హైదరాబాద్: మూడురోజులుగా సర్వర్ సమస్యతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద కొనుగోలు, విక్రయదారులతో కూడిన క్యూలైన్ భారీగా ఉంటుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కొత్తగా ప్రతి డాక్యుమెంట్‌కు సబ్ రిజిస్ట్రార్ వేలిముద్ర వేసి ఆ డాక్యుమెంట్‌ను ఓకే చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతోంది. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూములకు తహసీల్దార్‌లు ఇదే విధానాన్ని అమలు చేస్తుండడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఈ విధానాన్నే కొత్తగా అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్‌లు ప్రతి డాక్యుమెంట్‌కు వేలిముద్ర వేయగానే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్‌లో (కార్డులో) ఆ రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఫీడింగ్ అవుతుండడంతో సర్వర్‌పై అదనపు భారం పడుతుందని సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొంటున్నారు. గతంలో సబ్ రిజిస్ట్రార్‌లు సంతకం చేయగానే క్రయ, విక్రయదారుల ఫొటోలను తీసుకొని వారి వేలిముద్రలను తీసుకునేవారు. దీంతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యేది.
ప్రస్తుతం ఆ శాఖ ఉన్నతాధికారులు తీసుకొచ్చిన ఈ నూతన విధానంతో సర్వర్‌పై ఎక్కువ భారం పడుతుందని సబ్ రిజిస్ట్రార్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త విధానం అమల్లోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద మూడురోజులుగా క్రయ, విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని, టెక్నికల్ టీం తమవంతు ప్రయత్నాలు చేస్తోందని త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
సబ్ రిజిస్ట్రార్‌లదే బాధ్యత…
అయితే ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకురావడం వెనుక ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించే దిశగా తాము కృషి చేస్తున్నామని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలపడం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్‌లు తమ లాగిన్‌లో ప్రతి డాక్యుమెంట్‌కు వేలిముద్ర వేస్తే ఆ రిజిస్ట్రేషన్ విషయంలో పూర్తిగా ఆయనే బాధ్యుడిగా ఉండాల్సి ఉంటుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనల్లో కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు అవినీతికి పాల్పడిన సంఘటనల్లో తప్పుడు రిజిస్ట్రేషన్‌ల విషయంలో తప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ విధానంతో ప్రతి డాక్యుమెంట్‌కు సంబంధించిన పూర్తి బాధ్యత సబ్ రిజిస్ట్రార్ వహించాల్సి ఉంటుందని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్టుగా వారు పేర్కొంటున్నారు. ఈ నూతన విధానంతో తాము ఇబ్బందులు పడుతున్నామని, దీనివల్ల కొత్తగా ఒనగూరే ప్రయోజనం లేదని సబ్ రిజిస్ట్రార్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రతి రిజిస్ట్రేషన్‌కు అదనపు సమయం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలల క్రితం మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో..
రెండు నెలల క్రితం మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 20 డాక్యుమెంట్‌లకు సంబంధించి అవినీతి జరిగింది. అక్కడ పనిచేసే కొందరు సిబ్బంది గతంలో జరిగిన డాక్యుమెంట్‌లను తొలగించి వాటి స్థానంలో అదే నెంబర్‌తో వేరే డాక్యుమెంట్‌లకు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఆయా అధికారులు, సిబ్బంది చేసిన తప్పిదంతో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యజమానుల ఆస్తుల వివరాలు ఈసీలో కనిపించలేదు. దీంతో ఆయా ఆస్తుల యజమానులందరూ కలిసి ఈ విషయమై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ సంఘటనపై విచారణ జరిపి ఇద్దరు సబ్ రిజిస్ట్రార్‌లతో పాటు మరో ముగ్గురు సిబ్బందిపై చర్యలు చేపట్టారు. ఈ సంఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ఆ శాఖ ఉన్నతాధికారులు పకడ్భందీగా రిజిస్ట్రేషన్‌లు చేయడంతో పాటు క్రయ, విక్రయదారులకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను మరింత పారదర్శకంగా చేపట్టేలా ఇలాంటి కొత్త విధానాలను అమల్లోకి తీసుకొస్తున్నట్టు వారు తెలిపారు.