అడ్మిషన్ ఇప్పిస్తానని రూ.4.80లక్షలు తీసుకున్న నిందితుడు
అరెస్టు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్: పిహెచ్‌డి అడ్మిషన్ ఇప్పిస్తానని చెప్పి పలువురు అమాయకుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, ఓటర్ ఐడి, రూ.3,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హర్యాణా రాష్ట్రం,గురుగావ్‌కు చెందిన మహ్మద్ రఫీక్ పంచపూరి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో భార్య విడిచిపెట్టి పోయింది. దీంతో నిందితుడు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. దానికి ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకుని పిహెచ్‌డి గ్రూపుల్లో చేరాడు.
ఫేస్‌బుక్‌లో గ్లోబల్ ఎడ్యుకేటర్ కన్సల్‌టెన్సీ, వారణాసి పేరుతో పేరుపొందిన యూనివర్సిటీల్లో పిహెచ్‌డి అడ్మిషన్లు ఇప్పిస్తానని చెప్పి ప్రకటనలు ఇచ్చాడు. వీటిని చూసిన మీర్‌పేట్‌కు చెందిన వ్యక్తి నిందితుడిని ఫోన్‌లో సంప్రదించాడు. పిహెచ్‌డి అడ్మిషన్ ఇప్పిస్తానని చెప్పడంతో పలు ఛార్జీల కింద రూ.4,80, 000 బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. డబ్బులు అందిన తర్వాత నిందితుడు ఫోన్ కాల్స్‌కు స్పందించడం మానివేశాడు. ఇలాగే చాలామందికి పిహెచ్‌డి అడ్మిషన్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడంతో నిందితుడిపై జమ్ముకాశ్మీర్, పంజాబ, ఉత్తరప్రదేశ్‌లో కేసులు నమోదయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్ కేసు దర్యాప్తు చేశాడు.