పర్సిల్ పంపించి రూ.18 కాజేసిన నిందితుడు
నైజీరియన్ అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేసిన నైజీరియన్‌ను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, పది సిమ్ కార్డులు, రెండు డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. నైజీరియాకు చెందిన అమూల్యన్స్ ప్రిన్స్ ఫెలిక్స్(50) బిజినెస్ వీసాపై ఇండియాకు 2012లో వచ్చాడు. ఇతడి వీసా గడువు 2016లో ముగిసినా ఇండియాలోనే ఉంటున్నాడు. గ్రేటర్ నోయిడాలో ఉంటూ సైబర్ నేరాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన యువతి మ్యాట్రీమోని వెబ్‌సైట్‌లో తన వివారాలను అప్‌లోడ్ చేసింది. ఇది చూసిన నిందితుడు తన పేరు వరుణ్ రావుగా, అమెరికాలో పనిచేస్తున్నానని చెప్పాడు. ఆమెను వివాహం చేసుకునేందుకు ఆసక్తి ఉన్నట్లు మెసేజ్ చేశాడు. అప్పటి నుంచి ఇద్దరు వాట్సాప్‌లో ఛాటింగ్, ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. దీంతో తన ప్లాన్‌ను అమలు చేయడం ప్రారంభించాడు.
మన స్నేహానికి గుర్తుగా అమెరికా నుంచి బంగారు ఆభరణాలు, డాలర్లు, విలువైన వస్తువులు పంపిస్తున్నానని చెప్పాడు. ఇది నమ్మిన బాధితురాలు అంగీకరించింది. జూన్1వ తేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులమని ఫోన్ చేశారు. మీకు పార్సిల్ వచ్చిందని, దానికి కస్టమ్స్ డ్యూటీ, ఐటి,జిఎస్‌టి తదిరాల ఛార్జీలను చెల్లించాలని చెప్పారు. ఇది నమ్మిన యువతి వారు చెప్పిన విధంగా పలుమార్లు రూ.18లక్షలు వారి బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసింది. అయినా కూడా నిందితులు మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నోయిడాలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి నిందితుడిని అరెస్టు చేసి తీసుకుని వచ్చారు. ఇన్స్‌స్పెక్టర్ వెంకటరామిరెడ్డి, మధుసూదన్ తదితరలు పట్టుకున్నారు.