల మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు ఎంఎల్‌ఎ రాథోడ్ బాపూరావుపై కేసు నమోదు చేశారు. ఎంఎల్‌ఎ రాథోడ్ బాపూరావు ఆదిలాబాద్ సమీపంలోని బట్టి సమర్గం సర్వే నెంబర్ 53/2లో రెండు గంటల భూమిని ఆదిత్య ఖండేకర్ అనే వ్యక్తికి 2012లో విక్రయించారు. తిరిగి అదే ప్లాట్లను 2019లో సంతోష్ అనే వ్యక్తికి కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ ఫ్లాట్‌ను మొదట కొనుగోలు చేసిన ఆదిత్య ఖండేకర్ కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఎంఎల్‌ఎ రాథోడ్ బాపూరావుతోపాటు సుదర్శన్ అనే వ్యక్తిపై 420 421 409,426 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా బోథ్ ఎంఎల్‌ఎ బాపూరావు బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రానున్న ఎన్నికలకు సంబంధించి బోథ్ స్థానం నుంచి బాపూరావును పక్కనబెట్టి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా అనిల్ జాదవ్‌కు ఆ పార్టీ అధినేత కెసిఆర్ అవకాశం ఇచ్చారు. దీంతో బాపూరావు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రోజున రేవంత్ రెడ్డి నివాసానికి రాథోడ్ బాపూరావు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.