సోషల్ మీడియా వేదికగా మోసాలు
ఎన్నిసార్లు పోలీసులు చెప్పినా వినని వినియోగదారులు
ఖరీధైన వస్తువులు తక్కువ ధరకు ఇస్తామంటే నమ్ముతున్న బాధితులు
గతంలో ఓఎల్‌ఎక్స్…..ఇప్పుడు ఇన్‌స్టాగ్రాం
హైదరాబాద్: ఖరీదైన వస్తువుల పట్ల పలువురికి ఉన్న క్రేజీని సొమ్ము చేసుకుంటున్నారు సైబర్ నేరస్థులు. సమాజంలో కొన్ని వస్తువుల పట్ల చాలామందికి వాడాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వాటిని కొనుగోలు చేసే శక్తి లేకపోవడంతో తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయా అని చూస్తుంటారు. ఈ క్రమంలోనే బాధితులకు ఎక్కడైన ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, కార్లు తక్కువ ధరకు విక్రయిస్తామని ప్రకటనలు చూస్తే చాలా ఆసక్తి కనబర్చుతున్నారు. దీంతో వీరిని టార్గెట్‌గా చేసుకుంటున్న సైబర్ నేరస్థులు అందినకాడికి అమాయకుల నుంచి దోచుకుంటున్నారు. గతంలో ఇలా చాలామంది మోసపోయారు, ఖరీదైన వస్తువులు ఎవరూ తక్కువ ధరకు విక్రయించరని చెప్పినా కూడా బాధితులు వినడంలేదు. సైబర్ నేరస్థులను నమ్మి నిండా మునుగుతున్నారు, చేతిలో డబ్బులు పోయిన తర్వాత పోలీసులకు ఆశ్రయిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన యువతికి యాపిల మొబైల్ అంటే చాలా ఇష్టం, దానిని కొనుగోలు చేసేందుకు తన వద్ద ఉన్న డబ్బులు చాలకపోవడంతో తరచూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చూసేది. ఈ క్రమంలోనే సైబర్ నేరస్థులు యాపిల్ మొబైల్ రూ.6,999కి విక్రయిస్తామని సోషల్ మీడియాలో ప్రకటన చూసింది. తక్కువ ధరకు ఖరీదైన ఫోన్ వస్తుండడంతో వెంటనే సైబర్ నేరస్థులు ఇన్‌స్టాగ్రాంలో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేసింది. సైబర్ నేరస్థులు చెప్పిన మాటలు నమ్మిన యువతి వారు చెప్పినట్లుగా రూ.60,000 పంపించింది. తర్వాత నిందితులు ఫోన్ స్విఛ్ ఆఫ్ చేయడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా చాలామంది బాధితులు సైబర్ నేరస్థుల చేతిలో మోసపోయారు. బాధితులు చెల్లిస్తున్న డబ్బులతో ఎక్కడైన యాపిల్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. కానీ సైబర్ నేరస్థులు చెబుతున్న మాటలు నమ్మి నిండా మునిగిపోతున్నారు. గతంలో సైబర్ నేరస్థులు ఓఎల్‌ఎక్స్ వేదికగా నేరాలు చేసేవారు, ఇప్పుడు రూట్ మార్చిన సైబర్ నేరస్థులు ఇన్‌స్టాగ్రాంలో ప్రకటనలు ఇచ్చి మోసం చేస్తున్నారు.
ప్రకటనలు నమ్మితే అంతే….
గతంలో సైబర్ నేరస్థులు ఓఎల్‌ఎక్స్‌ను వేధికగా చేసుకుని పలు నేరాలు చేశారు. చాలామంది వస్తువులు అమ్మాలన్నా, కొనుగోలు చేయాలన్నా ఓఎల్‌ఎక్స్‌ను ఎక్కువగా చూస్తుంటారు. దానిని ఆసరాగా చేసుకుని చాలామంది సైబర్ నేరస్థులు అమాయకులను ఆకట్టుకునేలా ప్రటకనలు ఇచ్చి డబ్బులు తీసుకుని మోసాలు చేశారు. దీనిపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిండంతో చాలా వరకు నేరాలు తగ్గాయి. ప్రస్థుత కాలంలో చాలామంది యువతకు యాపిల్ ఫోన్‌పై ఎక్కువగా క్రేజీ ఉంది. దానిని ఆసరాగా చేసుకుని ఇన్‌స్టాగ్రాం వేదికగా నేరాలు చేస్తున్నారు. తక్కువ ధరకు ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయిస్తామని ప్రటకనలు ఇస్తున్నారు. వాటిని నమ్మి సంప్రదించిన వారిని నిండా ముంచుతున్నారు. వాస్తవానికి యాపిల్ 13 ప్రో మ్యాక్స్ మొబైల్ రూ.1,38,000 ఉంటుంది. ఇలాంటి దానిని తక్కువ ధర రూ.6,999ఇవ్వడం అసలు సాధ్యం కాదు. సైబర్ నేరస్థులు ఇచ్చిన ప్రకటన చూసి ఎవరికైనా అనుమానం వస్తుంది. కానీ ఆయా వస్తువులపై ఉన్న క్రేజీ వల్ల ఇవి పట్టించుకోకుండా తక్కువ ధరకు వస్తోందని ఆశ పడి లక్షలాది రూపాయలు నష్ట పోతున్నారు.