Wednesday, January 22, 2025

నకిలీ కంపెనీలతో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

cheating with fake companies in hyderabad

బ్యాంకులను నిండా ముంచిన ఘనులు
కోట్లాది రూపాయలు రుణం తీసుకున్న కేటుగాళ్లు
మునిగాక తెలుసుకుంటున్న బ్యాంక్ అధికారులు

హైదరాబాద్: నకిలీ కంపెనీలను సృష్టించిన నిందితులు బ్యాంక్‌లను మోసం చేస్తున్నారు. లేని కంపెనీలను ఉన్నట్లు పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలు రుణం తీసుకున్నారు. కోట్లాది రూపాయలు తీసుకున్న నిందితులు కొద్ది రోజులు రుణం చెల్లించిన తర్వాత ఆపివేస్తున్నారు. అప్పటికి కాని కళ్లు తెరవని బ్యాంక్ అధికారులు నిందితులు తనఖా పెట్టిన పత్రాలను చూసి మోసపోయామని గ్రహిస్తున్నారు. చాలామంది నిందితులు వివిధ ప్రాంతాల్లో కంపెనీలు ఉన్నట్లు పత్రాల్లో చూపెడుతున్నారు. నిందితులు పేర్కొన్న కంపెనీల అడ్రస్‌కు వెళ్లిన బ్యాంక్ అధికారులు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. నిందితులు చెప్పిన అడ్రస్‌లో కంపెనీ కాదుకదా, కనీసం కంపెనీ ఆనవాళ్లు కూడా అక్కడ లేవు. కొందరు నిందితులు భూమి పత్రాలు తనఖాపెట్టగా అవి కూడా నకిలీవి ఉంటున్నాయి. ఆయా పత్రాలను రుణం ఇచ్చిన తర్వాత బ్యాంక్ అధికారులు చూడడంతో కోట్లాది రూపాయలు మునుగుతున్నారు. ఇలాంటి నేరాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు భార్యభర్తలు కలిసి రూ.3 కోట్లు రుణం తీసుకుని ప్లాట్ నకిలీ పత్రాలు పెట్టి మోసం చేశారు. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్లాట్ ఉన్నట్లు ఇద్దరు నిందితులు పేర్కొన్నారు.

రుణం తీసుకున్న నిందితులు నెల వారీ కిస్తీలు కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు భూమిని వేలం వేసేందుకు ప్లాట్ వద్దకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. దీంతో బ్యాంక్ అధికారులు సిసిఎస్‌లో ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వరంగల్ జిల్లాకు చెందిన నిందితుడు బ్యాంక్‌లకు టోపీ పెట్టేందుకు ప్లాన్ వేశాడు. దీనిని అమలు చేసేందుకు అమాయకుల ఆధార్‌కార్డులు వివరాలు తీసుకుని నిండాముంచాడు. వారికి బ్యాంక్ రుణాలు ఇప్పిస్తానని నిరక్షరాస్యుల నుంచి ఆధార్ కార్డులు తీసుకుని నకిలీ కంపెనీని ఓపెన్ చేశాడు. దాదాపుగా 52మంది పేరుతో బ్యాంక్ ఖాతా తీసి వారి పేరుతో క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. ప్రతి నెల వారికి నెలకు లక్ష రూపాయల నుంచి రూ.2లక్షలు ఇస్తున్నట్లు వారి బ్యాంక్ ఖాతాలో జీతం వేసేవాడు. తర్వాత వాటిని బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేసేవాడు. ఇలా చేయడంతో ఐసిఐసిఐ బ్యాంక్, సిటిబ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లను నమ్మించి వారి పేరుతో భారీగా క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్ షాపింగ్, టూర్లు, ఫైవ్ స్టార్ హోటళ్లలో భార్య పిల్లలతో జెల్సా చేశాడు. ఇలా బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1.53కోట్లు వాడుకుని బ్యాంక్‌లను నిండామంచాడు. క్రెడిట్ కార్డును వాడుకున్న ఖాతాదారులు తిరిగి డబ్బులు మొదట్లో చెల్లించినట్లు నిందితుడు చేశాడు. ఇలా రుణం తీసుకున్న డబ్బుల్లో వారి బ్యాంక్ ఖాతాల్లో తక్కువ డబ్బులు వేసేవాడు. తర్వాత క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది, నిందితుడు చెప్పినట్లు తనకు కంపెనీ లేదని, ఉద్యోగులు లేరని, అమాయకుల పేరుతో బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసి నిండిముంచినట్లు గుర్తించారు. వెంటనే నిందితులను అతడికి సహకరించిన వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలానగర్‌కు చెందిన ఇద్దరు సోదరులు తమకు కంపెనీ ఉందని చెప్పి కెనరా బ్యాంక్ నుంచి రూ.1.30కోట్లు రుణం తీసుకుని నిండాముంచారు. అహ్మద్ ఫయాజ్, మహ్మద్ చాంద్‌పాషా ఇద్దరు కలిసి ఎఎఫ్‌ఎస్ కన్‌స్ట్రక్చన్స్ పేరుతో కంపెనీని సృష్టించారు. దాని పేరుతో రుణం తీసుకున్నారు, తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు నిందితులు తనఖా పెట్టిన భూమి కాగితాలను పరిశీలించి, తనిఖీ చేసేందుకు వెళ్లగా అక్కడ కంపెనీ తాలూకు ఎలాంటా ఆనవాళ్లు లేవు. ప్రసాద్ రెడ్డి, మహాలక్ష్మి అనే ఇద్దరు వ్యక్తులు నకిలీ కంపెనీని సృష్టించి కెనరా బ్యాంక్ నుంచి రూ.1.41 కోట్ల రుణం తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు సంస్థ కార్యాలయం, భాగస్వాముల చిరునామాకు వెళ్లగా ఎవరూ లేరు. నిందితులు నకలీ డాక్యుమెంట్లు పెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకుని మోసం చేసినట్లు గుర్తించారు. రెండు కేసుల్లో కెనరా బ్యాంక్ అధికారులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బ్యాంక్‌ల నిర్లక్ష్యం….
సామాన్యులకు రుణం ఇవ్వాలంటే సవాలక్ష నిబంధనలు చెబుతున్న బ్యాంక్ అధికారులు మోసం చేస్తున్న వారికి కోట్లాది రూపాయల రుణం ఎలా ఇస్తున్నారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భూములకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేయకుండా కోట్లాది రూపాయల రుణాలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు బ్యాంక్ అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News