Thursday, January 23, 2025

కార్ల లీజు పేరుతో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కార్లను అద్దెకు తీసుకుని వాటిని వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెడుతున్న ముఠాను బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. వారి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన 16కార్లను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ డిసిపి శ్రీనివాసరావు తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రవీణ్‌కుమార్, మహ్మద్ ఒమర్‌ను అరెస్టు చేయగా, మరో నిందితుడు అహ్మద్ అలీ కోసం గాలిస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన నిందితులు పలువురు వ్యక్తుల నుంచి కార్లను లీజుకు తీసుకున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తామని వారిని నమ్మించి నెల నెల డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో వారు కార్లను అప్పగించారు.

16 కార్లను తీసుకున్న ఈ ముఠా వాటికి ఉన్న జిపిఎస్‌ను తొలగించి వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులకు తాకట్టు పెట్టారు. ఒప్పందం సమయం ముగియడంతో పలువురు కార్ల యజమానులు వీరిని సంప్రదించగా తమవద్ద కార్లు లేవని చెప్పారు. డబ్బులకు వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టామని చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులు సనత్‌నగర్, ఎస్‌ఆర్ నగర్, జగద్గిరిగుట్ట, బాచుపల్లి, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్లను తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి వడ్డీ వ్యాపారుల వద్ద ఉన్న 16 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News