మనతెలంగాణ, హైదరాబాద్ : మ్యాట్రిమోనిలో రిజిస్టర్ చేసుకున్న యువతిని మోసం చేసిన సైబర్ నేరస్థులు దశల వారీగా లక్షలు కాజేశాడు. పోలీసుల కథనం ప్రకారం….ఈస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన అనితారాజ్ అనే యువతి వరుడి కోసం భారత్‌మ్యాట్రిమోనిలో వివరాలు నమోదు చేసుకుంది. ఇటీవల ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి తన పేరు బక్షి క్లిఫర్డ్ అని పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడిననని చెప్పాడు. వ్యాపారం చేస్తూ స్కాట్లాండ్‌లో స్థిరపడ్డానని చెప్పాడు. వివాహం చేసుకుందామని యువతికి చెప్పాడు. ఇందుకు బాధితురాలు కూడా అంగీకరించడంతో కొద్ది రోజులు ఇద్దరు వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకున్నారు.
మన ప్రేమకు గుర్తుగా ఖరీదైన గిఫ్టు పంపిస్తున్నానని ఆమెని నమ్మించాడు. గిఫ్టు పంపించానని కలెక్ట్ చేసుకోవాలని చెప్పాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కస్టమ్స్ అధికారులమని అతడే గొంతుమార్చి ఫోన్ చేశాడు. వేరే ఫోన్ నంబర్ల నుంచి ఫోన్ చేసి మూడు దఫాలుగా రూ.9లక్షలు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. డబ్బులు ఇచ్చిన కూడా బహుమతి రాకపొవడంతో నిందితుడికి ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో తాను మోసపోయానని గ్రహించింది. వెంటనే ఆన్‌లైన్ ద్వారా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైం ఎసిపి కెవిఎం ప్రసాద్ తెలిపారు.